BRS MLC Arrest: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
BRS MLC Arrest
స్పీకర్‌పై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తాతా మధును ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, నవీన్ కుమార్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని అసెంబ్లీ పరిసరాల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆందోళన సమయంలో అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న ఎస్‌ఐ నిఖిత్ కుమార్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవనం సమీపంలో నిలిపి ఉంచిన ప్రభుత్వ వాహనం అద్దాన్ని ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలకు సంబంధించి ఆందోళనకారులు, బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీడీపీపీ చట్టంతో పాటు బీఎన్ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ప్రత్యేకంగా కేసు నమోదు చేశారు. తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై U/s 352 r/w 3(5) BNS, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(1)(r), 3(2)(va) కింద కేసులు నమోదయ్యాయి.
స్పీకర్‌ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని, ముందస్తు ప్రణాళికతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇద్దరు ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిర్వహించిన నిరసనల సందర్భంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే స్పీకర్‌పై ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు, పోలీసులతో చోటుచేసుకున్న ఘర్షణలు వివాదానికి దారితీశాయి.