Skip to content
Uncategorized › వార్తలు

Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీడియో ఇదిగో..

jagan 07 Oct 2026 1 నిమిషాల పఠనం Uncategorized
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీడియో ఇదిగో..

Rahul Gandhi

Jantar Mantar Protest: కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ (INDIA) కూటమి చేపట్టిన జంతర్ మంతర్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం ప్రతిపక్ష ఎంపీలు , ముఖ్య నేతలు జంతర్ మంతర్ వైపు ర్యాలీగా బయలుదేరగా, ఢిల్లీ పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా , పలువురు కీలక ప్రతిపక్ష నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రతిపక్ష నేతలను ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీలంతా ఆకాశవాణి భవన్ సమీపంలోనే బైఠాయించి నిరసన తెరిపారు. నిరసన స్థలం నుంచి స్పందిస్తూ—”300 మందికి పైగా ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవాలని భావిస్తుంటే ప్రభుత్వం, అధికారులు వారిని కలవనీయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను ప్రజల నుంచి దూరం చేస్తున్నారు” అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

నిరసనల సందర్భంగా ఆకాశవాణి భవన్ వద్ద అనుమతి లేకుండా ప్రవేశించడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు నేతలపై ఢిల్లీ పోలీసులు కేసు (FIR) నమోదు చేశారు. ధర్నా స్థలం వద్ద గంటల తరబడి హైడ్రామా కొనసాగిన అనంతరం, పోలీసు సిబ్బంది రాహుల్ గాంధీని బలవంతంగా వాహనంలోకి తరలించి సమీప పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

మరోవైపు ప్రతిపక్షాల నిరసనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాలు రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని, ఎన్నికల వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చేలా అవాస్తవ ప్రచారాలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించింది. ప్రస్తుతం జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు భారీగా బలగాలను మోహరించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.