BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా చేతులు కలిపిన మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు 2026 ప్రారంభమైంది అంటూ ప్రధాని మోదీ ట్వీట్..
BRICS Summit 2026
BRICS Summit 2026: న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే ఆసక్తికర దృశ్యం కనిపించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల చేతులు పట్టుకున్న ఫొటోను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆసియా దేశాల మధ్య బలమైన సంబంధాలకు ప్రతీకగా ఈ ఫొటో నిలిచింది. ఈ చిత్రంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా కనిపించారు. ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు 2026 ప్రారంభమైంది అంటూ మోదీ ఈ ఫొటోను పంచుకున్నారు.
గ్లోబల్ సౌత్ దేశాలు అంతర్జాతీయ నిర్ణయ ప్రక్రియలో మరింత కీలక పాత్ర పోషించాలని బ్రిక్స్ వేదికగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న దేశాలు నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం వెనుకబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ చర్చల్లో గ్లోబల్ సౌత్ దేశాల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ సమస్యలపై చర్చలు, విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించేలా గ్లోబల్ సౌత్ దేశాల విధానకర్తలకు అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు.
మరోవైపు బ్రిక్స్ సదస్సులో కీలక దౌత్యపరమైన పురోగతి చోటుచేసుకుంది. ఉగ్రవాదాన్ని, ఏకపక్ష యుద్ధ చర్యలను ఖండిస్తూ బ్రిక్స్ కూటమి ఢిల్లీ ప్రకటనను ఆమోదించింది. అనేక అంశాల్లో సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సుదీర్ఘ చర్చల అనంతరం ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం కుదిరింది. శనివారం తెల్లవారుజాము వరకు చర్చలు సాగినట్లు సమాచారం. ఈ ప్రకటనపై అన్ని సభ్య దేశాలు అంగీకరించాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సమావేశం ఫలవంతంగా, సానుకూలంగా జరిగిందని, ఏ సభ్య దేశం కూడా విభేదాన్ని వ్యక్తం చేయలేదని ఆయన తెలిపారు.

PM Modi Shares Photo With Xi Jinping, Vladimir Putin At BRICS Summit In Delhi
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామునే ఢిల్లీకి చేరుకోగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వచ్చారు. పుతిన్ రాక అనంతరం ప్రధాని మోదీ ఆయనతో ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాల వంటి విభిన్న రంగాల్లో సహకారంపై చర్చించారు.
మోదీ–పుతిన్ భేటీలో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, నల్ల సముద్ర ప్రాంతంలో నెలకొన్న వివాదాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. వివాదాలకు సైనిక మార్గాల కంటే చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇక షీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశంపైనా ఆసక్తి నెలకొంది. ఇటీవలి కాలంలో భారత్–చైనా సంబంధాల్లో కొంత స్థిరత్వం కనిపిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల నేతల భేటీ కీలకంగా మారింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులు, సరిహద్దు వివాదం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సరిహద్దులో శాంతి, స్థిరత్వం కొనసాగించడంతో పాటు ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను క్రమంగా మెరుగుపరచడంపై ఇరు దేశాలు దృష్టి సారించే అవకాశం ఉంది.
మరోవైపు బ్రిక్స్ సదస్సులో ప్రసంగించిన షీ జిన్‌పింగ్ కూడా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ఆయన పేర్కొన్నారు. వివాదాలను పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
మొత్తంగా న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా మారింది. మోదీ–పుతిన్–జిన్‌పింగ్ వంటి కీలక నేతల పరస్పర సమావేశాలు, గ్లోబల్ సౌత్‌కు మరింత ప్రాధాన్యం కల్పించాలన్న పిలుపు, ఉగ్రవాదం మరియు ఏకపక్ష యుద్ధ చర్యలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రకటన వంటి అంశాలు ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.
- CM Revanth Reddy: 25 ఏళ్ల క్రితమే పుప్పాలగూడ, కోకాపేటను ఏలిన.. రియల్ ఎస్టేట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Aadarsha Kutumbam Teaser: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వచ్చేసింది.. చిట్టిబాబుగా విక్టరీ విశ్వరూపం!
- Botsa Satyanarayana Crying Video: మరోసారి వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స…గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో కంటతడి
- BRICS New Delhi Declaration: UN సంస్కరణల నుంచి ఉగ్రవాదం వరకు.. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కీలక తీర్మానాలు ఇవే..
- CM Revanth Reddy: పాలిటెక్నిక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్… ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు.. అసెంబ్లీలో సీఎం స్పష్టీకరణ