Skip to content
తెలంగాణ వార్తలు

Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూపు వరంగల్ హైవే వైపు…బీబీనగర్, ఉప్పల్ కారిడార్ వైపు చూస్తున్న మిడిల్ క్లాస్..

Prajapaksham 06 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూపు వరంగల్ హైవే వైపు…బీబీనగర్, ఉప్పల్ కారిడార్ వైపు చూస్తున్న మిడిల్ క్లాస్..

Hyderabad Real Estate

ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాలే గుర్తుకొచ్చేవి. అయితే అక్కడ భూముల ధరలు సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోవడంతో, అభివృద్ధి వేగంగా తూర్పు హైదరాబాద్ వైపు (ఈస్ట్ కారిడార్) మళ్లింది. ఈ కారిడార్ ఉప్పల్ నుంచి ప్రారంభమై ఘట్‌కేసర్, పీఏసీఎల్, బీబీనగర్ మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి వరకు దాదాపు 40-50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ బెల్ట్ స్థిరాస్తి పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రస్తుతం నాగోల్ వరకే ఉన్న మెట్రో రైలు సేవలను, రాయగిరి, యాదాద్రి వరకు విస్తరించే ప్రతిపాదనలు పురోగతిలో ఉన్నాయి. అందులో భాగంగా ఉప్పల్ – బీబీనగర్ మెట్రో లైన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రయాణ మార్గం అత్యంత వేగవంతం కానుంది.హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని ఆరు లేన్ల రహదారిగా తీర్చిదిద్దడం, అక్కడక్కడ అండర్ పాస్‌లు, బైపాస్‌లు నిర్మించడంతో ఈ రహదారి వెంట ఉన్న భూములకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

ఓపెన్ ప్లాట్లు & గేటెడ్ లేఅవుట్ల జోరు:
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించేవారికి ఈ ప్రాంతం అనుకూలంగా మారింది. దీంతో బీబీనగర్, భువనగిరి పరిసరాల్లో వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లు విపరీతంగా పెరిగిపోయి, ప్లాట్ల అమ్మకాలు పుంజుకున్నాయి. దేశంలోనే అత్యున్నత వైద్య నిలయమైన ‘ఎయిమ్స్’ ఆసుపత్రి బీబీనగర్‌లో ఏర్పాటు కావడంతో ఈ ప్రాంత ముఖచిత్రం మారింది. రోగులు, మెడికల్ విద్యార్థులు, సిబ్బంది రాకపోకలతో పాటు చుట్టుపక్కల వ్యాపార కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం ఈస్ట్ హైదరాబాద్ ఐటీ పాలసీ కింద ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో ఐటీ పార్కులను ప్రోత్సహిస్తోంది. దీనికి తోడు బీబీనగర్, భువనగిరి పరిసరాల్లో లాజిస్టిక్ హబ్‌లు, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు అడుగులు పడుతుండటంతో ఉద్యోగావకాశాలు, నివాస అవసరాలు పెరుగుతున్నాయి.

మధ్యతరగతికి అందుబాటు ధరలు:
పశ్చిమ హైదరాబాద్‌లో ఒక స్క్వేర్ యార్డ్ (గజం) ధర రూ. 60,000 నుండి లక్షకు పైగా ఉంటే, బీబీనగర్-భువనగిరి ప్రాంతాల్లో సామాన్యులు మరియు మధ్యతరగతి వర్గాలు కూడా సులభంగా కొనుగోలు చేయగలిగే ధరల్లో ప్లాట్లు లభిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) పరిధి బీబీనగర్ వరకు ఉండటం, అలాగే భువనగిరి పరిసరాలు యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YDA) కిందకు రావడంతో చట్టబద్ధమైన, ప్రభుత్వ ఆమోదం పొందిన అనుమతుల ఉన్న లేఅవుట్లు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి.

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్:
ఉప్పల్ జంక్షన్ వద్ద నిత్యం ఉండే ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు నిర్మించిన సుదీర్ఘమైన ఎలివేటెడ్ కారిడార్ వలన, నగర కేంద్రం (City Center) నుండి ఘట్‌కేసర్ మరియు బీబీనగర్‌కు వెళ్లే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. హైదరాబాద్-వరంగల్ 6-లేన్ల రహదారి కారణంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి బీబీనగర్‌కు కేవలం 30 నుండి 40 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే సౌకర్యం ఏర్పడింది. ఘట్‌కేసర్ వద్ద ఉన్న ORR ఎగ్జిట్ నంబర్ 9 ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు నగరంలోకి వెళ్లకుండానే చాలా వేగంగా చేరుకోవచ్చు.

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) గేమ్ చేంజర్:
భవిష్యత్తులో రాబోతున్న 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు (RRR) బీబీనగర్ – భువనగిరి కారిడార్‌ను దాటుకుని వెళ్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో భూముల విలువలు రెట్టింపు లేదా ముమ్మడి అయ్యే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో భూముల ధరలు బాగా పెరుగుతాయన్న అంచనాతో నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈస్ట్ కారిడార్‌లో పెద్ద ఎత్తున భూములను సేకరించి నూతన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు పోటీ పడుతున్నాయి.

ఈ ప్రాంతం కేవలం ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఓపెన్ ప్లాట్లకు మాత్రమే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఇండిపెండెంట్ ఇళ్ళు, విల్లాలు మరియు గేటెడ్ అపార్ట్‌మెంట్ల నిర్మాణ రంగానికి సరికొత్త హబ్‌గా మారబోతోంది. కాబట్టి దీర్ఘకాలిక లాభాలు కోరుకునే వారికి ఇది ఒక లొకేషన్ అని చెప్పవచ్చు.