Skip to content
ప్రపంచం వార్తలు

BRICS New Delhi Declaration: UN సంస్కరణల నుంచి ఉగ్రవాదం వరకు.. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కీలక తీర్మానాలు ఇవే..

jagan 12 Sep 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
BRICS New Delhi Declaration: UN సంస్కరణల నుంచి ఉగ్రవాదం వరకు.. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కీలక తీర్మానాలు ఇవే..

BRICS Summit 2026

BRICS New Delhi Declaration: న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్‌ సదస్సులో సభ్య దేశాలు కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించడంతో పాటు అంతర్జాతీయ సంస్థల్లో వాటి ప్రాతినిధ్యం పెంచాలని బ్రిక్స్‌ నేతలు స్పష్టం చేశారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు అంతర్జాతీయ నిర్ణయ ప్రక్రియలో తగిన స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ప్రపంచ వ్యవస్థ మరింత ప్రజాస్వామ్యబద్ధంగా, సమతుల్యంగా, బహుళ ధ్రువంగా మారాలని ఆకాంక్షించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలకు బ్రిక్స్‌ మరోసారి గట్టి మద్దతు ప్రకటించింది. భారత్‌, బ్రెజిల్‌కు ఐరాసలో, ముఖ్యంగా భద్రతామండలిలో మరింత కీలక పాత్ర కల్పించాలన్న డిమాండ్‌కు చైనా, రష్యా మద్దతు తెలిపిన విషయాన్ని బ్రిక్స్‌ స్వాగతించింది. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ వంటి బ్రెట్టన్‌ వుడ్స్‌ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ఓటింగ్‌ హక్కు, నిర్ణయాధికారం ఉండాలని కోరింది. అంతర్జాతీయ సంస్థల్లో ఉన్నత స్థాయి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని కూడా పెంచాలని పిలుపునిచ్చింది.

ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు, ద్వితీయ ఆంక్షలు, వాణిజ్య పరిమితులపై బ్రిక్స్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా ఆహార భద్రత, ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ఏకపక్ష సుంకాలు, పన్నేతర అడ్డంకులు, రక్షణాత్మక వాణిజ్య విధానాలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో వివాద పరిష్కార వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని, అప్పీలేట్‌ బాడీలో కొత్త సభ్యుల నియామకాన్ని వేగవంతం చేయాలని కోరింది.

గాజా పరిస్థితిపై కూడా బ్రిక్స్‌ స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. అంతర్జాతీయ వివాదాలకు యుద్ధం పరిష్కారం కాదని, చర్చలు, దౌత్యం, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొంది. గాజాలో కాల్పుల విరమణ కొనసాగాలని, మానవతా సాయం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు చేరాలని కోరింది. పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడాన్ని వ్యతిరేకించింది. పౌరులు, పౌర మౌలిక వసతులకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. 1967 సరిహద్దుల ఆధారంగా రెండు దేశాల పరిష్కారానికి మద్దతు ప్రకటిస్తూ, తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా గుర్తించే పరిష్కారానికి అనుకూలంగా నిలిచింది. ఐరాసలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపింది.

లెబనాన్‌లో కాల్పుల విరమణను బ్రిక్స్‌ స్వాగతించింది. ఐరాస భద్రతామండలి తీర్మానం 1701ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరింది. అలాగే సూడాన్‌లో తక్షణం శాశ్వత కాల్పుల విరమణ జరగాలని, మానవతా సాయం అందించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని పిలుపునిచ్చింది. సూడాన్‌ సమస్యకు ఆఫ్రికా దేశాల ఆధ్వర్యంలోనే పరిష్కారం లభించాలన్న విధానాన్ని సమర్థించింది. సిరియాలో ప్రజల ఆధ్వర్యంలో, ఐరాస సహకారంతో రాజకీయ ప్రక్రియ కొనసాగాలని కోరుతూ, ఆక్రమణ దళాలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పేర్కొంది.

ఉగ్రవాదంపై బ్రిక్స్‌ దేశాలు కఠిన వైఖరిని ప్రకటించాయి. ఉగ్రవాదానికి ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని స్పష్టం చేస్తూ, అన్ని రూపాలు, వ్యక్తీకరణలను ఖండించాయి. 2025 ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రత్యేకంగా ప్రస్తావించి తీవ్రంగా ఖండించాయి. ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని పేర్కొన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమగ్ర ఒప్పందాన్ని ఐరాసలో త్వరగా ఆమోదించాలని పిలుపునిచ్చాయి.

ఉగ్రవాదానికి నిధుల సమకూర్పు, మానవ అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచాలని బ్రిక్స్‌ సూచించింది. డ్రగ్స్‌ ద్వారా జరిగే మనీలాండరింగ్‌, సైబర్‌ నేరాలు, అక్రమ వర్చువల్‌ ఆస్తుల లావాదేవీలను అడ్డుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్‌ మోసాల నెట్‌వర్క్‌లపై సమన్వయంతో పోరాడాలని పేర్కొంది. ఆస్తుల రికవరీ, పరారీలో ఉన్న నిందితుల గుర్తింపు, సరిహద్దులు దాటి జరిగే అవినీతిని అడ్డుకునే వ్యవస్థలను బలోపేతం చేయడానికి కొత్త సహకార విధానాలను స్వాగతించింది.

మొత్తంగా న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ద్వారా ప్రపంచ పాలనలో గ్లోబల్‌ సౌత్‌కు మరింత ప్రాధాన్యం, ఐరాస సంస్కరణలు, వాణిజ్య పరిమితులకు వ్యతిరేకత, గాజా సహా పలు యుద్ధ ప్రాంతాల్లో శాంతి, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం వంటి అంశాల్లో బ్రిక్స్‌ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది.