Madan Lokur: ఓటు హక్కును నిరాకరించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం.. జస్టిస్ మదన్ లోకూర్
ఓటు హక్కును నిరాకరించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం.. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదన్ లోకూర్
Madan Lokur: ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకోవడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ, ఎన్నికల సంఘం వ్యవహారశైలి, ఓటర్ల పేర్ల తొలగింపు, న్యాయవ్యవస్థ పాత్ర తదితర అంశాలపై ఒక ప్రైవేటు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
శాంతియుత నిరసనలకు అడ్డంకులు సరికాదు
ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఇతర కార్యకర్తలు ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో జస్టిస్ మదన్ లోకూర్ స్పందించారు. శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని తెలిపారు. నిరసనల్లో పాల్గొంటున్న కొద్దిమంది వల్ల అక్కడక్కడా ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినంత మాత్రాన మొత్తం నిరసనను శాంతియుతమైనది కాదని చెప్పలేమన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వంటి నిరసనలకు కేటాయించిన ప్రాంతాలను కూడా మూసివేసి, ప్రజలు అక్కడికి చేరుకోకుండా అడ్డుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనకారులను నియంత్రించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించడం అతిగా స్పందించినట్లేనని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ చేపట్టి, ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఎందుకు అనుమతించడం లేదో అధికారులను ప్రశ్నించాలని సూచించారు.
ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే
ఓటర్ల జాబితాల్లో పేర్ల తొలగింపుపై మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి ఓటు వేసేందుకు అర్హుడని, అతడిని అనర్హుడిగా నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం లేదా సంబంధిత అభ్యంతరం తెలిపిన వ్యక్తిపై ఉంటుందని మదన్ లోకూర్ పేర్కొన్నారు. ఓటు వేసేందుకు తాను అర్హుడినని ప్రతి ఓటరూ ఎన్నికల సంఘం ముందు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.
SIR ప్రక్రియలో ఈ నిరూపణ బాధ్యతను ఎన్నికల సంఘం ఓటర్లపైకి మళ్లించిందని ఆయన విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పించడం స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల్లో కీలకమని తెలిపారు. అర్హులైన ఓటర్లు ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడితే, దానిపై ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పీళ్ల పరిష్కారానికి దశాబ్దాలు పడితే ఎలా?
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించడంపై దాఖలైన అప్పీళ్ల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని జస్టిస్ లోకూర్ పేర్కొన్నారు. ఒక న్యాయమూర్తి రోజుకు 24 గంటలు, ఏడాదిలో 365 రోజులూ పనిచేసినా అప్పీళ్లన్నింటినీ పరిష్కరించడానికి 125 సంవత్సరాలు పడుతుందని అంచనా వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని గుర్తుచేశారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించబడినవారి అప్పీళ్లను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఓటర్ల జాబితాల సాఫ్ట్‌వేర్‌పై స్వతంత్ర పరిశీలన అవసరం
ఓటర్ల జాబితాల నిర్వహణలో ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌పై కూడా జస్టిస్ మదన్ లోకూర్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఓటర్ల పేర్లను చేర్చడం, తొలగించడం వంటి నిర్ణయాల్లో స్థానిక స్థాయిలో చట్టబద్ధమైన అధికారాలు కలిగిన ఎన్నికల నమోదు అధికారులు (EROలు) స్వతంత్రంగా వ్యవహరించగలగాలని అన్నారు. ఈ అధికారాలను కేంద్ర స్థాయిలో కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
గోవాలో 97 మంది ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చేందుకు సంబంధిత ఎన్నికల నమోదు అధికారి ప్రయత్నించినప్పటికీ, సాఫ్ట్‌వేర్‌లోని పరిమితుల కారణంగా ఆయన ఆ మార్పులు చేయలేకపోయిన ఉదంతాన్ని ప్రస్తావించారు. పేర్లను చేర్చే అధికారం ఉన్నప్పటికీ, సాంకేతిక వ్యవస్థ కారణంగా ఆ అధికారి తన బాధ్యతను నిర్వర్తించలేకపోయారని వివరించారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఓటర్ల జాబితాల సాఫ్ట్వేర్ పనితీరును స్వతంత్రంగా పరిశీలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలు లేవు
ఎన్నికల సంఘం రాజ్యాంగానికి, చట్టానికి అతీతమైన సంస్థ కాదని జస్టిస్ లోకూర్ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ, ఆ అధికారాలను ఇష్టానుసారంగా వినియోగించుకునే హక్కు ఎన్నికల సంఘానికి లేదన్నారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయంలో ఉన్నతాధికారుల బదిలీలను కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ కోసం అధికారాలు కల్పించినంత మాత్రాన ఎన్నికల సంఘం ఒక రాష్ట్రానికి రాజులా వ్యవహరించలేదని పేర్కొన్నారు. అధికారాల వినియోగానికి చట్టపరమైన పరిమితులు ఉంటాయని గుర్తుచేశారు.
ఫారం-6 మార్పులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కీలకం
ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో మార్పుల అంశంపైనా జస్టిస్ లోకూర్ స్పందించారు. ఎన్నికల సంఘం తనకు ఇచ్చిన అధికారాల పరిధిని సరిగ్గా అర్థం చేసుకోవాలని అన్నారు. ఫారం-6లో మార్పులు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ, ఆ అధికారం అపరిమితమైనది కాదని పేర్కొన్నారు.
మార్పులు చేయడానికి అధికారం ఉందన్న కారణంతో ఏ విధమైన మార్పులైనా, ఎలాంటి విధానాన్ని అనుసరించకుండా చేయవచ్చని భావించకూడదన్నారు. నిబంధనలకు అనుగుణంగా, నిర్దేశిత ప్రక్రియను పాటిస్తూ మాత్రమే మార్పులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఫారం-6కు సంబంధించిన మార్పులపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు ఈ పరిమితులకు లోబడి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికల కమిషనర్ల నియామకంలో పార్లమెంటుకు పాత్ర ఉండాలి
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక విధానంపై కూడా జస్టిస్ మదన్ లోకూర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజ్యాంగ పరిషత్ చర్చల సందర్భంగా ఎన్నికల సంఘం నియామకాలపై కార్యనిర్వాహక వ్యవస్థకు పూర్తి నియంత్రణ ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తమైన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించే విధానం అవసరమని ఆయన అన్నారు. ఇందుకోసం పార్లమెంటు చర్చించి, పరిశీలన అనంతరం తగిన వ్యక్తిని ఎంపిక చేసే విధానాన్ని తాను సమర్థిస్తానని తెలిపారు.
SIRపై స్వతంత్ర కమిషన్ డిసెంబర్ 31లోగా నివేదిక
SIR ప్రక్రియను పరిశీలించేందుకు ఐదుగురు మాజీ న్యాయమూర్తులతో కూడిన స్వతంత్ర కమిషన్ పనిచేస్తోందని జస్టిస్ లోకూర్ వెల్లడించారు. ఈ కమిషన్‌ను ఒక న్యాయవాదుల వేదిక ఏర్పాటు చేసిందని, SIR ప్రారంభం నుంచి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల వరకు వివిధ అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఈ పరిశీలనను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అనంతరం నివేదికను సంబంధిత న్యాయవాదుల వేదికకు సమర్పిస్తామని, ఆ నివేదికను ఎలా వినియోగించాలనే నిర్ణయం ఆ వేదిక తీసుకుంటుందని వివరించారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి పౌరుడికి ఆ హక్కు అందేలా చూడటం ఎన్నికల వ్యవస్థ బాధ్యత అని జస్టిస్ మదన్ లోకూర్ వ్యాఖ్యానించారు.