Indiramma Towers: కేవలం రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్.. ఎవరు అర్హులంటే..
Indiramma Housing Towers
Indiramma Towers: రాష్ట్రంలోని పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) వెలుపల ఉన్న ఐదు ప్రధాన నగరాల్లో ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తోంది. ఈ పథకం మొదటి విడతలో భాగంగా మొత్తం 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు తాజాగా డిమాండ్ సర్వే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ పథకం కింద ఎంపికైన ఒక్కో అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ. 5 లక్షల భారీ సబ్సిడీని అందిస్తోంది. దీనివల్ల లబ్ధిదారుడు తన వాటాగా కేవలం రూ. 3.50 లక్షలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. జీ+5 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తుల విధానంలో నిర్మించే ఈ టవర్లలో, ప్రతి ఫ్లాట్ రిజిస్ట్రబుల్ విస్తీర్ణం 512 చదరపు అడుగులుగా ఉండనుంది.
ఐదు నగరాల్లో నిర్మాణ ప్రాంతాలు ఇవే..
రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఒక్కో చోట 480 చొప్పున మొత్తం 2,400 ఫ్లాట్లను నిర్మించనున్నారు:
నిజామాబాద్: నాగారం (ఆర్జీకే కాలనీ)
వరంగల్: గొర్రెకుంట
హనుమకొండ: మడికొండ
నల్గొండ: మామిళ్లగూడ
మహబూబ్‌నగర్: బండమీదిపల్లి
అర్హత ప్రమాణాలు & నిబంధనలు
దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించి ఉండకూడదు.
సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంతిల్లు కానీ, నివాస స్థలం కానీ లేని స్థానికులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
ఫ్లాట్ కేటాయించిన నాటి నుంచి కనీసం 10 సంవత్సరాల పాటు దానిని ఇతరులకు విక్రయించడానికి కానీ, అద్దెకు ఇవ్వడానికి కానీ అనుమతి లేదు.
నాలుగు సులభ వాయిదాలలో చెల్లింపు సౌకర్యం
లబ్ధిదారుడి వాటా అయిన రూ. 3.50 లక్షలను ఒకేసారి కాకుండా నాలుగు దశల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. తాత్కాలిక కేటాయింపు సమయంలో రూ. 1 లక్ష, ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక రూ. 1 లక్ష, ఫినిషింగ్ దశలో రూ. 1 లక్ష, చివరగా ఫ్లాట్ అప్పగించే సమయంలో మిగిలిన రూ. 50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, నిబంధనలకు అనుగుణంగా బ్యాంక్ రుణాలు పొందే అవకాశం కూడా ఉంది.
దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు
అర్హులైన అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు రుసుముతో పాటు రూ. 10,000 ఈఎండీ (EMD) డిపాజిట్ చెల్లించి సమీపంలోని మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ లాటరీలో ఫ్లాట్ దక్కకపోతే ఈఎండీ మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం లక్కీ డ్రా (లాటరీ) , క్షేత్రస్థాయి విచారణ ద్వారా అర్హులకు తుది కేటాయింపులు చేస్తారు.
ఆసక్తి గలవారు డిసెంబర్ 5, 2026 లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాల కోసం హౌసింగ్ బోర్డు హెల్ప్‌లైన్ నంబర్ 040-24603572 ను లేదా అధికారిక వెబ్సైట్ tghb.telangana.gov.in ను సంప్రదించవచ్చు.