Iran US Military Retreat: అమెరికా సైన్యాలు 500 కి.మీ. వెనక్కి? ఇరాన్ ఐఆర్జీసీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు
Iran US Military Retreat
Iran US Military Retreat: అమెరికా సైన్యాలు ఇరాన్ దాడులకు భయపడి 500 కి.మీ. వెనక్కి వెళ్లాయని ఐఆర్జీసీ కమాండర్ ముస్తఫా ఇజాదీ ఆరోపించారు.
Iran US Military Retreat: అమెరికా సైన్యాలు ఇరాన్‌కు భయపడి పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం నుంచి పారిపోయాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) డిప్యూటీ కమాండర్ మేజర్ జనరల్ ముస్తఫా ఇజాదీ చెప్పారు. ఈ దళాలు మరింత వెనక్కి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని శనివారం మీడియాకు చెప్పారు.
ఇరాన్ దాడులకు భయపడి ఇప్పటికే అమెరికా సేనలు 500 కి.మీ. వెనక్కు పారిపోయాయని అన్నారు. ప్రస్తుతం ఈ దళాలు ఒమన్ సముద్ర జలాల నుంచి 500 కి.మీ. దూరంలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితుల్లో ఈ దూరం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.
అమెరికా సైనిక బలగాలు ఇక్కడ ఉంటే పశ్చిమాసియాకు ఎంతమాత్రం భద్రత కాదని, వాటిని నమ్ముతున్న ప్రాంతీయ దేశాలకు ప్రాణహానిగా మారుతుందని అన్నారు. అమెరికా సైన్యాల ఉనికి ప్రమాదకరమని ఈ ప్రాంత దేశాలు ఇప్పుడు గుర్తించాయన్నారు.
యుద్ధాలు, ఘర్షణల ద్వారా ఇరాన్ సైన్యాలు మరింత అప్రమత్తంగా, మెరుగైన స్థితికి చేరుకున్నాయని, ఇరాన్ ప్రజలు కూడా తమను తాము కాపాడుకునే విషయంలో శత్రువుల కపటోపాయాలను ఆకళింపు చేసుకుని ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
ఇరాన్‌ను విచ్ఛిన్నం చేసి, ఇరాన్ చమురు సంపదపై నియంత్రణ సాధించాలనుకున్న శత్రువు కుట్రలను ప్రజలు భగ్నం చేశారన్నారు. అనేక హత్యలు చేసినప్పటికీ ఇరాన్ శక్తిని అడ్డుకోవడంలోగానీ, ఇరాన్‌ను ఓడించడంలోగానీ శత్రువు ఘోరంగా విఫలమయ్యాడని ముస్తఫా ఇజాదీ అన్నారు.
“మన ప్రతిఘటన ఈ రోజు గొప్ప విజయం సాధించింది. ఈనాడు హోర్ముజ్ జలసంధిగానీ, బాబ్ అల్ మందబ్ జలసంధిగానీ అమెరికా వ్యతిరేక ప్రతిఘటన శక్తుల చేతుల్లో ఉన్నాయి” అన్నారు.
“ఈరోజు ఒక కొత్త పరిస్థితి నెలకొని ఉంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడులకు భయపడి శత్రువు వందల కిలోమీటర్లు దూరం వెనక్కి పారిపోయాడు” అన్నారు.
కాగా, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ట్రంప్ బెదిరింపులను తోసిపుచ్చారు. ఆయన నిరంతరం ఊహల్లోనే విజయం సాధిస్తారన్నారు.
అమెరికాలో చరిత్రలో అతి చెత్త అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల యుద్ధంలో పదే పదే పరాజయం ఎదురవుతున్నప్పటికీ ఆయన మాటలు కోటలు దాటిపోతున్నాయని, మితిమీరి మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇరాన్ ప్రజలు, ఇరాన్ సైన్యం, క్షిపణులు వాస్తవాలను తీర్చిదిద్దుతాయని అన్నారు. ఇరాన్ ఏనాడో యుద్ధంలో విజయం సాధించిందని చెప్పారు.
జరుగుతున్న వాస్తవాలకు, ట్రంప్ ఊహాగానాలకు, ప్రకటనలకు ఎంతమాత్రం సంబంధం లేదని, ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.