TVK Political Row: రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయాల్లో భాగమే.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేత..
Jantar Mantar Violence: జంతర్ మంతర్ హింసపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్.. బాధితులకు అవకాశం..
TVK Political Row: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన అన్నాడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేల రాజీనామా, పార్టీ మార్పు వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) సోమవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో చేరిన ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో కొట్టివేసింది.
వేరే పార్టీలోకి వెళ్లాలనుకునే ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లడం ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియలో ఒక భాగమని స్పష్టం చేసింది. రాజీనామా చేయడం, అలాగే రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతుల ఆధారంగా సభ్యులపై అనర్హత వేటు వేయడం అనేవి రెండూ పూర్తిగా వేర్వేరు రాజ్యాంగ ప్రక్రియలని తేల్చి చెప్పింది.
అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లు సభాపతి వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ, శాసనసభ్యుల స్వచ్ఛంద రాజీనామాలను ఆమోదించే పూర్తి చట్టబద్ధమైన అధికారం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌కు ఉంటుందని సుప్రీంకోర్టు పిటిషనర్లకు స్పష్టం చేసింది. కాగా, నిబంధనలకు కట్టుబడి అనర్హత పిటిషన్ల విచారణను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించింది. అంతకుముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, శాసనసభ్యుల రాజీనామాలు , నూతన పార్టీ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన అప్పీలును ధర్మాసనం తోసిపుచ్చింది.
ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెళితే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, విపక్షాల నుంచి నూతనంగా ఏర్పాటైన టీవీకే (TVK) పార్టీలో చేరారు. అయితే, స్వచ్ఛందంగా పార్టీ మారిన ఈ ఆరుగురు ఎమ్మెల్యేలను రాబోయే ఐదేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు మద్రాస్ హైకోర్టులో క్రిమినల్ , రాజ్యాంగ పిటిషన్‌ను దాఖలు చేశారు. దాంతో పాటు, ఎమ్మెల్యేల రాజీనామా వల్ల వచ్చే ఉప ఎన్నికల నిర్వహణకు అయ్యే ప్రభుత్వ నిధులు , ఖర్చును సదరు ఎమ్మెల్యేల నుంచే ముందస్తు డిపాజిట్‌గా వసూలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం (ECI), తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ పిటిషన్లను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు.. రాజీనామాలను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమైనదేనని సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా చుక్కెదురైంది. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడంలో ఎలాంటి చట్టపరమైన లోపం లేదని, ప్రజాప్రతినిధుల ఈ నిర్ణయాలు రాజకీయ పునర్వ్యవస్థీకరణలో సహజ పరిణామాలని వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది.