Skip to content
తెలంగాణ వార్తలు

మందుబాబులకు షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు దిశగా సర్కారు యోచన ..

Prajapaksham 08 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
మందుబాబులకు షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు దిశగా సర్కారు యోచన ..

Liquor

తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం సహా అన్ని రకాల బ్రాండ్ల మద్యం ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్‌పీ (MRP) ధరల నివేదికను గురువారం ప్రభుత్వానికి సమర్పించింది. ఎక్సైజ్ శాఖ ఈ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుండగా.. ఆగస్టు 15 తర్వాత ఏ క్షణమైనా కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో చివరిసారిగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలను సవరించారు. సాధారణ నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి ధరలను సమీక్షించాల్సి ఉంది. అయితే గత మూడేళ్లుగా పెంపు లేకపోవడంతో ముడిసరుకుల వ్యయం, రవాణా ఛార్జీలు, సిబ్బంది జీతాలు మరియు పన్నుల భారం పెరిగి తీవ్రంగా నష్టపోతున్నామని డిస్టిలరీలు (మద్యం తయారీ సంస్థలు) ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ధరల నిర్ణయ కమిటీ’ డిస్టిలరీల ప్రతినిధులతో చర్చలు జరిపి సబ్-కమిటీ నివేదికను రూపొందించింది.

ప్రస్తుతం డిస్టిలరీలు 10 నుండి 15 శాతం వరకు ధరలు పెంచాలని కోరుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. మద్యం ధరలను మరీ ఎక్కువగా పెంచితే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి అక్రమ రవాణా (లిక్కర్ స్మగ్లింగ్) పెరిగి రాష్ట్ర ఆదాయానికి గండి పడే ప్రమాదం ఉందని భావిస్తోంది. అందుకే పొరుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత ధరలతో పోల్చి చూసిన తర్వాతే పెంపు శాతాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సబ్-కమిటీ నివేదికపై ఎక్సైజ్ శాఖ పరిశీలన పూర్తయిన వెంటనే నూతన ధరలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.