Skip to content
ప్రపంచం › వార్తలు

Global Food Crisis Ahead? ప్రపంచానికి ఫుడ్ క్రైసిస్ ముప్పు.. గ్లోబల్ సౌత్ దేశాల్లో పెరుగుతున్న ఆహార సంక్షోభంపై జైశంకర్ హెచ్చరిక..

jagan 30 Sep 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Global Food Crisis Ahead? ప్రపంచానికి ఫుడ్ క్రైసిస్ ముప్పు.. గ్లోబల్ సౌత్ దేశాల్లో పెరుగుతున్న ఆహార సంక్షోభంపై జైశంకర్ హెచ్చరిక..

Jaishankar

Global Food Crisis Ahead? ప్రపంచం రాబోయే నెలల్లో భారీ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. ఎరువుల కొరత, ధాన్యం రవాణాలో అంతరాయాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి, వాతావరణ పరిస్థితులు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్‌లో ఆసియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్.. ఉక్రెయిన్‌ యుద్ధం, ఇరాన్-గల్ఫ్‌ ప్రాంతంలోని ప్రస్తుత ఘర్షణల ప్రభావం గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోందని అన్నారు.

ప్రపంచ ఆహార భద్రతపై ఆందోళన కలిగించే పరిణామాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని జైశంకర్‌ అన్నారు. ముఖ్యంగా కొన్ని కీలక ధాన్య ఎగుమతిదారులు తమ సరుకులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, ముఖ్యంగా బ్లాక్ సీ మార్గాల్లో రవాణాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ ఆసియా, రష్యా వంటి ప్రాంతాల్లో ఎరువుల ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం పడటం వల్ల కొరత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

ఎరువుల లభ్యత తగ్గడం లేదా వాటి ధరలు పెరగడం వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందకపోతే తదుపరి పంట దిగుబడులపై ప్రభావం పడవచ్చని నిపుణులు గతంలోనూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరఫరా అంతరాయాలు కొనసాగితే ఆహార ధరలు, లభ్యతపై ఒత్తిడి పెరగవచ్చన్నదే జైశంకర్‌ ఆందోళనగా కనిపిస్తోంది.

ఆహార సరఫరాపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు వాతావరణ పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుందని జైశంకర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ‘సూపర్ ఎల్‌నినో’ ముప్పు పరిస్థితిని మరింత క్లిష్టం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే ఎరువుల కొరత, ధాన్యం రవాణాలో అంతరాయాలు వంటి సమస్యలు ఉన్న సమయంలో వాతావరణ సంబంధిత ప్రతికూల పరిస్థితులు కూడా తోడైతే ప్రపంచ ఆహార వ్యవస్థపై అదనపు ఒత్తిడి పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం భారత్‌ ప్రధానంగా ఇంధన సరఫరా పరిస్థితిపై ఆందోళన చెందుతోందని జైశంకర్‌ తెలిపారు. అంతర్జాతీయ చమురు మార్కెట్‌ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని, చమురు సరఫరాలను రాజకీయ అంశాలతో ముడిపెడితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా, వ్యవసాయం, తయారీతో పాటు ఆహార సరఫరా వ్యవస్థపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ఉక్రెయిన్‌, ఇరాన్-గల్ఫ్‌ ప్రాంతంలోని ఘర్షణలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జైశంకర్‌ అన్నారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థిక వనరులపై ఒకేసారి ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. ఘర్షణల సమయంలో పెట్టుబడులు సురక్షితమైన మార్కెట్ల వైపు మళ్లడం వల్ల గ్లోబల్ సౌత్ దేశాలకు ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతోందని ఆయన వివరించారు.

ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే రాబోయే నెలల్లో ప్రపంచ ఆహార భద్రతపై తీవ్ర ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని జైశంకర్‌ హెచ్చరించారు. దేశాలు తమ నిర్ణయాల ప్రభావాన్ని ఇతర దేశాలపై కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఆహారం, ఇంధనం వంటి ప్రాథమిక అవసరాల సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం అవసరమని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.