Telangana Global Summit: తెలంగాణకు భారీ పెట్టుబడులే టార్గెట్.. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై రేవంత్ రెడ్డి సమీక్ష..డిసెంబర్ 7 నుంచి ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్..
Telangana Global Summit
Telangana Global Summit: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో పర్యటించి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు నిర్మాణ పనులపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో భాగంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు కార్మికులను మోహరించి నిర్ణీత వ్యవధిలోగా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ‘మీ పెట్టుబడులు మాతో సురక్షితం’ అనే బలమైన భరోసాతో ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌ను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలోనే నిర్వహించనున్న నేపథ్యంలో, వర్సిటీ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై దృష్ట్యా నిలపాలని చెప్పారు.
దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకర్షించేలా ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం సూచించారు. నవంబర్ 15 నాటికి ఓపెన్ ప్రిమిసెస్ పనులు, నవంబర్ చివరి నాటికి సదస్సుకు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లు పూర్తి కావాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కేవలం ఒక సాధారణ వ్యాపార సదస్సు మాత్రమే కాదని, ఇది తెలంగాణ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసే ఒక చరిత్రాత్మక వేదిక అని ఉద్ఘాటించారు. సమ్మిట్‌ను ఘనంగా విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను పురమాయించారు.
పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ ప్రాంగణంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (నిమ్) నూతన క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాల్లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.