శ్రమను గౌరవించని సమాజంలో అభివృద్ధి సాధ్యమా?
Workers
మన్నారం నాగరాజు, సామాజిక రాజకీయ విశ్లేషకులు.
దేశం అభివృద్ధి చెందుతోంది. నగరాలు విస్తరిస్తున్నాయి. కొత్త రహదారులు వస్తున్నాయి. ఆకాశహర్మ్యాలు పెరుగుతున్నాయి. సాంకేతికత పరుగులు పెడుతోంది. ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ ఈ అభివృద్ధి మధ్యలో కష్టపడి పనిచేసే మనిషి ఎక్కడ ఉన్నాడు? అతని జీవితం ఎంత మారింది? అతని కుటుంబానికి భద్రత ఎంత పెరిగింది? అతని పిల్లల భవిష్యత్తు ఎంత మెరుగైంది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం అద్దం ముందు నిలబడి మనల్ని మనమే పొగుడుకోవడమే.
పొలంలో విత్తనం వేసేది రైతు. ఎండనకా, వాననకా పంటను కాపాడేది రైతు. కలుపు తీసేది కూలీ. పంటను కోసేది కూలీ. ధాన్యాన్ని మోసేది కూలీ. నగరాల్లో భవనాలు నిర్మించేది కార్మికుడు. రోడ్లపై తారు పోసేది కార్మికుడే. మన ఇళ్లను శుభ్రం చేసేది, మన చెత్తను తొలగించేది, మన సౌకర్యాల కోసం తెల్లవారుజామునే పనిలోకి వెళ్లేది కూడా శ్రమజీవే. కానీ సమాజం అతని శ్రమను ఉపయోగించుకుంటుంది తప్ప, అతని జీవితాన్ని గౌరవించడానికి మాత్రం వెనుకాడుతుంది. ఇదే మన అభివృద్ధి నమూనాలోని అసలు వైరుధ్యం.
ఒక మనిషి రోజంతా కష్టపడుతున్నాడు. అయినా నెలాఖరులో అతని చేతిలో మిగిలేది అప్పులే. మరోవైపు శ్రమతో సంబంధం లేని వారి సంపదపై సంపద పెరుగుతోంది. ఒక కుటుంబం తరతరాలుగా ఆస్తులను వారసత్వంగా పొందుతోంది. ఇంకొక కుటుంబం తరతరాలుగా అప్పులను
వారసత్వంగా మోస్తోంది.
ఒకరి పిల్లలకు ప్రైవేట్ విద్య, మెరుగైన వైద్యం, సురక్షితమైన జీవితం అందుబాటులో ఉంటే, మరొకరి పిల్లలు కనీస అవసరాల కోసం కూడా పోరాడాల్సి వస్తోంది. సమాజంలో అసమానత ఇంత స్పష్టంగా కనిపిస్తు న్నా దాన్ని సహజమైన విషయంగా చూడటం మరింత ప్రమాదకరం.
పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు. అవకాశాలు లేకపోవడం కూడా పేదరికమే. భూమి లేకపోవడం, స్థిరమైన ఉపాధి లేకపోవడం, నాణ్యమైన విద్య అందకపోవ డం, వైద్యం ఖరీదైపోవడం, అప్పుల నుంచి బయటపడలేకపోవడం పేదరికాన్ని తరతరాలకు కొనసాగించే కారణాలే. ఒక కుటుంబం అనారోగ్యానికి అప్పు చేస్తుంది. ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తుంది. అధిక వడ్డీ ఆ కుటుంబ ఆదాయాన్ని మింగేస్తుంది. చివరకు కష్టపడేది కుటుంబమే అయినా, కష్టఫలం మాత్రం అప్పుదారుడి చేతుల్లోకి వెళ్తుంది. ఇదే దోపిడీకి ఆధునిక రూపం.
మార్కెట్‌లో ప్రతి వస్తువుకు ధర ఉంటుంది. కానీ ఆ వస్తువును తయారు చేసిన మనిషి శ్రమకు మాత్రం ఎప్పుడూ న్యాయమైన ధర ఉండదు. రైతు పండించిన పంటకు ధర నిర్ణయించేది అతను కాకపోవచ్చు. కార్మికుడి వేతనాన్ని నిర్ణయిం చే శక్తి అతని చేతుల్లో ఉండకపోవచ్చు. అసంఘటిత రంగంలోని కూలీకి పని ఉన్న రోజే ఆదాయం. పని లేని రోజు జీవితం నిలిచిపోవాల్సిందే. ఈ అనిశ్చితి మధ్య కూడా మనం అతని శ్రమను చౌకగా కొనాలని చూస్తే, మనం అభివృద్ధి చెందుతున్నామా లేక అసమానతను మరింత బలపరుస్తున్నామా అన్న ప్రశ్న తప్పదు.శ్రమను గౌరవించడం అంటే కూలీని చూసి జాలి పడటం కాదు. రైతును చూసి సానుభూతి చూపడం కాదు. కార్మికుడిని ఒకరోజు సన్మానించడం అంతకన్నా కాదు. శ్రమకు న్యాయమైన ప్రతిఫలం ఇవ్వడం, పని చేసే మనిషికి భద్రత కల్పించడం, అతని హక్కులను రక్షించ డం, అతని పిల్లలకు సమాన అవకాశాలు కల్పించడం నిజమైన శ్రమ గౌరవం. కష్టపడే మనిషి తన జీవితాన్ని మార్చుకునే అవకాశం పొందినప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది.
ఈరోజు మనం అభివృద్ధిని కొలిచే ప్రమాణాలను కూడా ఒకసారి పరిశీలించాలి. ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించాం? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంత పెట్టుబడి వచ్చింది? అనే లెక్కలతో పాటు ఎన్ని కుటుంబాలు అప్పుల నుంచి బయటపడ్డాయి? ఎందరు కూలీలకు స్థిరమైన ఉపాధి వచ్చింది? రైతు ఆదాయం ఎంత స్థిరపడింది? సామాన్యుడికి వైద్యం, విద్య ఎంత అందుబాటులోకి వచ్చాయి? అనే ప్రశ్నలు కూడా అడగాలి. ఎందుకంటే కాంక్రీట్ భవనాల ఎత్తు పెరిగినంత మాత్రాన మనిషి జీవితం ఎత్తుకు ఎదిగినట్లు కాదు.
సమాజంలో సంపద పెరగడం అవసరమే. కానీ ఆ సంపద సృష్టిలో భాగస్వాములైన ప్రజల జీవితాలు కూడా మెరుగుపడాలి. అభివృద్ధి ఫలాలు కొద్దిమందికే పరిమితమైతే అది ఆర్థిక వృద్ధి కావచ్చు, కానీ సామాజిక అభివృద్ధి కాదు. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ఉపాధి భద్రత పెరగాలి. కష్టజీవికి గౌరవం పెరగాలి. పేద కుటుంబంలోని పిల్లవాడికి కూడా తన తల్లిదండ్రుల పేదరికాన్ని వారసత్వంగా మోసే పరిస్థితి ఉండకూడదు.
చివరికి ప్రశ్న ఒక్కటే సమాజాన్ని నిజంగా నడిపించేది ఎవరు? సంపదను కూడబెట్టిన కొద్దిమందా? లేక ఆ సంపదను సృష్టించే కోట్లాది శ్రమజీవులా? సమాధానం మన కళ్లముందే ఉంది. అయినా శ్రమజీవి జీవితాన్ని అంచునే ఉంచి అభివృద్ధి గురించి మాట్లాడటం ఎంతకాలం కొనసాగుతుంది? మనిషి శ్రమకు విలువలేని చోట సంపద ఉండవచ్చు, సాంకేతికత ఉండవచ్చు, భవనాలు ఉండవచ్చు. కానీ సమానత్వం ఉండదు. న్యాయం ఉండదు. నిజమైన అభివృద్ధి ఉండదు.
శ్రమను గౌరవించే సమాజమే స్థిరమైన సమాజం. శ్రమకు న్యాయం చేసే అభివృద్ధే ప్రజల అభివృద్ధి. కష్టజీవి జీవితం మారనంత వరకు అభివృద్ధి కథ అసంపూర్ణంగానే మిగులుతుంది అనేది ఈనాటి పాలకులు గుర్తురుగాలి.