Skip to content
తెలంగాణ › వార్తలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త అధికారులు, పూర్తి వివరాలివే..

Krishna Rao 29 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త అధికారులు, పూర్తి వివరాలివే..

Telangana PRC: పీఆర్సీ కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల ఎదురు చూపులు...ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు నెరవేరుతాయా.. లేదా..?

తెలంగాణలో పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేయడంతో పాటు, మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇంధనం, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, రవాణా, పట్టణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమం సహా పలు శాఖల్లో ఈ మార్పులు చేసింది.

ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (స్పెషల్‌-ఏ) బుధవారం జీవో ఆర్‌టీ నంబర్‌ 1553ను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికార పరిధిలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇంధన శాఖకు జయేశ్‌ రంజన్‌, వికాస్‌ రాజ్‌

1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌కు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆయన మెట్రోపాలిటన్‌ ఏరియా, పట్టణాభివృద్ధి (హెచ్‌ఎండీఏ పరిధి) శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

ఇదే బ్యాచ్‌కు చెందిన వికాస్‌ రాజ్‌ను రవాణా, రోడ్లు, భవనాల శాఖ నుంచి బదిలీ చేసి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన నవీన్‌ మిట్టల్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేశారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగాల బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.

పంచాయతీరాజ్‌, క్రీడలు, రెవెన్యూ శాఖల్లో మార్పులు

యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏ. వాణీ ప్రసాద్‌కు క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెరిటేజ్‌ తెలంగాణ డైరెక్టర్‌ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఈ బాధ్యతల నుంచి జయేశ్‌ రంజన్‌ను తప్పించారు.

ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న శైలజా రామయ్యర్‌ను రెవెన్యూ శాఖలోని దేవాదాయ విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమించారు.

రెవెన్యూ శాఖలో విపత్తు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు కూడా ఆయన కొనసాగించనున్నారు. ఇప్పటివరకు గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వహించిన శశిబాచి ఘోష్‌ స్థానంలో రాహుల్‌ బొజ్జా నియమితులయ్యారు.

రవాణా, పట్టణాభివృద్ధి శాఖలకు కొత్త బాధ్యతలు

రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి కె.ను నియమించారు. ఆయన రవాణా కమిషనర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖకు సంబంధించిన ప్రస్తుత బాధ్యతలను కూడా కొనసాగిస్తారు.

హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మెట్రోపాలిటన్‌ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగానూ ఆయన వ్యవహరించనున్నారు. ఈ బాధ్యతల నుంచి జయేశ్‌ రంజన్‌ను తప్పించారు.

మహిళా, శిశు సంక్షేమం.. వైద్య శాఖల్లోనూ మార్పులు

మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శృతి ఓజాను నియమించారు. ఇప్పటివరకు ఈ విభాగంలో డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణను ఆ శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎండీగా తెలంగాణ రైతు విద్యుత్‌ పంపిణీ సంస్థకు సంబంధించిన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం. ముషరఫ్‌ అలీ ఫారూఖీని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. తెలంగాణ రైతు విద్యుత్‌ పంపిణీ సంస్థకు సంబంధించిన అదనపు బాధ్యతలను ఆయన కొనసాగిస్తారు.

విద్యుత్‌ సంస్థల్లోనూ అదనపు బాధ్యతలు

టీజీఎస్‌పీడీసీఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న జితేష్‌ వి. పాటిల్‌కు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సంబంధిత శాఖలు, అధికారులు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మార్పులతో రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో పరిపాలనా బాధ్యతల పునర్వ్యవస్థీకరణ జరిగింది.

ట్యాగ్‌లు: Telangana