Skip to content
బిజినెస్ › వార్తలు

X Creator Bonus: కంటెంట్ క్రియేటర్లకు ఎక్స్ బంపర్ ఆఫర్.. 15 వీడియోలు పోస్ట్ చేస్తే రూ.2.85 లక్షలు..

jagan 20 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
X Creator Bonus: కంటెంట్ క్రియేటర్లకు ఎక్స్ బంపర్ ఆఫర్.. 15 వీడియోలు పోస్ట్ చేస్తే రూ.2.85 లక్షలు..

X Creator Bonus

X Creator Bonus: సోషల్ మీడియా ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) మరో భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా ‘వీడియో కిక్‌స్టార్ట్ బోనస్’ అనే నూతన పైలట్ ప్రోగ్రామ్‌ను సంస్థ పరీక్షత్మకంగా ప్రారంభించింది. యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి ప్రధాన వీడియో ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీ ఇచ్చే వ్యూహంలో భాగంగానే ఎక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోగ్రామ్ కింద ఎంపికైన క్రియేటర్లు 15 ఒరిజినల్ వీడియోలను పోస్ట్ చేస్తే చాలు, వారికి ఏకంగా 3,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2.85 లక్షలు) స్థిర మొత్తాన్ని బోనస్‌గా చెల్లించనుంది.

ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యమై నగదు గెలుచుకోవడానికి ఎక్స్ సంస్థ కొన్ని కచ్చితమైన నిబంధనలను విధించింది. ఎంపికైన క్రియేటర్లు 30 రోజుల కాలపరిమితిలో, 15 వేర్వేరు రోజులలో కనీసం 15 వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి వీడియో నిడివి మూడు నిమిషాల కంటే తక్కువగా ఉండాలి. అంతేకాకుండా, ఈ వీడియోలు పూర్తిగా ఒరిజినల్ కంటెంట్‌తో లేదా సొంత సృజనాత్మకతతో కూడి ఉండాలి. ఇతర సోషల్ మీడియా యాప్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసిన వాటర్‌మార్క్ ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేస్తే అర్హత లభించదు.

ఈ ఆఫర్‌లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. వీడియోలకు వచ్చే వ్యూస్, లైక్స్ లేదా ఎంగేజ్‌మెంట్‌తో సంబంధం లేకుండా నిబంధనలకు లోబడి కంటెంట్ పోస్ట్ చేస్తే చాలు, ఎక్స్ నిర్ణయించిన రూ. 2.85 లక్షల భారీ మొత్తాన్ని నేరుగా చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌ను ఆహ్వానాల (Invite Only) ప్రాతిపదికన మాత్రమే నిర్వహిస్తున్నారు. అర్హులైన క్రియేటర్లను ఎక్స్ సంస్థే స్వయంగా ఎంపిక చేసి ఆహ్వానాలు పంపుతోంది. అలంటి క్రియేటర్లు తమ ‘క్రియేటర్ స్టూడియో’ ద్వారా ఇందులో భాగస్వామ్యమవ్వచ్చు.

ఈ క్రేజీ పైలట్ ప్రోగ్రామ్‌లో చేరడానికి అక్టోబర్ 30ని చివరి తేదీగా నిర్ణయించారు. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘ఒరిజినల్ కంటెంట్ రివార్డ్స్’ కంటే పూర్తిగా భిన్నమైన ప్రోగ్రామ్ అని సంస్థ స్పష్టం చేసింది. ఎక్స్‌లో వీడియో కంటెంట్‌ను గణనీయంగా పెంచి యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచుకోవడానికే ఈ ఆఫర్ తెచ్చినట్లు పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.