Skip to content
తెలంగాణ వార్తలు

KCR Farmhouse Protest: ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేసీఆర్ ఫాంహౌస్‌ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

Prajapaksham 08 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
KCR Farmhouse Protest: ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేసీఆర్ ఫాంహౌస్‌ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

KCR In BRSLP Meeting

KCR Farmhouse Security: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి ప్రస్తుతం పోలీసుల పహారాలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యక్రమాలు ఒకే సమయంలో తెరపైకి రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

కేసీఆర్ ఫాంహౌస్‌ను వెయ్యి డప్పులతో ముట్టడిస్తామని కాంగ్రెస్ నేత సతీశ్ మాదిగ ప్రకటించడం ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణంగా మారింది. ఆయన పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకుల కదలికలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇదే సమయంలో రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ మర్కూక్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నేతలు రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పోలీసులు మండలంలో భద్రతా చర్యలను మరింత పెంచారు. ఎర్రవల్లి వైపు వెళ్లే మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అనుమానిత వాహనాలను పరిశీలిస్తున్నారు. పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ ఫాంహౌస్ సమీపానికి చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

మర్కూక్ మండలంలో రెండు ప్రధాన రాజకీయ కార్యక్రమాలు ఒకేసారి చోటుచేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కేసీఆర్ ఫాంహౌస్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రకటించిన నిరసన ఒకవైపు.. రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్ చేపట్టనున్న దీక్ష మరోవైపు ఉండటంతో పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు, తనిఖీలు, ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు.

ట్యాగ్‌లు: Telangana