Skip to content
జాతీయం › వార్తలు

నవజీవన్‌తో గాంధీజీ నవభారత నిర్మాణం

Prajapaksham 26 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
నవజీవన్‌తో గాంధీజీ నవభారత నిర్మాణం

Gandhi

ఐ.ప్రసాదరావు.

ఒక దినపత్రిక ద్వారా దాస్యశృంఖలాల నుండి ఒక దేశానికి ఎలా స్వేచ్ఛ ప్రసాదించవచ్చో,
‘నవజీవన్‌’ పత్రిక ద్వారా మహాత్మా గాంధీ ప్రపంచానికి చాటి చెప్పారు… ‘ఒక అణా’ తో ఎనిమిది పేజీల వార పత్రిక సెప్టెంబర్‌ 7వ తేదీన 1919 లో గాంధీజీ ప్రారంభించిన నవజీవన్‌ పత్రిక మొత్తం దేశ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చింది.. బ్రిటిష్‌ సామ్రాజ్య వాదాన్ని మట్టి కరిపించింది.. రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు, తదుపరి బ్రిటిష్‌ వారి ఆంక్షలు గాంధీజీ స్వాతంత్య్ర పోరాటానికి తరచూ ఆటంకాలు కలిగిస్తున్న సమయంలో, తన ఆశయాలైన అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, వ్యవసాయ అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి, చేనేత వంటి అంశాలను ప్రజల చెంతకు చేర్చడానికి, తద్వారా దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి ఒక ఆయుధంగా పత్రికను ప్రారంభించాడు.. తన ఆశయాలతో పాటు తన సిద్ధాంతాలను పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఉండే సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి నవజీవన్‌, యంగ్‌ ఇండియా వంటి పత్రికలు ద్వారా చైతన్య పరచడం ప్రారంభించారు. ముఖ్యంగా పేపరులో తాను రాసే విషయాలను చదవడం తద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడమే కాకుండా, పాఠకుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించే నూతన పత్రికా విలువలకు పునాది వేయడం ద్వారా స్వాతంత్య్ర పోరాటం మరింత బలోపేతం అవడానికి, ఎక్కువ మంది అవగాహనతో భాగస్వామ్యం అవడానికి వీలు కలిగింది…ఈ సందర్భంగా బ్రిటిష్‌ వారు అనేక ఆటంకాలు కలిగించేవారు.. నవజీవన్‌ పత్రిక ప్రచురించడానికి కూడా పబ్లిషర్స్‌ భయేపడేటట్లు బ్రిటిష్‌ వారు ఆంక్షలు విధించేవారు.. అయినప్పటికీ నవజీవన్‌ పత్రిక ప్రజలకు సకాలంలో చేరవేయడం ద్వారా దేశం నుంచి బ్రిటిష్‌ పాలకులను పారద్రోలడానికి చక్కటి ఆయుధంగా మారింది..
నేడు కూడా పాలకులకు వ్యతిరేకంగా ఏ పత్రికై నా వార్తలు రాసినా, ఆంక్షలు విధించడం చూస్తూనే ఉన్నాం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళ లో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా, నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా ప్రజలకు చేరువ చేయడానికి ‘ప్రెస్‌’ కు ప్రముఖ స్థానం కల్పించారు… అయితే నేడు మనదేశంలో పత్రిక స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది.. దాదాపు దేశంలో చాలా పత్రికలు, ఛానెల్స్‌ ప్రభుత్వ అనుకూలంగా మారిపోవడం బాధాకరమైన విషయం… దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే.. దేశంలో చాలా పత్రికలు ఛానెల్స్‌ ప్రైవేటు కార్పోరేట్‌ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది… అందుచేతనే ప్రభుత్వ అనుకూల వార్తలు, వ్యాపార ప్రకటనలు, ఎడిటోరియల్‌ పేజీలో ఆర్టికల్స్‌ వివిధ అంశాలు అన్నియు ఆయా రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండుట జరుగుతుంది.. అక్కడ అక్కడ దేశంలో కొన్ని పత్రికలు, ఛానెల్స్‌ నిర్భయంగా వాస్తవానికి దగ్గరగా వార్తలు రాసినా, ప్రసారం చేసినా ప్రభుత్వా లు ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి ఏర్పడింది.. అదే, నాటి పత్రిక చైతన్యానికి, నేటి పత్రికా విలువలకు ఎంత తేడాయో కదా అని అనిపిస్తుంది..
పత్రికలు సమాజ చైతన్యానికి నడుం బిగించాలి.. పాలకులు, పార్టీలు మంచి చేస్తే పొగడాలి… తప్పులు చేస్తే సరిదిద్దే విధంగా సందేశం ఇవ్వాలి.. వాస్తవాలు ప్రజలకు తెలియపరచాలి.. పత్రికలు, ఛానెల్స్‌ అంటే సమాజానికి సేవ చేసే ఆయుధాలు… అవినీతిని చీల్చే అంకుశం… తప్పు చేసేవారిని గాడిలో పెట్టే గైడ్‌. ఒక సమాజ అభివృద్ధిలో, ఒక దేశ నిర్మాణంలో పత్రికలు ఛానెల్స్‌, సామాజిక మాధ్యమాలు పాత్ర చాలా కీలకం అని గ్రహించాలి.. అంతేగానీ, ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతి మార్గంలో నిరసనలను వ్యక్తం చేసేవారిపై, రాతలు రాసే వారిపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించరాదు.. ఆయా సమస్యలకు పత్రికలు సూచించే పరిష్కారాల ను స్వీకరించి తదనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేయాలి.. పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాలి… అదే సమయంలో జర్నలిజం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. గాంధీజీ ఏ విలువల తో తన పత్రికలు నడిపించారో, ప్రజలను చైతన్యవంతులను చేసారో, దేశానికి స్వాతంత్య్రం సాధించారో, .. బ్రిటిష్‌ సామ్రాజ్య వాద ఆంక్షలను ఎదిరించారో… అదే రీతిలో నేడు కూడా పత్రికలు నిర్భయంగా స్వేచ్ఛగా ప్రజలకు సేవ చేయాలి.. పాలనలో పారదర్శకత పెంచే విధంగా పత్రికలు తమ తమ పాత్ర పోషించాలి.. పాలకులు, ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించే విధంగా పత్రికలు మార్గదర్శకంగా నిలవాలి.. ప్రజాస్వామ్య వ్యవస్థ పది కాలాల పాటు పారదర్శకంగా పనిచేయాలి అంటే పత్రికలే పునాదులు…ప్రజల హక్కులను కాపాడటం కోసం, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించవలసిన ప్రధాన ఆయుధాలు పత్రికలు, ఛానెల్స్‌, సామాజిక మాధ్యమాలే… అందుకే పత్రిక స్వేచ్ఛ కాపాడేందుకు అందరూ భాగస్వాములు కావాలి.. దేశ ప్రధాని కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పత్రికా విలేకరులతో సమావేశం నిర్వహించి, వారితో మాట్లాడకపోవటానికి కారణం మేం తప్పుచేయం అనే ధోరణి మరియు మమ్మల్ని ప్రశ్నిస్తారా… అనే ధోరణి ప్రబలటమే!.. ఇటువంటి పరిస్థితుల్లో పత్రికలు పాత్ర మరింత కీలకం.. దేశాన్ని వెంటాడుతున్న పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అవినీ తి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, కార్పొరేటీకరణ, అధిక ధరలు, ద్రవ్యోల్బణం, అనారోగ్యం, వివక్షతలు, మహిళలపై అఘాయిత్యాలు, డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌ ఇలా పలు సమస్యలు పరిష్కారం కోసం, పాలకుల్లో పారదర్శకత పెంచే విధంగా పత్రికలు, మీడియా పనిచేయాలి. ఈ సమస్యలు పరిష్కారం కానిదే వికసిత్‌ భారత్‌కు అర్థం ఉండదు.

ట్యాగ్‌లు: Mahatma Gandhi Today news