Skip to content
బిజినెస్ వార్తలు

పాలిమర్‌ నోట్లు… భారత కరెన్సీ మరో మలుపు

Prajapaksham 13 Aug 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
పాలిమర్‌ నోట్లు… భారత కరెన్సీ మరో మలుపు

Plastic Currency

-శ్రీశైలం దూడం

డబ్బు కేవలం కాగితం కాదు.. అది ప్రజల నమ్మకానికి ప్రతీక. చేతిలోని రూ.10 నోటు టీ దుకాణం నుంచి కిరాణా షాపు వరకు, కూలీ నుంచి చిన్న వ్యాపారి వరకు ఎన్నో చేతులు మారుతుంది. అందుకే కరెన్సీలో మార్పును కేవలం ముద్రణా సాంకేతికతగా చూడలేం. అది సామాన్యుడి ఆర్థిక జీవితాన్ని తాకే పరిణామం.

ఒకప్పుడు వస్తు మార్పిడి. ఆ తర్వాత మెసపటోమియా నాగరికతలో లావాదేవీల లెక్కల కోసం మట్టి టోకెన్లు. అనంతరం బంగారం, వెండి, రాగి నాణేలు.. ఆపై కాగితపు నోట్లు. ఇప్పుడు పాలిమర్‌ కరెన్సీ. వేల ఏళ్ల డబ్బు ప్రయాణంలో ఇది మరో కీలక మలుపు.

ఇది ఇక ఊహల దశలో లేదు. పాలిమర్‌ కరెన్సీపై ప్రయోగానికి ఆమోదం లభించింది. తొలి దశలో రూ.10, రూ.20 నోట్లతో ఫీల్డ్‌ ట్రయల్స్‌ చేపట్టనున్నారు. ఒక్కో విలువకు 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల నోట్లు ప్రయోగంలోకి రానున్నాయి. వాటి మొత్తం విలువ సుమారు రూ.3,000 కోట్లు. పాలిమర్‌ సబ్‌స్ట్రేట్‌ తయారీ, సరఫరా కోసం ప్రపంచ తయారీ సంస్థల నుంచి గ్లోబల్‌ ఇఒఐ ఆహ్వానించడం ఈ ప్రయోగం ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.

అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. నోటు మార్చడమే లక్ష్యమా.. లేక కరెన్సీ నిర్వహణను మార్చడమే అసలు ఉద్దేశమా?

రూ.10, రూ.20 నోట్లు అత్యధికంగా చేతులు మారే చిన్న విలువ కరెన్సీలో కీలకమైనవి. టీ దుకాణాలు, బస్సులు, కిరాణా వ్యాపారాలు, గ్రామీణ మార్కెట్లలో నిరంతరం చలామణిలో ఉంటాయి. అందుకే త్వరగా మాసిపోవడం, చిరగడం జరుగుతుంది. ఎక్కువకాలం మన్నే పాలిమర్‌ నోట్లు వస్తే తరచూ కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం తగ్గవచ్చు. దీర్ఘకాలంలో ప్రభుత్వ వ్యయభారం కూడా తగ్గే అవకాశం ఉంది.

భద్రత మరో ముఖ్యమైన కోణం. పారదర్శక భద్రతా విండోలు, సూక్ష్మ గుర్తులు, ప్రత్యేక భద్రతా లక్షణాలు నకిలీ నోట్ల తయారీని కష్టతరం చేయవచ్చు. కానీ సాంకేతికత ఒక్కటే నకిలీ కరెన్సీని అంతం చేయదు. సమర్థమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ, నిఘా, ప్రజల అవగాహన కూడా అవసరం.

పర్యావరణ ప్రశ్నను కూడా పక్కన పెట్టలేం. పాలిమర్‌ నోట్లు ఎక్కువకాలం మన్నినా, వాటి జీవితాంతం తర్వాత సేకరణ, పునర్వినియోగం ఎలా? తయారీ నుంచి రీసైక్లింగ్‌ వరకు మొత్తం పర్యావరణ ప్రభావం ఎంత? మన్నిక ఒక్కటే విజయానికి కొలమానం కాకూడదు.

డిజిటల్‌ చెల్లింపులు, యూపీఐ విస్తరిస్తున్నా భారతదేశంలో నగదుకు ఇంకా ప్రత్యేక స్థానం ఉంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారాలు, రోజువారీ కూలీ వర్గాల్లో చేతి నగదు కీలకం. అందువల్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నా భౌతిక కరెన్సీని ఒక్కసారిగా పక్కన పెట్టలేం.

పాలిమర్‌ నోట్లు వస్తున్నాయంటే ప్రస్తుత కాగితపు నోట్లు రద్దవుతాయని కాదు. ప్రస్తుతం కాగితపు కరెన్సీని పూర్తిగా పాలిమర్‌తో భర్తీ చేసే ప్రతిపాదన లేదనే స్పష్టత ఉంది. ముందుగా ప్రయోగం.. ఆ తర్వాత ఫలితాల ఆధారంగా నిర్ణయం. ఫీల్డ్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే 2027 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పాలిమర్‌ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, సింగపూర్‌ వంటి దేశాలు పాలిమర్‌ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. వారి అనుభవం భారత్‌కు ఉపయోగపడొచ్చు. కానీ మన జనాభా, వాతావరణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, నోట్ల లెక్కింపు యంత్రాల అనుకూలత, దృష్టి లోపం ఉన్నవారికి గుర్తించే సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

సోషల్‌ మీడియాలో గాంధీజీ చిత్రం తొలగుతుందని, అన్ని నోట్లు పాలిమర్‌గా మారతాయని, పాత నోట్లు రద్దవుతాయని వచ్చే ప్రచారాలను నమ్మకూడదు. కరెన్సీ విషయంలో అధికారిక ప్రకటనకే ప్రామాణికత. ఇక్కడ ప్రభుత్వ పారదర్శకత కూడా కీలకం. ఎన్ని నోట్లు ముద్రిస్తారు, ఎక్కడ ప్రయోగిస్తారు, పరీక్షలు ఎంతకాలం సాగుతాయి, ఫలితాలను ఎలా అంచనా వేస్తారు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. లేకపోతే చిన్న మార్పే పెద్ద అపోహలకు దారితీస్తుంది. కరెన్సీ విషయంలో ప్రజల విశ్వాసాన్ని కాపాడటం కూడా ఆర్థిక నిర్వహణలో భాగమే.

మరోవైపు పాలిమర్‌ నోట్ల తయారీ వ్యయం, సరఫరా వ్యవస్థ, పాత నోట్ల ఉపసంహరణ, రీసైక్లింగ్‌ ప్రక్రియలపై కూడా ముందస్తు ప్రణాళిక అవసరం. చిన్న నోట్లే ఎక్కువగా చేతులు మారుతున్నందున వాటి నాణ్యత ప్రజల అనుభవాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. కొత్త నోటు తడిసినా, మురికైనా, మడిచినా గుర్తింపు సులభంగా ఉండాలి. దుకాణదారుడు, బ్యాంకు సిబ్బంది, యంత్రాలు ఒకే విధంగా స్వీకరించగలగాలి. అప్పుడే మన్నిక అనే ప్రయోజనం సామాన్యుడికి నిజమైన సౌకర్యంగా మారుతుంది.

లేకపోతే మెరుగైన సాంకేతికత కూడా మరో నిర్వహణ సమస్యగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయోగం వేగం కంటే, దాని ఫలితాలపై శాస్త్రీయ మూల్యాంకనం, ప్రజల అనుభవం, నిపుణుల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సరైన మార్గం.

పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతేనే తదుపరి విలువల నోట్లపై ఆలోచన జరగాలి. ప్రయోగం విఫలమైతే వెనక్కి తగ్గే ధైర్యం కూడా వ్యవస్థకు ఉండాలి. ఎందుకంటే ప్రజాధనం, ప్రజా విశ్వాసం రెండూ ప్రయోగాల కంటే విలువైనవి.

మట్టి టోకెన్ల నుంచి లోహపు నాణేలకు.. కాగితం నుంచి పాలిమర్‌కు.. మరోవైపు డిజిటల్‌ రూపానికి డబ్బు ప్రయాణిస్తోంది. రూపం మారడం సహజం. కానీ ప్రజల విశ్వాసం మాత్రం మారకూడదు. అందుకే పాలిమర్‌ నోట్ల విజయాన్ని అవి ఎంతకాలం మన్నాయన్నదానితో మాత్రమే కొలవకూడదు. భద్రత, మన్నిక, ఖర్చు, పర్యావరణ బాధ్యత, అందుబాటు, పారదర్శకత ఆరు ప్రమాణాలపై కొలవాలి.

చివరికి ఇది కాగితాన్ని ప్లాస్టిక్‌తో మార్చే కథ కాదు. భారతీయ కరెన్సీ భవిష్యత్తు ఎలా ఉండాలి? అన్న పెద్ద ప్రశ్నకు మొదలైన ప్రయోగం. నోటు ఏ పదార్థంతో తయారైనా.. దాని వెనుక ఉన్న అసలు విలువ మాత్రం ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడితేనే పాలిమర్‌ నోట్ల మార్పు నిజమైన ఆర్థిక పురోగతిగా నిలుస్తుంది.

ట్యాగ్‌లు: plastic currency notes RBI