Amaravati Outer Ring Road: అమరావతి ORRకు కొత్త రూపురేఖలు.. 195 కి.మీ రహదారి, 2 భారీ బ్రిడ్జిలు, 3 టన్నెల్స్
Amaravati Outer Ring Road: అమరావతి ORRకు కొత్త రూపురేఖలు.. 195 కి.మీ రహదారి, 2 భారీ బ్రిడ్జిలు, 3 టన్నెల్స్
Amaravati Outer Ring Road: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును నాలుగు ప్యాకేజీలుగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూ.30,491 కోట్ల ప్రాజెక్టులో కృష్ణా నదిపై 2 వంతెనలు, 3 సొరంగాలు నిర్మించనున్నారు.
Amaravati Outer Ring Road: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును నాలుగు ప్యాకేజీలుగా చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)కి పంపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో కృష్ణా నదిపై రెండు భారీ వంతెనలతో పాటు మూడు సొరంగ మార్గాలను కూడా నిర్మించనున్నారు.
మొత్తం 189.93 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసలతో ప్రధాన ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. దీనికి అదనంగా నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.20 కిలోమీటర్ల నాలుగు వరుసల అనుసంధాన రహదారిని నిర్మిస్తారు. దీంతో మొత్తం ప్రాజెక్టు పొడవు 195.13 కిలోమీటర్లకు చేరుతుంది.
రూ.30,491 కోట్లతో భారీ ప్రాజెక్టు
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.30,491 కోట్లుగా అధికారులు లెక్కించారు. ఇందులో సివిల్ పనులకు దాదాపు రూ.10,595.70 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
భూసేకరణ కోసం సుమారు రూ.5,315 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని అంచనా. పర్యావరణ, అటవీ అనుమతులు, విద్యుత్ లైన్ల మార్పులు, ఇతర అనుబంధ పనులతో పాటు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద 15 సంవత్సరాల పాటు వడ్డీతో సహా చెల్లింపులు వంటి అంశాలకు మిగిలిన మొత్తాన్ని వినియోగించనున్నారు.
నాలుగు ప్యాకేజీలుగా ఓఆర్ఆర్ నిర్మాణం
మొదట అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 25 నుంచి 30 కిలోమీటర్ల చొప్పున ఆరు నుంచి ఎనిమిది ప్యాకేజీలుగా నిర్మించాలని అధికారులు భావించారు. అయితే పనుల నిర్వహణ, టెండర్ల ప్రక్రియను సులభతరం చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్యాకేజీల సంఖ్యను నాలుగుకు తగ్గించినట్లు తెలుస్తోంది.
మొదటి ప్యాకేజీ
ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొండపల్లి, పంగిడి అటవీ ప్రాంతాల మీదుగా మైలవరం వరకు రహదారిని నిర్మిస్తారు.
ఈ మార్గంలో రెండు సొరంగాలను ఏర్పాటు చేయనున్నారు. మైలవరం సమీపంలోని 27వ కిలోమీటర్ వరకు మొదటి ప్యాకేజీగా నిర్ణయించారు. చివర్లో 189వ కిలోమీటర్ నుంచి 189.93వ కిలోమీటర్ వరకు మిగిలిన భాగాన్ని కూడా మొదటి ప్యాకేజీలో చేర్చినట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
రెండో ప్యాకేజీ
మైలవరం వద్ద 27వ కిలోమీటర్ నుంచి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను సమీపంలోని 83వ కిలోమీటర్ వరకు రెండో ప్యాకేజీ ఉంటుంది.
ఈ ప్యాకేజీ మొత్తం పొడవు సుమారు 56 కిలోమీటర్లు. ఈ మార్గం ద్వారా అమరావతి పరిసర ప్రాంతాలను ఓఆర్ఆర్‌తో అనుసంధానించనున్నారు.
మూడో ప్యాకేజీ
కోలవెన్ను సమీపంలోని 83వ కిలోమీటర్ నుంచి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట సమీపంలోని 133.5వ కిలోమీటర్ వరకు మూడో ప్యాకేజీని ప్రతిపాదించారు.
ఈ భాగం సుమారు 50.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. దీనికి అదనంగా నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల కనెక్టింగ్ రోడ్డును నిర్మించనున్నారు.
మూడో ప్యాకేజీలోనే కృష్ణా నదిపై వల్లూరుపాలెం సమీపంలో సుమారు 4.8 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించనున్నారు. ఓఆర్ఆర్‌లో ఇది కీలక నిర్మాణంగా ఉండనుంది.
నాలుగో ప్యాకేజీ
పుల్లడిగుంట సమీపంలోని 133.5వ కిలోమీటర్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలోని 189వ కిలోమీటర్ వరకు నాలుగో ప్యాకేజీ కొనసాగుతుంది.
ఈ ప్యాకేజీ పొడవు సుమారు 55.5 కిలోమీటర్లు. ఇందులో పేరేచర్ల సమీపంలో సుమారు 400 మీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు.
అదే విధంగా మున్నలూరు సమీపంలో కృష్ణా నదిపై సుమారు 3.15 కిలోమీటర్ల పొడవైన మరో వంతెనను ఏర్పాటు చేయనున్నారు.
ఓఆర్ఆర్‌తో ఏం ప్రయోజనం?
అమరావతి చుట్టూ నిర్మించనున్న ఈ భారీ రింగ్ రోడ్డు పూర్తయితే రాజధాని ప్రాంతానికి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడే అవకాశం ఉంది.
ప్రధాన నగర ప్రాంతాల్లోకి వెళ్లకుండా భారీ వాహనాలు, ఇతర అంతర్రాష్ట్ర రాకపోకలను ఓఆర్ఆర్ వైపు మళ్లించేందుకు ఈ రహదారి ఉపయోగపడనుంది. దీంతో రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం నాలుగు ప్యాకేజీలకు సంబంధించిన ప్రతిపాదనలు NHAIకి పంపిన నేపథ్యంలో తదుపరి దశల్లో సాంకేతిక పరిశీలన, అనుమతులు, టెండర్ల ప్రక్రియ వంటి అంశాలు ముందుకు సాగాల్సి ఉంటుంది.