Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Cyclone Murasu Update: తుపాను తీరం దాటినా ముప్పు తప్పలేదు..ఏపీలో 8 జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్.. నీట మునిగిన విజయవాడ..

jagan 04 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Cyclone Murasu Update: తుపాను తీరం దాటినా ముప్పు తప్పలేదు..ఏపీలో 8 జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్.. నీట మునిగిన విజయవాడ..

Vijayawada Rains

Cyclone Murasu Update: తీవ్ర తుపాను ‘మురాసు’ (Murasu) ధాటికి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వణికిపోతోంది. తుపాను తీరం దాటినప్పటికీ, దాని తీవ్రత ఏమాత్రం తగ్గకుండా నెమ్మదిగా కదులుతుండటంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం , గుంటూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా తీవ్ర జలమయ పరిస్థితి ఏర్పడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. పట్టణాల్లోని రహదారులు చెరువులను తలపిస్తుండగా, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో పలు ప్రాంతాలు చీకట్లోనే ఉండిపోయాయి.

మురాసు దాటికి బెజవాడ నగరం అతలాకుతలమైంది. మంగళవారం రాత్రి నుంచి నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షంతో నగరంలోని ఆటోనగర్, మహానాడు రోడ్డు, నోవాటెల్ రోడ్డు, లయోలా కాలేజీ రోడ్లతో పాటు బందరు రోడ్డు , పాలిటెక్నిక్ రోడ్లు ముంపునకు గురయ్యాయి. బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు భారీగా చేరుకోగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

ఈ తీవ్ర తుపాను తీరాన్ని తాకిన తర్వాత క్రమంగా బలహీనపడుతూ తెలంగాణ సరిహద్దుల వైపు కదులుతున్నప్పటికీ, రాబోయే 24 గంటల్లో మరోసారి విస్తారంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ తదితర 8 జిల్లాలకు ఆకస్మిక వరదల (Flash Floods) ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట ప్రాంతాల్లో వర్షపు నీరు ఆర్టీసీ బస్టాండ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో రహదారులు చెరువులను తలపిస్తుండగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్టాండ్‌ నీటమునిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు యంత్రాంగం శ్రమిస్తున్నప్పటికీ భారీ వర్షం వల్ల పనులకు అంతరాయం కలుగుతోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.