Skip to content
జాతీయం › వార్తలు

CJP Protest: పోలీసు క్యాంపుగా మారిన ఢిల్లీ.. 7 వేల మందికి పైగా నిర్బంధం..మహిళలపై ఖాకీల కీచకపర్వం..

Krishna Rao 10 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CJP Protest: పోలీసు క్యాంపుగా మారిన ఢిల్లీ.. 7 వేల మందికి పైగా నిర్బంధం..మహిళలపై ఖాకీల కీచకపర్వం..

CJP Protest: ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. శనివారం సీజేపీ తలపెట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయానికి 7,000 మందికి పైగా నిరసనకారులను నిర్బంధించినట్లు సమాచారం.

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గ్యానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనల సందర్భంగా ఢిల్లీ పోలీసులు 7,000 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సిబ్బందిపై దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) తన నిరసనలను కొనసాగించాలని నిర్ణయించింది. ఆదివారం మరోసారి జంతర్‌ మంతర్‌కు మార్చ్‌ నిర్వహిస్తామని, తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సీజేపీ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేసింది. “మేం వెనక్కి తగ్గేది లేదు! రేపు మళ్లీ జంతర్‌ మంతర్‌కు మార్చ్‌ నిర్వహిస్తాం. మా డిమాండ్లన్నీ నెరవేరే వరకు అక్కడే ఉంటాం” అని పేర్కొంది.

శనివారం ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, నేహా బోరా, యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ తదితరులను అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. ఢిల్లీలో దాదాపు లాక్‌డౌన్‌ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం 7 గంటల సమయానికి దేశ రాజధాని వ్యాప్తంగా సుమారు 7,000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారుల్లో ఒక్కరినీ జంతర్‌ మంతర్‌ చేరుకోవడానికి అనుమతించలేదు.

నేరస్థుల్లా బలవంతంగా పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించి.. రెండు గంటలు తిప్పారు: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తమను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, నేరస్థుల్లా పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించారని ఆరోపించారు. సుమారు రెండు గంటల పాటు ఒక పోలీస్‌ స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌ స్టేషన్‌కు తిప్పారని, చివరకు తమను కిడ్నాప్‌ చేస్తున్నట్లుగా అనిపించిందని పేర్కొన్నారు. నేరస్థులను తీసుకెళ్లినట్లుగా బలవంతంగా పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించారు. నన్ను అరెస్టు చేసి పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించడం వంటి అనుభవం నా జీవితంలో ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆ తర్వాత సుమారు రెండు గంటల పాటు మమ్మల్ని వేర్వేరు ప్రాంతాలకు తిప్పారు. మొదట ఒక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో స్టేషన్‌కు, ఆ తర్వాత ఇంకో స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రతి చోటా స్థలం లేదని చెప్పారు. చివరకు మమ్మల్ని కిడ్నాప్‌ చేస్తున్నారేమో అన్న భావన కలిగింది” అని మమతా బెనర్జీ వివరించారు.

ఆదివారం నాటికి విడుదల చేయకపోతే నిరాహార దీక్ష: సోనమ్‌ వాంగ్‌చుక్‌

నిరసనల్లో అదుపులోకి తీసుకున్న వారిని ఆదివారం నాటికి విడుదల చేయకపోతే నిరాహార దీక్ష లేదా పాదయాత్ర ప్రారంభించాల్సి రావచ్చని పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ అన్నారు. మరోవైపు, నేహా బోరా, ఇతరులను సాయంత్రం మైదాన్‌ గఢీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. జంతర్‌ మంతర్‌ ప్రాంతాన్ని పోలీసులు మూసివేయడంతో కార్యకర్తలు తమ మద్దతుదారులను దిల్లీ హాట్‌ వద్ద మళ్లీ సమీకరించాలని కోరారు. అయితే, అక్కడికి వెళ్లే క్రమంలో నేహా బోరా, యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతల అదుపులోకి

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలను ఢిల్లీలోని ఆమె నివాసం వెలుపల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సౌరభ్‌ భరద్వాజ్‌లను జంతర్‌ మంతర్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఛత్రసాల్‌ స్టేడియానికి తరలించారు. సీజేపీ నేతలు అభిజీత్‌ దీప్కే, సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలను ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిజీత్‌ దీప్కేకు ఆయన నాయనమ్మ మరణించిన విషయాన్ని పోలీసులు తెలియజేసినట్లు, స్వగ్రామానికి వెళ్లేందుకు సహాయం అందిస్తామని చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిరసనకు నాయకత్వం వహించేందుకు ఎంపికైన సీజేపీ నేత అజింక్య షిండే మాట్లాడుతూ.. “జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు నిరసన కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.

గురుగ్రామ్‌లో ధ్రువ్‌ రాఠీ ముందస్తు అరెస్ట్…

ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీని గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 56లో ఉన్న ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ధ్రువ్‌ రాఠీకి యూట్యూబ్‌లో సుమారు 3.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఢిల్లీలో భద్రత కోసం సుమారు 25,000 మంది పోలీసు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించినట్లు ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ తన వార్తా కథనంలో పేర్కొంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సుమారు 1,200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

శాంతియుత నిరసన హక్కును గౌరవించాలి: ఐరాస

ఢిల్లీలో నిరసనలకు ముందు, నిరసనల సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలను అదుపులోకి తీసుకున్నారన్న వార్తలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం మరోసారి స్పందించింది. నిరసనకారులతో పాటు పౌర సమాజ ప్రతినిధులు, న్యాయవాదులు, జర్నలిస్టులను నిర్బంధించినట్లు వచ్చిన నివేదికలపై ఆందోళన వ్యక్తం చేసింది. “శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును పూర్తిస్థాయిలో గౌరవించి, అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మేం కోరుతున్నాం” అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన నిరసనలు ఆదివారం కూడా కొనసాగనున్న నేపథ్యంలో ఢిల్లీలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

దేశ రాజధానిలో సీజేపీ నిరసనల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా 45 మెట్రో స్టేషన్లలో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల మూసివేతను ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (DMRC) మరో నాలుగు గంటలు పొడిగించింది. తొలుత శనివారం సాయంత్రం 6 గంటలకు ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించగా.. తాజాగా రాత్రి 10 గంటల వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

అదుపు నుంచి విడుదలైన నేహా బోరా..

ఢిల్లీ: ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా పోలీసుల అదుపు నుంచి విడుదలయ్యారు. ఈ విషయాన్ని ఆమె ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. పోలీసులు తన ఫోన్‌ను తీసుకున్నారని, ఇప్పుడు తిరిగి ఇచ్చారని తెలిపారు. మైదాన్‌ గఢీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి మహిళలను కూడా విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు.