Skip to content
ప్రపంచం › వార్తలు

SIR Protest: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా మిన్నంటిన గ్లోబల్ నిరసనలు.. ప్రతి చోటా జంతర్‌మంతర్ పేరుతో ఎన్‌ఆర్‌ఐల ఆందోళన..

jagan 19 Oct 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
SIR Protest: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా మిన్నంటిన గ్లోబల్ నిరసనలు.. ప్రతి చోటా జంతర్‌మంతర్ పేరుతో ఎన్‌ఆర్‌ఐల ఆందోళన..

SIR Protest

SIR Protest: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారతదేశంలో విపక్షాలు, విద్యార్థి సంఘాలు చేపడుతున్న ఆందోళనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత , ఓటు హక్కు రక్షణే ధ్యేయంగా ‘ప్రతి చోటా జంతర్‌మంతర్’ అనే నినాదంతో ఎన్‌ఆర్‌ఐలు ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అక్టోబర్ 16న లండన్ , జర్మనీలోని ఎర్లాంగెస్‌లో ప్రారంభమైన ఈ గ్లోబల్ ఉద్యమం, మరుసటి రోజు నాటికి ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, కెనడా, అమెరికా , ఆస్ట్రేలియాలోని పలు నగరాలకు వేగంగా విస్తరించింది.

లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) యూకే చాప్టర్ ఆధ్వర్యంలో భారీ నిరసన సభ జరిగింది. భారత ఎన్నికల సమగ్రతను కాపాడాలని , నిష్పాక్షికతను కోల్పోయిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. లండన్ పార్లమెంట్ స్క్వేర్‌లో జరిగిన మరొక భారీ ప్రదర్శనలో ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా పాల్గొని ప్రవాస భారతీయులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ నగరాల్లోనూ ఎన్‌ఆర్‌ఐలు ప్రదర్శనలు చేపట్టారు.

కెనడాలోని టొరంటో భారత కాన్సులేట్ ఎదుట సమావేశమైన నిరసనకారులు భారత రాజ్యాంగ పీఠికను బిగ్గరగా చదివి వినిపిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరగా, వాంకోవర్‌లోనూ సుమారు 50 మందికి పైగా సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ‘సౌత్ ఏషియా కలెక్టివ్ ఐర్లాండ్’ నేతృత్వంలో జరిగిన సభలో, భారత్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయత లేకుండా ఓటర్ల పేర్ల తొలగింపు , సవరణల పేరిట జరుగుతున్న అక్రమాలపై ధ్వజమెత్తుతూ పౌరుల ప్రాథమిక ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు.

నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ప్రాంగణం ఎదుట 150 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరై భారత్‌లో ఉద్యమిస్తున్న నేతలకు, ప్రజలకు తమ మద్దతు ప్రకటించారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలెస్ నగరాలతో పాటు న్యూయార్క్‌లో జర్నలిస్టులు, రచయితలు, సీనియర్ న్యాయవాదులు , మానవ హక్కుల కార్యకర్తలు పాల్గొని సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. భారత ఎన్నికల వ్యవస్థపై అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ నెలకొనడం , ఎన్‌ఆర్‌ఐలు ఈ స్థాయిలో గొంతెత్తడం దౌత్య వర్గాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.