Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Land Issues: 22-ఎ భూ సమస్యల పరిష్కారంలో మరో కీలక ముందడుగు.. జీఓ 59 దరఖాస్తుదారులకు మంత్రి పొంగులేటి శుభవార్త

jagan 09 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Land Issues: 22-ఎ భూ సమస్యల పరిష్కారంలో మరో కీలక ముందడుగు.. జీఓ 59 దరఖాస్తుదారులకు మంత్రి పొంగులేటి శుభవార్త

Indiramma Towers

Telangana Land Issues: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22-ఎ భూ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీల అమలులో మరో కీలక ముందడుగు పడిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. 22-ఎ సమస్యల శాశ్వత పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

తాజాగా జీఓ 59 దరఖాస్తుదారులకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించిందని స్పష్టం చేశారు. 500 చదరపు గజాలలోపు పెండింగ్‌లో ఉన్న జీఓ 59 దరఖాస్తులను రాబోయే నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఈ మేరకు ప్రభుత్వం మెమో నంబర్ 48030 జారీ చేసిందని వెల్లడించారు. జీఓ 59 అమలులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని, గతంలో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా పునఃపరిశీలిస్తామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, 22-ఎ పరిధిలోని దాదాపు 10 నుండి 12 రకాల సమస్యలను ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో వేగవంతంగా పరిష్కరిస్తోందని పొంగులేటి స్పష్టం చేశారు. జీఓ 118, జీఓ 76లకు అనుగుణంగా ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన మెమోలు విడుదల చేసినట్లు ఆయన వివరించారు.

ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ (GHMC), హెచ్‌ఎమ్‌డీఏ (HMDA), డీటీసీపీ (DTCP) , ఇతర మున్సిపల్ అనుమతులు ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నామని మంత్రి తెలిపారు. వీటితో పాటు దశాబ్దాలుగా నంజూడుగా మారి పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నాలా (NALA) ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్ల చిక్కుళ్లకు కూడా త్వరలోనే స్పష్టమైన పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.