Skip to content
జాతీయం వార్తలు

Madhya Pradesh Tragedy: డ్రైవర్ నిర్లక్ష్యానికి తొమ్మిది మంది బలి.. ఉప్పొంగుతున్న కాలువలో కొట్టుకుపోయిన వ్యాన్..

Prajapaksham 10 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Madhya Pradesh Tragedy: డ్రైవర్ నిర్లక్ష్యానికి తొమ్మిది మంది బలి.. ఉప్పొంగుతున్న కాలువలో కొట్టుకుపోయిన వ్యాన్..

Madhya Pradesh Tragedy

Madhya Pradesh Tragedy: ఒక వాహన డ్రైవర్ అతివిశ్వాసం, నిర్లక్ష్యం ఏకంగా తొమ్మిది మంది అమాయక ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకుంది. భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువను దాటగలననే మూర్ఖత్వంతో ప్రయాణికులతో ఉన్న వ్యాన్‌ను నీటిలోకి పోనివ్వడంతో.. నీటి ప్రవాహానికి వ్యాన్ కొట్టుకుపోయి తొమ్మిది మంది జలసమాధి అయ్యారు. ఈ ఘోర దుర్ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా సారంగపూర్ పట్టణ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక నదులు, వాగులు, కాలువలు ఉగ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే సారంగపూర్ పట్టణ పరిధిలోని పడానా బైపాస్ మార్గంలో ఉన్న కాలువ సోమవారం ఉదయం నిండి ప్రవహిస్తోంది. నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులతో పాటు అధికారులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

అదే సమయంలో 11 మంది ప్రయాణికులతో వచ్చిన ఒక వ్యాన్ కాలువ దాటేందుకు సిద్ధపడింది. కాలువలో ప్రవాహం చాలా ఎక్కువగా ఉందని, వ్యాన్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అక్కడ ఉన్న స్థానికులు, అధికారులు కేకలు వేస్తూ డ్రైవర్‌ను తీవ్రంగా హెచ్చరించారు. అయినప్పటికీ, డ్రైవర్ వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యాన్‌ను నీటిలోకి పోనిచ్చాడు.

వ్యాన్ కాలువ మధ్యలోకి చేరుకోగానే, ఉధృతంగా వస్తున్న నీటి ప్రవాహానికి తట్టుకోలేక కంట్రోల్ తప్పి కొట్టుకుపోవడం ప్రారంభమైంది. స్థానికులు చూస్తుండగానే క్షణాల వ్యవధిలోనే వ్యాన్ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ క్రమంలో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా శ్రమించి ఎలాగోలా వాహనం నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే స్పందించిన స్థానికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో వ్యాన్ చాలా దూరం కొట్టుకుపోవడంతో మిగతా వారిని రక్షించలేకపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే సారంగపూర్ పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి, ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది మృతదేహాలను, అలాగే కొట్టుకుపోయిన వ్యాన్‌ను బయటకు తీశారు. స్థానికులు ఎంత హెచ్చరించినా వినని డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ దురదృష్టకర సంఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.