Telangana Assembly Row: అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగితే సహించేది లేదు..సభ్యుల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం
BRS MLC Arrest
Telangana Assembly Row: తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్షాల నిరసనలపై శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సభను ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలన్నదే తన ఉద్దేశమని, అయితే సభలో జరిగిన అనుచిత సంఘటనలపై సంబంధిత నాయకులు క్షమాపణలు చెబుతారని భావిస్తే, అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
సభలో నిరసనలు, స్పీకర్ స్థానాన్ని అవమానించడంపై హరీష్ రావు తీరును ఆయన తప్పుబట్టారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు స్పీకర్ పరిధిలోకి రావనడం సరికాదని, పబ్లిక్ గార్డెన్స్ నుంచి అసెంబ్లీ వరకు ప్రతీ ప్రాంతం స్పీకర్ పరిధికే వస్తుందని, చర్యలు తీసుకునే పూర్తి అధికారం తనకు ఉందన్నారు.
సభను నడిపేందుకు కడియం శ్రీహరిని ప్యానెల్ స్పీకర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటిస్తూ, ఈ రోజంతా తాను సభా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు స్పీకర్ వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఇద్దరు BRS MLCలను, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది కాంగ్రెస్ పద్ధతి కాదనే ఆగామని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్, కౌశిక్ రెడ్డి పోలీసులను కొట్టిన వీడియోలు కనిపించాయని, మహిళా ఎమ్మెల్యేల ఇష్యూపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. నివేదికలు తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
సభ ప్రారంభానికి ముందు ఎల్పీ నేతలకు ఫోన్ చేయడం తన ఆనవాయితీ అని, అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి సభకు రావాలని కోరగా, ఆరోగ్యం సహకరించడం లేదని ఆయన తెలిపినట్లు చెప్పారు. గతంలో సబితా ఇంద్రారెడ్డికి, తనకు మధ్య తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, సభా మర్యాదలను ఎప్పుడూ దాటలేదని గుర్తుచేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన సభా నిబంధనలనే తాము ఇప్పుడు అమలు చేస్తున్నామని స్పీకర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్‌లో స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయగానే ప్లకార్డులను పక్కన పెట్టారని, ప్రజాప్రతినిధులు సభాగౌరవాన్ని కాపాడాలని సూచించారు.
- Telangana Assembly Session: కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్ పార్టీకి పడుతుంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. మీకంటే ఎక్కువ ఆవేశ పడాల్సింది నేను అంటూ స్పీకర్ కౌంటర్..
- KCR Farm House: రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తాము కేటీఆర్ వీడియో వైరల్… కేసీఆర్ ఫార్మ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం…కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్..
- Telangana Assembly Row: అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగితే సహించేది లేదు..సభ్యుల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం
- Telangana Assembly Tragedy: వీడియో ఇదిగో.. అసెంబ్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన అధికారి.. వెంటనే CPR చేసిన మంత్రి వాకిటి శ్రీహరి..
- Konidela Susmitha: విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా కొణిదెల సుస్మిత నియామకం…