Skip to content
తెలంగాణ వార్తలు

Vinayaka Chavithi: ఖమ్మంలో 100 కిలోల సీడ్ బంతులతో 40 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపతి ఏర్పాటు…ఆకట్టుకుంటున్న శ్వేత గణపతి..

Krishna Rao 14 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Vinayaka Chavithi: ఖమ్మంలో 100 కిలోల సీడ్ బంతులతో 40 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపతి ఏర్పాటు…ఆకట్టుకుంటున్న శ్వేత గణపతి..

Vinayaka Chavithi: వినాయక చవితి ఉత్సవాలు అంటే కేవలం భక్తి, సంబరాలకే పరిమితం కావడం లేదు. పర్యావరణ పరిరక్షణకు సైతం వేదికగా మారుతున్నాయి. ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా సహజసిద్ధమైన పదార్థాలతో గణనాథులను రూపొందిస్తూ పర్యావరణంపై తమకున్న మమకారాన్ని చాటుకుంటున్నారు నిర్వాహకులు. ఖమ్మం నగరంలోనూ ఈసారి పర్యావరణహిత గణపతి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఖమ్మంలోని శివాలయం సెంటర్ గణనాథుడు దేశంలోనే తొలి సీడ్ బాల్ గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది దక్షిణ దిశగా పూజలు అందుకుంటున్న ఏకైక గణపతిగా ప్రత్యేకతను సంతరించుకున్నాడని నిర్వాహకులు చెబుతున్నారు. గణపతిని దక్షిణ దిశగా ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం అత్యంత అరుదైన విషయమని వారు పేర్కొన్నారు.

40 అడుగుల శ్వేతవర్ణ గణపతి
మరోవైపు ఖమ్మం నగరంలోని బ్రాహ్మణవాడలో ఏర్పాటు చేసిన 40 అడుగుల శ్వేతవర్ణ గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. పూర్తిగా పర్యావరణహితంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. సూర్యప్రభ దక్షిణామూర్తి రూపంలో గణనాథుడిని తీర్చిదిద్దారు. ఈ విగ్రహం తయారీలో పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలకు దూరంగా ఉంటూ చెరువు మట్టి, వరిగడ్డి, చింతపిక్కలు, చెక్క, సముద్రపు గవ్వల పొడి వంటి సహజసిద్ధ పదార్థాలను ఉపయోగించారు. జనపనార, జిల్లేడు పూల మిశ్రమాన్ని కూడా వినియోగించారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పూలకు సంబంధించిన సుమారు క్వింటా విత్తన బంతులను విగ్రహ తయారీలో ఉపయోగించడం ప్రత్యేకతగా నిలిచింది.

కళాకారుడు గౌతమ్ కుమార్ నేతృత్వంలోని బృందం సుమారు మూడు నెలల పాటు శ్రమించి ఈ భారీ విగ్రహాన్ని రూపొందించింది. సూర్యప్రభ వాహనంపై సప్త అశ్వారూఢుడైన గణపతిని అత్యంత ఆకర్షణీయంగా మలిచారు. కాలుష్య నియంత్రణ మండలి సూచించిన రంగులను మాత్రమే ఉపయోగించి విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సాయికిరణ్ తెలిపారు.

11 ఏళ్లుగా మట్టి గణపతులకే ప్రాధాన్యం
శివాలయం సెంటర్ ఉత్సవ కమిటీ గత 11 ఏళ్లుగా పర్యావరణహిత మట్టి వినాయకులనే ప్రోత్సహిస్తోంది. ప్రతి వినాయక చవితికి సుమారు 2,000 మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయించి ఇళ్లకు పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రకృతి సిద్ధమైన గణేశ ఉత్సవాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మట్టి విగ్రహాలను వినియోగించేలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు.

భక్తులపై ఆర్థిక భారం లేకుండా పూజలు
శివాలయం సెంటర్ గణనాథుడి వద్ద నిత్యం హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల చేతిలో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 15 రోజులుగా పెద్ద సంఖ్యలో ప్రజలు శివాలయం సెంటర్‌కు చేరుకుని గణనాథుడిని దర్శించుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈసారి దక్షిణ దిశగా ప్రతిష్ఠించిన గణపతిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. మొత్తంగా ఖమ్మం నగరంలో ఈసారి వినాయక చవితి ఉత్సవాలు భక్తి, సంప్రదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. సీడ్ బాల్ గణపతి, మట్టి విగ్రహాలు, సహజసిద్ధ పదార్థాలతో భారీ విగ్రహాల తయారీతో ఖమ్మం గణేష్ ఉత్సవాలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

ట్యాగ్‌లు: Vinayaka Chavithi