Telangana Voter List Row: తెలంగాణలో 95 లక్షల ఓట్ల తొలగింపు వార్త అవాస్తవం.. అసలు విషయం వెల్లడించిన ఎన్నికల అధికారి..
Telangana SIR
Telangana Voter List Row: తెలంగాణలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఏకంగా 95 లక్షల ఓట్లను తొలగించేశారంటూ సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఈ ప్రచారం పూర్తిగా ఆధారరహితమని, ప్రజా ప్రాతినిధ్య చట్టం, పారదర్శక నిబంధనలకు కట్టుబడి మాత్రమే ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితా పరిశీలనకు సంబంధించి ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా లేనివారు (Absent), నివాసం మారినవారు (Shifted), మరణించినవారు (Deceased), , డూప్లికేట్ (Duplicate) పేర్లున్న ఓటర్ల (ASDD) కేటగిరీ కింద మొత్తం 73,39,235 మందిని మాత్రమే ప్రాథమికంగా గుర్తించారు. ఓటర్ల వివరాల్లోని సాంకేతిక తేడాలు , క్షేత్రస్థాయి వ్యత్యాసాలను సవరించేందుకు ఇప్పటివరకు 92,88,187 నోటీసులు జారీ కాగా, అందులో 92,23,486 మందికి ప్రత్యక్షంగా నోటీసులు అందాయి. మిగిలిన 64,701 నోటీసుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది.
నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు 82,11,205 మంది ఓటర్ల క్షేత్రస్థాయి విచారణ పూర్తయింది. ఈ విచారణ ముగిసిన వారిలో 74,62,851 మందిని అన్ని అర్హతలు ఉన్న ఓటర్లుగా నిర్ధారించి తుది జాబితాలో చేర్చేందుకు ఆమోదం తెలిపారు. ఎలాంటి సరైన ఆధారాలు సమర్పించని కేవలం 12,969 మంది ఓటర్లను మాత్రమే అనర్హులుగా గుర్తించడం జరిగింది. మరో 18,12,367 మంది ఓటర్ల దరఖాస్తులపై విచారణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
ఈ విచారణలకు సంబంధించి నవంబర్ 5, 2026 నాటికి పూర్తిస్థాయి నిర్ణయాలు తీసుకుంటామని, ఆ తర్వాత నవంబర్ 9, 2026న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనితో పాటు, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు నకిలీ లేదా బల్క్ ఫామ్-7 (Form-7) దరఖాస్తులు సమర్పిస్తున్న వారిపై చట్టప్రకారం తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఈవో సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను (DEOs) ఖచ్చితంగా ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కు సురక్షితంగా ఉంటుందని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా తుది జాబితా రూపుదిద్దుకుంటుందని ఎన్నికల యంత్రాంగం హామీ ఇచ్చింది.