N Chandrasekaran Resigns: టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా.. షేర్ మార్కెట్లో కుప్పకూలిన కంపెనీ షేర్లు..
N Chandrasekaran
N Chandrasekaran Resigns: టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న తన పదవీకాలం ముగిసే వరకు (2027 ఫిబ్రవరి 20 వరకు) ఆయన ఈ బాధ్యతల్లోనే కొనసాగుతారు. తదుపరి పదవీకాలానికి (పునఃనియామకానికి) తాను అందుబాటులో ఉండటం లేదని.. త్వరగా తదుపరి వారసుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ఆయన టాటా సన్స్ బోర్డును కోరారు.
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాతో గ్రూప్ పాలనా వ్యవహారాల్లో వచ్చిన విభేదాలే చంద్రశేఖరన్ వైదొలగడానికి ప్రధాన కారణమని సమాచారం. 2026 ఫిబ్రవరి 24న జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని ప్రతిపాదించగా.. నోయెల్ టాటా దానికి మద్దతు ఇవ్వలేదు. టాటా సన్స్‌ను ఎప్పటికీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయకూడదనే షరతుతో పాటు బోర్డు ప్రాతినిధ్యంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ బోర్డు సమావేశం జరిగి ఆరు నెలలు గడిచినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, సంస్థ భవిష్యత్తు మరియు వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చంద్రశేఖరన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్‌లో చేరి, 2009లో టీసీఎస్ (TCS) సీఈఓగా ఎదిగారు. అనంతరం 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్‌లో 40 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం ఈ గౌరవనీయ సంస్థకు నాయకత్వం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
చంద్రశేఖరన్ రాజీనామా వార్త బయటకు రావడంతోనే స్టాక్ మార్కెట్‌లో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS) షేరు ఏకంగా 5 శాతం వరకు పడిపోయి రూ. 2,336.90 వద్ద ట్రేడ్ అయింది. వీటితో పాటు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (1.6%), టైటాన్ కంపెనీ (1.3%) షేర్లు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. నోయెల్ టాటా నాయకత్వంలోని టాటా ట్రస్ట్స్‌కు టాటా సన్స్‌లో 66% వాటా ఉంది. 2016లో సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత మళ్లీ ఇప్పుడు టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు బహిర్గతం కావడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- Realme 16x 5G: మార్కెట్లోకి భారీ బ్యాటరీతో రియల్ మీ 5G ఫోన్ విడుదల.. 7000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే..ధర ఎంతంటే..?
- Chandrasekaran Resigns: చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా గ్రూపుకు అసలు పరీక్ష.. కొత్త సారథి ముందున్న అసలైన సవాళ్లు ఇవే..
- N Chandrasekaran Success Story: ఎన్. చంద్రశేఖరన్ సక్సెస్ స్టోరీ.. తమిళనాడు పల్లె నుండి టాటా సన్స్ ఛైర్మెన్ శిఖరాల దాకా.. మొదటి పార్సీయేతర వ్యక్తిగా..
- N Chandrasekaran Resigns: చంద్రశేఖరన్ రాజీనామాకు కారణం అదే.. ఆరు నెలల నుంచే టాటా సన్స్ గ్రూపులో ఘర్షణలు..
- N Chandrasekaran Resigns: టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా.. షేర్ మార్కెట్లో కుప్పకూలిన కంపెనీ షేర్లు..