Skip to content
ప్రపంచం వార్తలు

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని తెరవాలంటే ఇరాన్‌తో ట్రంప్ రాజీ పడాల్సిందే

Prajapaksham 09 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని తెరవాలంటే ఇరాన్‌తో ట్రంప్ రాజీ పడాల్సిందే

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని తెరవాలంటే ఇరాన్‌తో ట్రంప్ రాజీ పడాల్సిందే

హోర్ముజ్ జలసంధిని తెరవాలంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో రాజీ ఒప్పందానికి రావాల్సిందే. కానీ ఆయన పైకి మాత్రం లేనిపోని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఒక ఒప్పందానికి చేరువలో ఉన్నామని అమెరికా-ఇరాన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు.

హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోవడం వల్ల ప్రపంచ వాణిజ్యం ఇప్పటికే చతికిలపడింది. ఒమన్ తీరానికి సమీపంలో ఉన్న మార్గం తెరిచే ఉందని సెంట్కామ్ చెబుతున్నది. సమస్య పరిష్కారమయ్యేవరకూ హోర్ముజ్ మూసే ఉంటుందని ఇరాన్ అంటున్నది.

ఇరాన్ సుంకాలు వసూలు చేసే ఎలాంటి ఒప్పందాన్నైనా వ్యతిరేకిస్తామని ట్రంప్ చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడి తనపై పడిన అపప్రథ తొలగించుకోవాలంటే తన స్వభావానికి విరుద్ధంగా రాజీపడాలి. లేకపోతే ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోతారు. ఈ మేరకు బెన్ఫన్లీ, మాథ్యూ లీ రాసిన ఒక విశ్లేషణను పీటీఐ వార్తా సంస్థ ప్రచురించింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ దాడులు చేస్తామని ఒకవైపు ఇరాన్‌ను ట్రంప్ బెదిరిస్తుంటే, అమెరికా రక్షణమంత్రి పెట్ హెగ్సెత్, సెంట్కామ్ అధిపతి డాన్ కెయిన్ వంటి వారు కీలక ఆయుధాలు తగినన్ని లేవని బాహాటంగా ప్రకటనలు చేయడం ద్వారా ట్రంప్ పరువు తీస్తున్నారు.

వారిపై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి దూరం చేసుకోలేక, దిగమింగుకోలేక ట్రంప్ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పరువు కాపాడుకోవడానికి భారీ దాడి బెదిరింపులు ట్రంప్ చేస్తుంటే, తాజాగా హెగ్సెత్ ఆయన పరువు తీశారు. ఆయనపై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్లీ ఆయనతో తన సంబంధాలు బాగా ఉన్నాయని చెప్పుకుంటూ నానా అవస్థలు పడుతున్నారు.

ఈ దశలో ఇరాన్‌కు నైతికంగా చాలా గొప్ప ధైర్యం లభించింది. ఇప్పటికే ఇరాన్‌కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించడమే కాకుండా, అమెరికాను ఎదుర్కొని నిలబడిన దేశంగా కీర్తిప్రతిష్ఠలు కూడా లభించాయి.

అవసరానికి మించినన్ని కీలక ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని ట్రంప్ ఇంకా ఇంకా బడాయి కబుర్లు చెబుతూనే ఉన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే ట్రంప్‌కు ఎలాంటి రాయితీలు ఇచ్చినా కష్టమే. ఓడిపోయిన వ్యక్తిగా ప్రపంచం ముందు నిలబడిపోవడం ట్రంప్ భరించరాని విషయంగా ఉంటుందని, ఆయన దాన్ని సహించలేరని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

యుద్ధం చాలా తొందరలోనే ముగిసిపోతుందని ట్రంప్ మరోసారి తాజా ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిపైనే ఇప్పుడు ప్రధాన ప్రతిష్ఠంభన నెలకొంది. ట్రంప్ మొదటి నుంచి చెబుతున్న ఇరాన్ అణ్వాయుధం వెనక్కు వెళ్లిపోయింది.

ప్రపంచ దేశాల చమురు రవాణాకు సంబంధించిన జలసంధి ప్రధానంగా తెరమీదకు వచ్చింది. యుద్ధానికి ముందునాటి పరిస్థితి ఇప్పుడు లేదని, ఇక ఇది బహిరంగ జలసంధిగా మారబోదని, ఈ జలసంధి తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది.

పైగా ఒమన్, ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కూడా ఇప్పుడు సాధ్యపడింది. ఈ ఒప్పందం ప్రకారం పర్షియన్ జలసంధిలోకి ప్రవేశించే అన్ని నౌకలూ ఇరాన్ ప్రాదేశిక జలాల్లోంచి వెళతాయి. ఒమన్ ప్రాదేశిక జలాల్లోంచి మహాసముద్రంలోకి ప్రవేశిస్తాయి.

ఐదు నెలలుగా ఇరాన్‌పై 14,000కు పైగా దాడులు చేసింది. అయినాగానీ ఇరాన్ గల్ఫ్ శాలలో బలమైన క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తోంది. అయినాగానీ నిర్దిష్ట లక్ష్యాలు ట్రంప్‌కు లేవు. తాను స్వయంగా సృష్టించిన యుద్ధ సమస్య పరిష్కారానికి బిలియన్ల కొద్దీ డాలర్లు కావాలని పెంటగాన్ కోరుతోంది. ఈ అవసరాలు ఆయన పూర్తిగా తీర్చే స్థితిలో లేరు.

మరోవైపు పెట్రోల్ ధర మండిపోతోంది. నవంబర్‌లో అమెరికాలో ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యర్థులు పెద్ద సవాలు విసురుతున్నారు. దేశ ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందని నెలవారీ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ దశలో ట్రంప్ లొంగిపోయేందుకు ఇష్టపడరు. కానీ లేని గాంభీర్యంతో మెలికలు పెట్టి రాజీపడేందుకు ఆయన ముందుకు రావచ్చునని వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ నియర్ ఈస్ట్ పాలసీ ఫెలో షెంకర్ చెబుతున్నారు.