Cyclone Arnab Alert: అర్నాబ్ తుపాను ముప్పు: పాఠశాలలకు సెలవులు ప్రకటన.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
Cyclone Arnab: ఏపీ తీరానికి అతి తీవ్ర తుపాను ముప్పు.. 8 జిల్లాలపై ప్రభావం, ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు
Cyclone Arnab Alert: తీవ్రరూపం దాలుస్తున్న ‘అర్నాబ్’ తుపాను ప్రభావంతో తీవ్ర ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. విద్యార్థుల రక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు నివారణ చర్యగా రాష్ట్రంలోని పలు కోస్తా జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలకు అధికారులు అత్యవసర సెలవులను ప్రకటించారు.
అక్టోబర్ 27, 28 (మంగళ, బుధవారాలు) తేదీల్లో పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, కాకినాడ జిల్లాల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు (DEO) వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పాఠశాలలను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తుపాను తీవ్రత కాకినాడ జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. జిల్లాలో ఇప్పటికే 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తీరప్రాంతాల్లో ఉన్న సుమారు 89 వేల మంది ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశామని, అక్టోబర్ 27 మధ్యాహ్నంలోగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.
జిల్లాలోని 6 తీరప్రాంత మండలాలతో పాటు మరో 5 సమస్యాత్మక మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా పరిధిలోని 4,602 బోట్లలో 4,559 బోట్లను తీరానికి తరలించగా, మిగిలిన 43 బోట్లు పారాదీప్ హార్బర్లో సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. అత్యవసర ప్రయాణాలను మినహాయించి ప్రజలు అక్టోబర్ 27 మధ్యాహ్నం 2 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం వరకు బయటకు రావద్దని సూచించారు. అత్యవసర సాయం కోసం 0884 2356901, 9849903879 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యున్నత స్థాయి సమీక్ష
మరోవైపు ‘అర్నాబ్’ తుపాను తీరం వైపు వేగంగా దూసుకొస్తుండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. తుపాను కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్ , విపత్తు నిర్వహణ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. విపత్తు తీవ్రతను ముందే ఊహించి, గత తుపానుల అనుభవాలను విశ్లేషిస్తూ రైతులకు నిరంతరం వాతావరణ సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ ద్వారా హాజరై జిల్లాల్లోని ముందస్తు సన్నాహాలను సీఎంకు వివరించారు.
వాతావరణ శాఖ తుది అంచనాల ప్రకారం.. ‘అర్నాబ్’ తుపాను అక్టోబర్ 26 అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, 27న ‘అతి తీవ్ర తుపాను’గా బలపడి, అక్టోబర్ 28వ తేదీ ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్లు, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ , దక్షిణ ఒడిశా తీరప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ (Red Alert) జారీ చేసింది.