Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు..
Strait of Hormuz Attack:
Strait of Hormuz Attack: హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒమన్ తీరానికి సమీపంలో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న పనామా జెండాతో కూడిన వాణిజ్య నౌక ‘ఎంటీ ఆన్ పీస్’పై మంగళవారం ప్రాజెక్టైల్ దాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది సిబ్బంది గాయపడగా.. వారిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది.
ఎంటీ ఆన్ పీస్ నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది భారతీయ పౌరులేనని MEA తెలిపింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో నౌకను ప్రాజెక్టైల్ తాకడంతో 12 మంది సిబ్బంది గాయపడ్డారు. వీరిలో 11 మంది భారతీయులు ఉన్నారు. దాడి జరిగిన వెంటనే ఒమన్ అధికారుల సహకారంతో గాయపడిన సిబ్బందిని నౌక నుంచి సురక్షితంగా తరలించారు. ప్రస్తుతం వారందరికీ ఒమన్‌లోని ఖసాబ్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. హర్ముజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం ఇటువంటి దాడులను తక్షణమే నిలిపివేయాలని భారత్ పిలుపునిచ్చింది.
వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకల రాకపోకలు, వాణిజ్య కార్యకలాపాలు వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
గాయపడిన నావికులను సురక్షితంగా తరలించి, వైద్య చికిత్స అందించేందుకు సహకరించిన ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. కీలకమైన అంతర్జాతీయ సముద్ర మార్గమైన హర్ముజ్ జలసంధిలో నౌకల భద్రతపై తాజా ఘటన మరోసారి ఆందోళనలను పెంచింది. దాడికి బాధ్యులెవరన్న విషయంపై MEA ప్రకటనలో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.