Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదల
Elections
Telangana Graduate MLC Elections: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ప్రస్తుత సభ్యుల పదవీకాలం 2027 మార్చిలో ముగియనున్న నేపథ్యంలో ముందస్తుగా ఓటర్ల జాబితా తయారీ చేపడుతున్నారు.
ఈసారి ఓటర్ల జాబితాను 2026 నవంబర్ 1ను అర్హత తేదీగా తీసుకుని రూపొందించనున్నారు. ఈ తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తై నిర్ణీత మూడేళ్ల అర్హతను కలిగి ఉన్న వారు సంబంధిత గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేసిన ప్రకారం.. పాత ఓటర్ల జాబితాలో పేరు ఉన్నదన్న కారణంతో ఈసారి స్వయంచాలకంగా పేరు కొనసాగదు. ప్రతి ఒక్కరూ మార్పు చేసిన ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాల ధ్రువీకరించిన ప్రతులను సమర్పించాలి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 28న ఓటర్ల నమోదుకు పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. అక్టోబర్ 15, 25 తేదీల్లో పత్రికల్లో మరోసారి నోటీసును ప్రచురిస్తారు. నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఆ తర్వాత నవంబర్ 20 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియను పూర్తి చేసి.. నవంబర్ 25న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని డిసెంబర్ 25లోగా పరిష్కరించిన అనంతరం డిసెంబర్ 30, 2026న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
ఫారం-18 ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న పట్టభద్రులు ఆన్‌లైన్‌లో సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఫారం-18ను అవసరమైన పత్రాలతో సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO), డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు లేదా అదనపు డిజిగ్నేటెడ్ అధికారులకు వ్యక్తిగతంగా అందజేయవచ్చు. పోస్టు ద్వారా కూడా దరఖాస్తులను పంపేందుకు అవకాశం కల్పించారు.
రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు
కొత్త ఓటర్ల జాబితా తయారు చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఉన్నాయి. తెలంగాణ శాసనమండలి అధికారిక వివరాల్లో ప్రస్తుతం ఈ రెండు స్థానాలకు సురభి వాణీదేవి, తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నమోదైంది.
ఎన్నికల ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాను పూర్తిగా కొత్తగా సిద్ధం చేయనున్నందున అర్హత ఉన్న పట్టభద్రులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు కూడా ఈసారి తప్పనిసరిగా కొత్త ఫారం-18 సమర్పించాల్సి ఉండటం కీలక అంశంగా మారింది.
- H.G. Wells A Futuristic Writer: భవిష్యత్తును ఊహించిన వెల్స్
- ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడది స్థిరమైన అడుగుజాడ
- Harish Rao Farm House: అజీజ్‌నగర్ భూములపై కాంగ్రెస్ ఫీల్డ్ విజిట్.. కేటీఆర్, హరీశ్‌రావుపై చామల ప్రశ్నల వర్షం
- Harish Rao Farmhouse: అసైన్డ్ భూముల్లో ఫాం హౌస్ నిర్మించారు..అద్దంకి ఫైర్..హరీష్ రావు ఫాం హౌస్ భూముల్లో కాంగ్రెస్ నేతల ఫీల్డ్ విజిట్..
- Telangana Land Resurvey: భూముల రీ-సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. భూముల సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి