Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్… వసూలు చేసిన అదనపు టారిఫ్‌లను తిరిగి చెల్లిస్తున్న అమెరికా
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్... వసూలు చేసిన అదనపు టారిఫ్‌లను తిరిగి చెల్లిస్తున్న అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు ప్రపంచ దేశాలతో పాటు, స్వదేశాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. వివిధ దేశాలపై ట్రంప్ విధించిన అదనపు టారిఫ్‌ల చెల్లుబాటును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు, ఆ మొత్తాలను తిరిగి చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఆ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం వివిధ దిగుమతిదారులకు ఏకంగా 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.4 లక్షల కోట్లు) సుంకాలను తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది. ఆమోదించిన అత్యవసర అధికారాలను ఉపయోగించి వివిధ దేశాలపై ట్రంప్ విధించిన అదనపు పన్నులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అమెరికా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
గతంలో కంపెనీల నుంచి వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అవసరమైన కీలక లాంఛనాలను పూర్తి చేస్తోంది.
బెడిసికొడుతున్న అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు
టారిఫ్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చైనా, యూరప్, భారతదేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికాకు విదేశాల నుంచి దిగుమతయ్యే జెనెరిక్ మందులపై దశలవారీగా భారీ టారిఫ్‌లను ప్రతిపాదించడం వల్ల భారత ఫార్మా రంగానికి ఎదురుదెబ్బ తగిలింది.
అదే సమయంలో, మందుల ధరలు విపరీతంగా పెరగడంతో అమెరికాలోని రోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా, చైనా, ఐరోపాలతో సప్లై చైన్ మౌలిక వనరులు, తయారీ రంగాల పట్ల ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు గ్లోబల్ సప్లై చైన్‌ను మళ్లీ అనిశ్చితిలోకి నెట్టివేస్తున్నాయి.
అయితే, వివిధ ఫెడరల్ కోర్టులతో పాటు, సుప్రీంకోర్టు కూడా వివిధ కేసులపై ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడంతో పరిస్థితి క్రమంగా చక్కబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో వస్తువుల ధరలు, సరఫరా వ్యవస్థలపై రాబోయే రోజుల్లో స్పష్టమైన మార్పులు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.