Skip to content
తెలంగాణ › వార్తలు

Hyderabad Motorists Alert: నంబర్ ప్లేట్లలో మార్పులు చేస్తే క్రిమినల్ కేసులే.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..100 వాహనాలు సీజ్

jagan 20 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Motorists Alert: నంబర్ ప్లేట్లలో మార్పులు చేస్తే క్రిమినల్ కేసులే.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..100 వాహనాలు సీజ్

Hyderabad Motorists Alert

Hyderabad Motorists Alert: HYd నగరంలో చట్టవిరుద్ధంగా నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. వాహనాల అసలు గుర్తింపును దాచిపెడుతూ, ట్రాఫిక్ ఉల్లంఘనలు , నేరాలకు పాల్పడుతూ చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ముమ్మరం చేశారు. గత 8 నెలల కాలంలో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన 100 వాహనాలను సీజ్ చేయడంతో పాటు, బాధ్యులపై 100 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.

నకిలీ నంబర్ ప్లేట్ల వినియోగంపై రోజురోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం ఈ తనిఖీలను మరింత తీవ్రతరం చేసింది. స్వాధీనం చేసుకున్న 100 వాహనాల్లో 88 ద్విచక్ర వాహనాలు (టూ వీలర్లు) కాగా, 12 నాలుగు చక్రాల వాహనాలు (ఫోర్ వీలర్లు) ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఈ ప్రత్యేక చర్యలపై హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయల్ డేవిస్ స్పందిస్తూ.. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను వాడటం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. “ఇటువంటి చర్యలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నివారణ , ప్రజా భద్రతకు పెను సవాలుగా మారుతున్నాయి. వాహనాల అసలు గుర్తింపును మరుగుపరచడం వల్ల ఏదైనా నేరం జరిగినప్పుడు దర్యాప్తుకు తీవ్ర ఆటంకం కలగడమే కాకుండా, చట్టపరమైన జవాబుదారీతనం నుంచి నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

మోటారు వాహనాల చట్టం-1988, కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989 ప్రకారం నిర్దేశించిన ప్రామాణిక నిబంధనలకు అనుగుణంగానే ప్రతి వాహనదారుడు నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని జోయల్ డేవిస్ ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) నిబంధనలను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పారు. నంబర్లను మార్చడం, అంకెలను స్పష్టంగా కనిపించకుండా చేయడం, అనుమతి లేని ఫాంట్లు వాడటం లేదా రకరకాల స్టిక్కర్లతో నంబర్ ప్లేట్లను కప్పివేయడం వంటివి చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

రాబోయే రోజుల్లో కూడా ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిరంతరాయంగా కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఏమాత్రం ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రతీ వాహనదారుడు చట్టబద్ధమైన నంబర్ ప్లేట్లను మాత్రమే ఉపయోగించాలని, ఎక్కడైనా అనుమానాస్పద లేదా ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్లు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.