Skip to content
Uncategorized › వార్తలు

Mamunur Airport: మామునూరు ఎయిర్‌పోర్టు పేరేంటి? కొనసాగుతున్న చర్చ..?

Krishna Rao 05 Oct 2026 1 నిమిషాల పఠనం Uncategorized
Mamunur Airport: మామునూరు ఎయిర్‌పోర్టు పేరేంటి? కొనసాగుతున్న చర్చ..?

Mamunur Airport

కొనసాగుతున్న ఉత్కంఠ తెరపైకి రాణి రుద్రమ, కాకతీయ, సమ్మక్క సారలమ్మ, పీవీ నరసింహారావు, దొడ్డి కొమురయ్య, అల్లావుద్దీన్ పేర్లు

Mamunur Airport: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్న వేళ.. మరో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెట్టాలి? అన్న దానిపై పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి సూచనలు కోరడంతో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, నెటిజన్లు తమకు నచ్చిన పేర్లను సూచించారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్టు పేరు ఇప్పుడు ఓరుగల్లు చరిత్ర, కాకతీయుల వారసత్వం, తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తి, ప్రముఖుల సేవల చుట్టూ తిరుగుతోంది.

ఇదిలా ఉండగా ఎయిర్‌పోర్టు నిర్మాణశైలి కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా ఉండాలని సీఎం సూచించడంతో ఓరుగల్లు సంస్కృతి, కాకతీయ కళావైభవం ప్రపంచానికి మరింత లోతుగా తెలిసే విధంగా నిర్మించబోతున్నారు.

కాగా తెలంగాణ ఉద్యమకారులు, నాటి సాయుధ పోరాట వారసులు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేస్తుండగా అంబేద్కర్ సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మామునూరు విమానాశ్రయానికి ఏ పేరు ఫైనల్..? అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

విమానాశ్రయం పేరుపై తొలుత సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. వరంగల్ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్ఐఏ) లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (కేఐఏ) పేర్లను సూచించారు. ఓరుగల్లు వారసత్వం, సంస్కృతి, చరిత్రకు తగిన పేరు ఉండాలని పేర్కొన్నారు. ఆయన సూచనపై సీఎం స్పందిస్తూ దట్స్ ది స్పిరిట్ అంటూ రియాక్ట్ అయ్యారు కూడా.

ది ప్యారడైజ్ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో ప్రతిపాదన చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు సమ్మక్క సారలమ్మ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని పేరు పెట్టాలని సూచించారు. నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కూడా రాణి రుద్రమదేవి పేరును సూచించారు. రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ అని పేరు పెట్టడం సముచితమని పేర్కొన్నారు.

ఇదే సమయంలో నటుడు విజయ్ దేవరకొండ కూడా రుద్రమదేవి, కాకతీయ వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లకు మద్దతుగా స్పందించారు. సినీ నటుడు నితిన్ కూడా రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరును సూచించారు.

పీవీ నరసింహారావు పేరు..
తాజాగా అల్లావుద్దీన్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు కూడా ప్రతిపాదనల్లోకి వచ్చింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సీఎం పిలుపునకు స్పందిస్తూ మామునూరు ఎయిర్‌పోర్టుకు పీవీ పేరు పెట్టాలని సూచించారు. ప్రస్తుత వరంగల్ ప్రాంతానికి చెందిన పీవీ 1991-96 మధ్య ప్రధానమంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఇక పీవీ పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు మరికొందరు నాయకులు, ఆయన కుటుంబం / ట్రస్ట్‌కు సంబంధించిన వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో పీవీ పేరు కూడా ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటిగా మారింది.

కాగా పేర్ల చర్చలో తాజాగా మరో ప్రతిపాదన చేరింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గత నెల 22న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ వరంగల్ ఎయిర్‌పోర్టుకు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ పేరు పెట్టాలని కోరారు. అల్లావుద్దీన్ 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారని, జైలు శిక్ష కూడా అనుభవించారని గుర్తు చేశారు.

సోషల్ మీడియాలోనూ పేరు ప్రతిపాదనలు
సీఎం పిలుపుతో సోషల్ మీడియాలోనూ పేర్లపై చర్చ సాగుతోంది. కొందరు రాణి రుద్రమదేవి, మరికొందరు కాకతీయ, సమ్మక్క సారలమ్మ పేర్లతో ఎయిర్‌పోర్టు గేట్లు, టెర్మినల్ డిజైన్లను ఏఐ ద్వారా రూపొందించి షేర్ చేస్తున్నారు.

పీవీ నరసింహారావు, ఓరుగల్లు, ప్రతాపరుద్ర, ప్రొఫెసర్ జయశంకర్, సర్వాయి పాపన్నల పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. మరోవైపు కొందరు ఆన్‌లైన్ వేదికగా పోల్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు, వివిధ వర్గాలు చేసిన సూచనలు మాత్రమే. తుది పేరు ఇంకా ఖరారు కాలేదు.