Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Crop Holiday: తెలంగాణలో నీటి సంక్షోభం.. యాసంగిలో 64 లక్షల ఎకరాల్లో.. క్రాప్‌ హాలిడే దిశగా అడుగులు..

jagan 19 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Crop Holiday: తెలంగాణలో నీటి సంక్షోభం.. యాసంగిలో 64 లక్షల ఎకరాల్లో.. క్రాప్‌ హాలిడే దిశగా అడుగులు..

వ్యవసాయంపై సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రం

Telangana Crop Holiday: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఊహించని రీతిలో వేగంగా అడుగంటిపోతున్నాయి. వేసవి కాలం రాకముందే జలాశయాల్లో దుర్భర పరిస్థితులు తలెత్తుతుండటంతో, వచ్చే ఏడాది ఆగస్టు మాసం వరకు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే ప్రాథమిక లక్ష్యంగా జలాశయాల్లో మిగిలి ఉన్న నీటిని అత్యంత పొదుపుగా సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ అసాధారణ వాతావరణ మార్పుల నేపధ్యంలో రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా , చిన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని సుమారు 64,88,981 ఎకరాల స్థిరీకృత ఆయకట్టుకు రాబోయే యాసంగి సీజన్‌లో సాగునీటిని అందించే మార్గం కనబడటం లేదని.. ఈ మేరకు వచ్చే రబీ సీజన్‌లో పంటల విరామం లేదా ‘క్రాప్ హాలిడే’ ప్రకటించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని నీటిపారుదల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యాసంగిలో వరితో పాటు ఎక్కువ నీటి ఆధారిత పంటలకు స్వస్తి చెప్పాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.

గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నీటి నిల్వలు సగానికి పైగా పడిపోయాయి. కృష్ణా, గోదావరి నదులపై పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు తెలంగాణ పరిధిలో ఉన్న 15 ప్రధాన జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 740.98 టీఎంసీలు కాగా, ఆదివారం ఉదయానికి కేవలం 380.88 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో 722.24 టీఎంసీల సమృద్ధి నిల్వలు ఉండటమే కాకుండా ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహాలు వచ్చేవి.

అయితే, ప్రస్తుతం గడిచిన నెల రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి చుక్క వరద నీరు కూడా జలాశయాల్లోకి చేరడం లేదు. రాష్ట్రంలోని కృష్ణా ప్రాజెక్టులైన శ్రీశైలంలో గరిష్ట సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను కేవలం 60 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 312.05 టీఎంసీలకు గాను 188.54 టీఎంసీలు, జూరాలలో 7.39 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. అలాగే గోదావరి పరీవాహకంలోని శ్రీరామ్‌సాగర్‌లో 80.5 టీఎంసీలకు గాను 38.67 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 10.31 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 18 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

రాష్ట్రంలో వాతావరణ హెచ్చరికలు, వర్షాభావ పరిస్థితుల ఆధారంగా త్వరలోనే రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక , నిర్వహణ కమిటీ (స్కివం) ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాలలోని నీటిని పూర్తిగా తాగునీటి కేటాయింపులకే పరిమితం చేస్తూ, యాసంగి సాగుకు నీటి విడుదల నిలిపివేసి ‘క్రాప్ హాలిడే’ ప్రకటించాలని స్కివం కమిటీ ప్రభుత్వానికి అధికారికంగా సిఫారసు చేసే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మరమ్మతులు అనివార్యం కావడం వల్ల వాటిలో మూడేళ్లుగా నీటిని నిల్వ చేయలేకపోవడం, మరోవైపు వర్షాలు కురవక వానాకాలం పంటలే ఎండిపోతుండటంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభం మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయానికి సన్నాహాలు చేస్తోంది.