EDITORIAL: సరిహద్దు ఉద్రిక్తతలకు చర్చలే పరిష్కారం
EDITORIAL: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరగబోయే భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కేవలం ద్వైపాక్షిక సమావేశం మాత్రమే కాదు.. భారత్ సంబంధాల నుంచి 2020లో, తూర్పు లఢఖ్‌లో ఏర్పడిన సైనిక ఘర్షణ వరకు ఎన్నో అంశాలపై ఒక అవగాహనకు వచ్చే అద్భుత అవకాశం. నాటి నుంచి ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, చోటు చేసుకుంటున్న పరిణామాలు, సరిహద్దులో శాంతి పునరుద్ధరణకు జరుగుతున్న ప్రయత్నాలు నేడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు సైతం ఈ సమావేశానికి అసాధారణ ప్రాధాన్యం ఇస్తున్నాయి. జిన్‌పింగ్ ఈనెల 12, 13 తేదీ ల్లో న్యూఢిల్లీలో జరిగే 18వ ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్న తరుణం లో, ఏడేళ్ల తర్వాత జరుగుతున్న ఆయన భారత దేశ పర్యటన ఉత్కంఠ రేపుతున్నది.
ఈ సందర్భంగా మోదీతో జరిగే ద్వైపాక్షిక సమావేశాన్ని వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇరుదేశాలు విభేదాలను సమర్థంగా నిర్వహించుకోవాలని, పరస్పర సంబంధాల్లో సంభాషణను పెంచాలని, సహకారాన్ని విస్తరించాలని చైనా ప్రకటించడం ఆశాజనకమైన వాతావరణాన్ని కల్పిస్తున్నది.
భారత్, చైనా మధ్య అన్ని సమస్యలు ఒక్క సమావేశంతో పరిష్కారమవుతాయని అనుకోవడం అత్యాశే. సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే సమస్యలను పరిష్కరించడానికి నాయకులు మాట్లాడటం, అధికార యంత్రాంగాలు నిరంతరం సంప్రదింపులు జరపడం, సైనిక స్థాయిలో కూడా ప్రత్యక్ష సమాచార మార్పిడి కొనసాగించడం అత్యవసరం.
ఘర్షణలకు దిగడం, యుద్ధం ప్రారంభించడం సులభం. దాని పరిణామాలను నియంత్రించడం కష్టం. ఒక చిన్న సరిహద్దు సంఘటన కూడా పెద్ద సైనిక చర్యగా మారే ప్రమాదం ఉంది. భారత్, చైనా వంటి అణ్వస్త్ర దేశాల విషయంలో ఇది మరింత తీవ్రం. అందుకే సరిహద్దులో తుపాకులు మాట్లాడే పరిస్థితి రాకుండా, ఇరుదేశాల ప్రతినిధులు మాట్లాడే వ్యవస్థను బలపరచడం అత్యంత కీలకం.
ఇటీవల ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. ఆగస్టు 25న బీజింగ్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి నేతృత్వంలో సరిహద్దు అంశంపై ప్రత్యేక ప్రతినిధుల 25వ దఫా చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో ఇరుపక్షాలు ఎనిమిది అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి.
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించడం, సరిహద్దు పరిష్కారానికి చర్చలను ముందుకు తీసుకెళ్లడం, సరిహద్దు నిర్వహణను మెరుగుపరచడం, సమస్యలు తలెత్తితే దౌత్య, సైనిక మార్గాల ద్వారా వేగంగా పరిష్కరించడం వంటి అంశాలు అందులో ఉన్నాయి.
తూర్పు, మధ్య సెక్టార్లలో అదనపు సైనిక సమావేశ కేంద్రాలు, కొత్త సరిహద్దు హాట్‌లైన్ మార్గాలను ఏర్పాటు చేయడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. సరిహద్దు వాణిజ్యం, కైలాస మానస సరోవర్ యాత్ర, సరిహద్దు ప్రాంతాల సహకారం, అంతర్ సరిహద్దు నదులపై సమాచార మార్పిడి వంటి అంశాలను కూడా చర్చల పరిధిలోకి తీసుకువచ్చాయి. వచ్చే ఏడాది భారత్‌లో 26వ దఫా ప్రత్యేక ప్రతినిధుల చర్చలు నిర్వహించడానికి కూడా అంగీకరించాయి.
ఈ పరిణామాలన్నీ మోదీ భేటీకి ముందు చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు.
2020లో లఢఖ్‌లో ఏర్పడిన తీవ్ర ప్రతిష్ఠంభన తర్వాత ఇరుదేశాల సంబంధాలు దాదాపు నిలిచిపోయాయి. సరిహద్దులో సైనిక మోహరింపులు పెరిగాయి. అలాంటి పరిస్థితిలో మళ్లీ ఉన్నతస్థాయి రాజకీయ సంభాషణ ప్రారంభం కావడం ఒక ముఖ్యమైన మార్పు.
చర్చలు జరపడం అంటే, సమస్య పరిష్కారమైందని అర్థం కాదు. అయితే, సమస్య పరిష్కారానికి చర్చ మార్గం తెరుస్తుంది. భారత్ తన భద్రతా ప్రయోజనాలను వదులుకోకుండానే చైనాతో మాట్లాడవచ్చు. చైనా కూడా తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే భారత్‌తో చర్చలు కొనసాగించవచ్చు.
దౌత్యం అంటే ఒక దేశం మరొక దేశానికి లొంగిపోవడం కాదు. విభేదాలను యుద్ధానికి దారితీయకుండా నిర్వహించగల రాజకీయ పద్ధతి.
మోదీ మధ్య జరిగే భేటీ కేవలం సరిహద్దు సమస్యకే పరిమితం కాదు. భారత్, చైనా రెండూ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. రెండు దేశాల జనాభా కలిపితే ప్రపంచ జనాభాలో దాదాపు సగ భాగం. తయారీ, సాంకేతికత, ఔషధాలు, మౌలిక వసతులు, ఇంధనం, వాణిజ్యం, సరఫరా గొలుసులు వంటి అనేక రంగాల్లో ఇరుదేశాల నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.
సరిహద్దులో శాంతి నెలకొంటే దాని ప్రయోజనం కేవలం సైనిక రంగానికే పరిమితంకాకుండా, సరిహద్దు భద్రత కోసం ఖర్చయ్యే వనరులను ఇరుదేశాలు ఆర్థికాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సాంకేతిక పరిశోధన, మౌలిక సదుపాయాలు వంటి రంగాలకు మరింతగా మళ్లించే చర్యలకు మార్గాలను సుగమం చేస్తుంది.
వ్యాపార వర్గాలకు స్థిరత్వం వస్తుంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రజల మధ్య సంబంధాలు పెరుగుతాయి.
ఇక్కడ విభేదాలు లేకపోతే దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి అనే సూత్రా న్ని మరింత విస్తృతంగా చూడాలి. దేశాల మధ్య ప్రతి సమస్యకూ శాశ్వత పరిష్కారం సాధ్యం కాకపోవచ్చు. కానీ విభేదాలు యుద్ధంగా మారకుండా నియంత్రించవచ్చు.
భారత్, చైనా తమకు ఉన్న సమస్యలను నిర్వహిస్తూ సహకరించే రంగాలను విస్తరించగలిగితే రెండు దేశాలకు ప్రయోజనం కలుగుతుంది.
కాగా, ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి కూడా ఈ సహకారాన్ని మరింత అవసరంగా మారుస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడులు, హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు, నిరంతర ఘర్షణల ప్రభావం మధ్యప్రాచ్యంతోపాటు, యావత్ ప్రపంచంపై పడుతున్నది. చమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయ నౌకాయానం ప్రమాదంలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది.
మరోవైపు క్యూబాపైన కూడా ఆంక్షలు విధిస్తూ, అమెరికా తన పెత్తందారీ వైఖరిని ప్రదర్శిస్తున్నది.
ప్రపంచం ఒకేసారి అనేక భౌగోళిక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో భారత్, చైనా మధ్య సంబంధాల్లో స్థిరత్వం మరింత విలువైనదిగా మారుతోంది. ఇక్కడ అమెరికాను వ్యతిరేకించడమే భారత్, చైనా సహకారానికి కారణం కావాల్సిన అవసరం లేదు.
ఇరుదేశాల ప్రయోజనాలు, ఆసియా శాంతి, ప్రపంచ దక్షిణ దేశాల ఆర్థిక ప్రయోజనాలు వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ సమావేశం ద్వారా, రెండు దేశాలు తమ సరిహద్దులను కాపాడుకోవచ్చు. తమ భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవచ్చు. అదే సమయంలో చర్చల తలుపులు తెరిచి ఉంచవచ్చు.
అంతేగాక, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్, చైనా రెండూ ఆ ప్రమాదాన్ని తగ్గించాల్సిన బాధ్యత కలిగిన ప్రధాన శక్తులు. అందుకే ఈ సమావేశం ప్రాధాన్యత ద్వైపాక్షిక సంబంధాల సరిహద్దులను దాటి ఆసియా శాంతి, ప్రపంచ స్థిరత్వం వరకు విస్తరిస్తోంది.