కేసీఆర్‌ది దొరల న్యాయం.. మాది సామాజిక న్యాయం.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి..
KCR vs Revanth
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బహుజనులదని, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక వర్గం కోసం కాకుండా బహుజనుల కోసం పోరాడిన మహనీయుడని సీఎం పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు కూడా అంతే గౌరవం దక్కాలని ఆకాంక్షించారు.
ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని సీఎం వివరించారు. నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు విగ్రహాన్ని చూసి ఆయన చరిత్ర, పోరాట స్ఫూర్తిని తెలుసుకోవాలని అన్నారు. విగ్రహం వద్ద మెరుగైన లైటింగ్‌తో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఉన్న స్థాయిలో పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
గౌడ కులవృత్తిని కాపాడేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అర్హులైన గీత కార్మికులందరికీ పింఛన్లు అందించేలా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ భూములు, కాలువ గట్లపై ఈత, తాటి చెట్లు నాటేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గౌడ సోదరులకు 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు గీత కార్మికులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
కులవృత్తిని గౌరవిస్తూ కొనసాగించాలని, అయితే పిల్లలను మాత్రం తప్పనిసరిగా చదివించాలని సీఎం పిలుపునిచ్చారు. విద్య ద్వారానే బహుజన వర్గాల పిల్లలు వైద్యులు, న్యాయవాదులు, ఐఏఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులుగా ఎదగగలరని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం, అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం అవసరమైనంత నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించిన ఆయన.. తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. కేసీఆర్‌ది కుటుంబ న్యాయం.. మాది సామాజిక న్యాయం. కేసీఆర్‌ది దొరల న్యాయం.. మాది సామాజిక న్యాయం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి చర్యలను తమ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. మహిళలు, బీసీలు, వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుందని చెప్పారు
తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం వివరించారు. రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు, మహిళా సంఘాలకు బ్యాంకు అనుసంధాన రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలు, క్రీడా విశ్వవిద్యాలయం వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం వదిలిన భారీ అప్పులు తమ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయని రేవంత్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
- Coringa Mystery: ఏపీలో ఎవరికీ తెలియని కోరింగా రహస్యం.. సముద్రం మధ్యలో కనిపించే ఆ వింత గురించి ఎవరికైనా తెలుసా..
- తెలంగాణ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్.. లండన్, అమెరికాలో కీలక భేటీలు.. పూర్తి షెడ్యూల్ ఇదే
- కేసీఆర్‌ది దొరల న్యాయం.. మాది సామాజిక న్యాయం.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి..
- Thousand Pillar Temple: వేయి స్తంభాల గుడి వెనుక దాగిన రహస్యాలు.. ఇప్పటికీ ఎవరికీ అర్థంకానిది అదొక్కటే..
- తెలంగాణలో ఎవరికీ తెలియని చరిత్ర.. రామప్ప చెరువు నీటి రహస్యం ఇదే.. ములుగు అడవుల్లో దాగిన 800 ఏళ్ల జల మిస్టరీ