Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Cyclone Arnab Alert: అర్నాబ్ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

Krishna Rao 26 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Cyclone Arnab Alert: అర్నాబ్ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

Andhra Pradesh Rains

27, 28 తేదీల్లో అత్యవసరమైతేనే బయటకు రావాలి

ఆ తేదీలలో పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవులు

లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి

Cyclone Arnab Alert : అర్నాబ్ తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం నుంచి 28వ తేదీ వరకు భారీ వర్షాలు, గంటకు 115 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు అధికారులకు సహకరించి భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఈ నెల 27, 28 తేదీల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించవద్దని, చెట్ల కింద నిలబడవద్దని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రభావిత ప్రాంతాలు, కచ్చా ఇళ్లలో నివసించే ప్రజల భద్రత కోసం 273 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. అధికారులు, సిబ్బంది ముందస్తుగా తరలివెళ్లాలని సూచించినప్పుడు ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. తుపాను సమయంలో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లడంలో జాప్యం చేయడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

బలమైన గాలుల కారణంగా చెట్లు కూలి రహదారులకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున వాటిని తక్షణమే తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైన చోట్ల వినియోగించేందుకు పవర్ సా యంత్రాలు, జేసీబీలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి సబ్‌స్టేషన్ వద్ద అవసరమైన విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచామని వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడం, రోడ్లపై వరద నీరు ప్రవహించడం, రహదారులపై రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను గమనించాలని, నీరు ప్రవహిస్తున్న రహదారులను దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరద ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రజలకు సూచించారు.

తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమాచారం, సహాయం కోసం కింది నంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు.

కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:

  • జిల్లా కలెక్టరేట్: 08672-252399
  • ఆర్డీవో కార్యాలయం, మచిలీపట్నం: 08672-252486
  • ఆర్డీవో కార్యాలయం, ఉయ్యూరు: 08676-232589
  • ఆర్డీవో కార్యాలయం, గుడివాడ: 08674-243698

అదేవిధంగా ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రస్తుత సమాచారం ప్రకారం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎక్కడ తీరం దాటుతుందనే విషయంలో స్పష్టత లేదని కలెక్టర్ పేర్కొన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలను పాటించాలని కోరారు.