రాజకీయ వ్యవస్థకు ప్రమాద ఘంటికలు..పతనావస్థలో ప్రజాప్రతినిధుల ప్రవర్తన
రచయిత: చాడ వెంకట్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు, సీపీఐ సీనియర్ నాయకులు
గడిచిన మూడు రోజులుగా శాసనసభ వర్షాకాల సమావేశం సందర్భంగా చోటు చేసుకుంటున్న ఘటనలు ప్రజాస్వామి క వాదులు బాధపడుతున్నారు. స్పీకర్ను దూషించడం నా యావత్తు రాజకీయ జీవితంలోనే చూడలేదు. అదే మాదిరిగా ఎమ్మెల్యే లు, ఎంఎల్సీలు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే భావితరాలకు ఏమి నేర్పిస్తున్నామని ప్రశ్న ఎదురవుతోంది. అసలు దేశ భవిష్యత్తు ఏమవుతోందనే ఆందోళన కలుగుతోంది.
ఇప్పటికే జెన్ జీ ఉద్యమం కొంత కదలిక తెచ్చింది. రాజకీయ వ్యవస్థలో మార్పుకు ఎంతో అవసరం ఉన్నది. 10 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీలలో ప్రజాసమస్యలపై చర్చించడానికి బదులుగా రాజకీయ ప్రమేయంతో తిట్ల పురాణంతో దిగజారుడు భాష వాడటాన్ని సభ్య సమాజం తలదించుకుంటుంది.
ఎంపిలు, ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు కలిగి ఉండటం, కార్పోరేట్ అధిపతులుగా లేదా గుత్తేదారులుగా ఉన్నవారే ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు వ్యాపారం, పెట్టుబడి పెట్టడం డబ్బును ఇమ్మడి ముమ్మడిగా సంపాదించుకోవడాని కి అలవాటుపడినారు. ఆ ప్రమేయంతో ఎన్నికలప్పుడు అరచేతిలో స్వర్గం చూపిస్తూ, మరోవైపు దిగజారిన పద్ధతులలో ఎన్నికలను కలుషితం చేయడం పరిపాటిగా మారిపోయింది.
చట్టసభలెందుకు? ఒక పార్టీ వారు, మరోపార్టీ వారిపై దుమ్మెత్తి పోయడానికి ఎక్కువ సమయాన్ని ఉపయోగించుకోవడంతో దూషణలు భూషణలతో దుశ్శాసన పర్వాన్ని సభలు తలపిస్తున్నాయి. సభలో హుందాతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు పూర్తిగా దిగజారి బజారు భాషలో తిట్టుకోవడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు.
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇది రాచరిక వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు.
స్థానిక సంస్థ లు, అసెంబ్లీ, పార్లమెంట్, సహకార సంఘాలలో ఎన్నుకోబడేవారు ప్రతినిత్యం ప్రజల భాగస్వామ్యంతో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై అధికార యంత్రాంగం దృష్టికి తెస్తూ పరిష్కారం చేయడం లేదు. ఎలా కోట్లు సంపాదించుకోవాలనే ఆకాంక్షతో ప్రజాసేవ మరిచి, స్వంత సంపాదనకే పరిమితమై విచ్చలవిడిగా సంపాదనకు ఎగబడుతున్నారు.
దీంతో అధికారులలో చులకనభావం ఒకింతైతే కంచే చేను మేసిన చందంగా ప్రజల పక్షంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు అక్రమ సంపాదనకు మొగ్గు చూపితే, ప్రభుత్వ యంత్రాంగం మరింత అక్రమ సంపాదన కు పాల్పడటం సహజం. ‘యధారాజా తధా ప్రజా’ సామెతకు ఈనాటి ప్రజాస్వామ్యం నిలయంగా మారడం దుర్మార్గం. ప్రజాప్రతినిధుల దిగజారిన పాత్ర వలన సమాజం లో అన్ని వ్యవస్థలపైన ఈ ప్రభావం పడుతున్నది.
న్యాయవ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ. అయినప్పటికీ న్యాయమూర్తుల నియామకాలలో రాజకీయ జోక్యం, ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత కలిగి ఉన్నప్పటికీ అది కూడా నేడు అనేక విమర్శలకు గురవుతున్నది.
ప్రధానంగా బ్యూరోక్రసీ ప్రభుత్వ యంత్రాంగంలో పోలీస్ వ్యవస్థ ఎవరు అధికారంలో ఉంటేవారికి ప్రోటోకాల్ పాటించాల్సిందే కాని అధికారంలో ఉన్న వారికి అణిగి, మణిగి ఉండే పరిస్థితులు దాపురించడం దురదృష్టకరం. అలాగే రెవెన్యూ ఇతర శాఖలు దాదాపు అన్నింటి పై అధికార పార్టీ ప్రభావం ఉండటం ప్రజాసేవలు మానసిక వ్యవస్థకు గురికావడం కాదు. ప్రజాస్వామ్యం ఎటుమలుపు తిరుగుతున్నదో అనే మాటలో పడిపోతున్నారు.
2004లో అమరజీవి గద్దర న్న పాటలో పేర్కొన్నట్లుగా వాడి నోట వీడి మాట, వీటి నోట వాడి మాట, అంటే టిడిపి ప్రధాన ప్రతిపక్షం, కాంగ్రెస్ అధికార పక్షం, అంతకంటే ముందు టిడిపి అధికార పక్షం, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఆర్ఎస్ అధికారపక్షం కాంగ్రెస్ ప్రధానపక్షం అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగింది.
ఇప్పుడు కాంగ్రెస్ అధికారపక్షం, టిఆర్ఎస్ ప్రధానప్రతిపక్షం ఇలాంటి మార్పులు ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాగుతాయి.
అధికార పక్షం పాత్ర ఎలా ఉండా లి. గత ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూనే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవాలి. ప్రధానపక్షం, ప్రతిపక్ష పార్టీల విమర్శలను అందులో మంచిని గుర్తించి నిర్మాణాత్మ క పాత్రను పోషించాలి.
ఇక్కడ ప్రజాసమస్యలను విస్మరించి, నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు దొంగవంటే నువ్వే దొంగవు అంటూ రోజు ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షం, ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని అధికారపక్షం ఒకరిమీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభలు సజావుగా సాగడం లేదు.
ప్రజాసమస్యలు పరిష్కరించబడినట్లుగా ఒక ఉదాహరణగా తీసుకుంటే ఒక్క కేరళ రాష్ట్రంలో తప్ప మిగతా ఏ రాష్ట్రం లేదు. పేదరికంలో ఉన్న వారిని గుర్తించినవారికి గుర్తింపుకార్డులు ఇవ్వకుండా తెలంగాణలో 90శాతంపైబడి తెల్లరేషన్కార్టులు ఉన్నాయంటే పారదర్శకత ఏది? ఓట్ల రాజకీయాలు తప్ప, ప్రజాసంక్షేమా న్ని విస్మరించడమే అవుతుంది. అసలైన పేదలకు అన్యాయమే జరుగుతుంది. ఎన్నికలప్పుడు అరచేతిలో స్వర్గం చూపిస్తారు.
వర్షాకాల సమావేశాలను గీటురాయిగా తీసుకుంటే, సభ సజావుగా జరిగిన రోజులెన్ని అనేది గమనించాలి. ఒక గంట కు ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత పడుతుందనేది చర్చించాలి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దూషణతో కాలాన్ని వృధా చేయడం దుర్మార్గం.
అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షాలకు సమస్యలపై లేవనెత్తే అవకాశం కల్పించాలి. ప్రతి సందర్భంలోను స్పీకర్ను ఉపయోగించి సభను వాయిదా వేయడం జరుగుతుంది. వాయిదా వేసి వెళ్లిపోవడం దేనికి సంకేతం అనేది విజ్ఞులు చర్చించాలి.
దీని ప్రభావం శాసనసభలపై పడుతుంది. అందుకని తరతమ బేధాలు లేకుండా ఒక కేరళ అసెంబ్లీ కొంచెం మెరుగుగా ఉన్నా మిగతావన్నీ ఒకే మూసలో కొనసాగుతున్నాయి.
అధికార వర్గానికి ప్రజాసమస్యల పరిష్కారం కంటే ప్రతిపక్షాల నోళ్లు నొక్కడానికే ప్రాముఖ్యతనిస్తారు. అందుకని ప్రజాసమస్యలు చర్చించబడవు. దీనిపై దేశ వ్యాపితంగా చర్చాగోష్టులు జరగాలి. పారదర్శకత, జవాబుదారీతనాన్ని అధికార ప్రతిపక్షాలు పుణికిపుచ్చుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థముంటుంది.
పెద్దచేప చిన్న చేపను మింగుతున్నట్లుగా స్థానిక సంస్థల పై ఎమ్మెల్యేల, ఎంపిల పెత్తనం సాగడం దారుణం. 73,74 రాజ్యాంగ సవరణకు అర్థం లేకుండా పోయింది.
ఒక కేరళ రాష్ట్రంలోనే ఎంపి, ఎమ్మెల్యేలు, జనరల్బాడీలకు హాజరుకారు. స్వతంత్య్రంగానే స్థానిక సంస్థలు పనిచేస్తాయి. మిగతా అన్ని రాష్ట్రాలలో ఎంపి, ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయి పారదర్శకత లేకుండా పోతున్నది.
మహాత్మాగాందీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి అర్ధం లేకుండా పోతున్నది. దీనిపై చర్చ జరగాలి. బడ్జెట్ అంటే అధికారంలో ఉన్నవారి ఇష్టాఅయిష్టాలపై కేటాయింపులు జరిగే పరిస్థితి కొనసాగుతున్నది.
జిఎస్టి అంటే వస్తు సేవల పన్ను..ఎవరు పన్నులు కడుతున్నారు. ప్రజలు పన్నులు కడుతారు. పెత్తనం ప్రభుత్వం చేస్తుంది.
ఉచితాలనే నినాదం ఈ మధ్య తెరపైకి వచ్చింది. ఎవరైతే అసలైన పేదలున్నారో వారికి దారిద్య్రరేఖ నుండి పైకి తీసుకురావడానికి, వాళ్ళ కాళ్ళపై వారు నిలబడి బ్రతికే స్థితికి తీసుకురావడానికి సంక్షేమ పథకాలు రూపొందించబడ్డాయి.
కాని అవన్నీ ఇవాళ ఓట్ల రాజకీయాల ప్రచారంలో ప్రధానపాత్ర పోషించడం దుర్మార్గం. పై అంశాలపై నిరంతర చర్చ జరగాలి. రాజ్యాంగబద్దంగా అన్ని వ్యవస్థలు పని చేయాలి.
ప్రతిపక్షాల ఆందోళనలను ఎలా కట్టడి చేయాలనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. కాని పోలీసులకు అప్పగించడం దుర్మార్గం. మహిళా ఎమ్మెల్యేల పట్ల మహిళా సిబ్బందిని ఉపయోగించకుండా పరుషులను ఉపయోగించడం దారుణం. ఎమ్మెల్యే లుగా మహిళలు కంట తడిపెట్టడం ఎక్కడికి దారితీసింది.
కోర్టులు అప్పుడప్పుడు మందలిస్తూనే వున్నాయి. గత 40 సంవత్సరాల నుండి పార్టీ ఫిరాయింపులు ఆరంభమైనప్పటికీ శాసనసభ, పార్లమెంట్లలో ఫిరాయింపుల పర్వం సాగడం దారుణం. దీనిపై లోతుగా చర్చ జరగాల్సిం దే.
ఒకరినొకరు గౌరవించే దృక్పథం వస్తేనే ప్రజాస్వామ్య మూలసూత్రాలకు అర్థం.. పరమార్థం ఉంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ మూల సూత్రాలపై ప్రత్యే క కార్యాచరణకు ప్రజలు, మేధావులు ముందుకు రావాలి.