Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Drought Alert: వర్షాభావంతో తెలంగాణలో తీవ్ర కరువు ముప్పు.. కరువు మండలాలను వెంటనే ప్రకటించి నష్టపరిహారం అందించాలని సీపీఐ డిమాండ్..

jagan 27 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Drought Alert: వర్షాభావంతో తెలంగాణలో తీవ్ర కరువు ముప్పు.. కరువు మండలాలను వెంటనే ప్రకటించి నష్టపరిహారం అందించాలని సీపీఐ డిమాండ్..

CPI Meeting

సాధారణం కంటే 24 శాతం లోటు వర్షపాతం – అడుగంటిన జలాశయాలు

20 లక్షల ఎకరాల్లో పంట నష్టం – పడిపోయిన పత్తి, వరి దిగుబడులు

వర్షాభావంతో తెలంగాణలో తీవ్ర కరువు ముప్పు

ప్రభుత్వానికి సీపీఐ 15 డిమాండ్లు

Telangana Drought Alert: ఎల్‌నినో (El Niño) ప్రకోపం , వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, తక్షణమే కరువు మండలాలను ప్రకటించి బాధితులకు నష్టపరిహారంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ (CPI) రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు ప్రవేశపెట్టిన కరువు తీర్మానానికి సమితి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు తీవ్రంగా విఫలం కావడం వల్ల వ్యవసాయ రంగం కుదేలైందని, సాగునీటితో పాటు తాగునీటి ఎద్దడి ప్రమాదం ముంచుకొస్తోందని సీపీఐ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 812.5 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, కేవలం 618.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దాదాపు 18 జిల్లాల్లోని 331 కి పైగా మండలాల్లో 24 శాతానికి పైగా లోటు వర్షపాతం ఏర్పడిందని, మొత్తం 375కు పైగా మండలాల్లో స్పష్టమైన కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని సమావేశం పేర్కొంది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన ప్రాజెక్టుల నీటి నిల్వలు 470 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం కేవలం 170 టీఎంసీలకు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21,500 సాగునీటి చెరువులలో కేవలం 550 చెరువుల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయని, భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం వల్ల అడవుల్లోని వాగులు ఎండిపోయి వన్యప్రాణులతో పాటు పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడిందని తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో సుమారు 20 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తెలంగాణ ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి 48.20 లక్షల ఎకరాల్లో సాగవ్వగా, అందులో 25 శాతం పంట పూర్తిగా దెబ్బతింది. సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, అది కేవలం 4 నుంచి 5 క్వింటాళ్లకు పడిపోయింది. మరోవైపు వరి పంట సాగు విస్తీర్ణం గత ఏడాది 69.19 లక్షల ఎకరాల నుంచి 57.04 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. పండించిన పొలాలు కూడా పొట్టకొచ్చిన దశలో నీరందక, విద్యుత్ కోతలు , భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఎండిపోతున్నాయని నేతలు పేర్కొన్నారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసి నివేదికలను సిద్ధం చేస్తున్న తరుణంలో, బాధిత రైతులను ఆదుకునేందుకు సీపీఐ 15 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. తక్షణమే ఆల్‌పార్టీ , రైతు సంఘాల సమావేశం ఏర్పాటు చేసి కరువు మండలాలను అధికారికంగా ప్రకటించాలని కోరింది.

నష్టపరిహారం కింద వరి పంటకు ఎకరానికి రూ. 30,000, పత్తి , మిర్చి పంటలకు రూ. 50,000, ఇతర పంటలకు రూ. 20,000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేసింది. అలాగే కౌలు రైతులను గురించించి నష్టపరిహారం ఇవ్వాలని, సాగునీరు, ఉచిత నిరంతర విద్యుత్ అందించాలని సూచించింది. పశుగ్రాసాన్ని సరఫరా చేయడంతో పాటు చౌక ధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేయాలని, ఉపాధి హామీ చట్టం కింద వ్యవసాయ కార్మికులకు అదనపు పనిదినాలు కల్పించి ఆదుకోవాలని సిపిఐ తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని స్పష్టంగా కోరింది.