Skip to content
తెలంగాణ › వార్తలు

Justice Tapabrata Chakraborty: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి.. ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయిన జస్టిస్‌ పి.శామ్‌ కోషి..

jagan 27 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Justice Tapabrata Chakraborty: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి.. ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయిన జస్టిస్‌ పి.శామ్‌ కోషి..

Justice Tapabrata Chakraborty

Justice Tapabrata Chakraborty: దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను (Chief Justices) నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ తపబ్రత చక్రవర్తిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJ) పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ పి.శామ్ కోషిని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్మానించింది. తెలంగాణ, ఢిల్లీలతో పాటు గుజరాత్, ఉత్తరాఖండ్ హైకోర్టులకూ నూతన సీజేల పేర్లను కొలీజియం ప్రతిపాదించింది.

ప్రస్తుతం గుజరాత్ హైకోర్టులోనే న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మనాష్ రంజన్ పాఠక్‌ను అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించగా, పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ సింగ్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా సిఫార్సు చేశారు. సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు తుది నిర్ణయం తీసుకుంది. ఈ సిఫార్సుల జాబితాను కేంద్ర న్యాయశాఖకు పంపగా, భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.

న్యాయవాద నేపథ్యం ఉన్న కుటుంబంలో 1967లో జన్మించిన జస్టిస్ తపబ్రత చక్రవర్తి, 1991 జనవరి 29న అడ్వొకేట్‌గా ఎన్‌రోల్ అయ్యారు. కలకత్తా హైకోర్టులో సివిల్, రాజ్యాంగ, సర్వీసు , విద్యా సంబంధిత కేసుల్లో దాదాపు 22 ఏళ్ల పాటు సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అక్టోబర్ 30, 2013న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన, మార్చి 14, 2016న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ న్యాయవాద, న్యాయమూర్తి అనుభవం ఉన్న ఆయన త్వరలోనే తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

1967 ఏప్రిల్ 30న జన్మించిన జస్టిస్ పి.శామ్ కోషి 1990లో లా డిగ్రీ పూర్తి చేసి, 1991 మార్చి 9న న్యాయవాదిగా రికార్డయ్యారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో విస్తృతంగా సేవలు అందించిన ఆయన 2005-06 కాలంలో డిప్యూటీ అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. సెప్టెంబర్ 16, 2013న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2016 మార్చి 8న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జూలై 27, 2023న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన ఆయన, 2025 జూలైతో పాటు అక్టోబర్ 6, 2026 నుంచి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయనను ఢిల్లీ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం నిర్ణయించింది.