ధర్మం, సంయమనం, రాజకీయాల మధ్య నిలిచిన స్వరం
Lal Das
సిహెచ్వి ప్రభాకర్ రావు
అయోధ్య రామ మందిర నిర్మాణంలో కలిసి పోయిన ఒక అభాగ్యుడు బాబా లాల్ దాస్: అయోధ్యలో వినిపించని స్వరం మతం, రాజకీయాలు, మనిషి మధ్య నిలిచిన ఒక సన్యాసి. మతం మనుషులందరిని కలిపే ఒక మహత్తర శక్తిగా భావించిన మహామనీషి. అందుకే మతాన్ని రాజకీయాలుగా, అధికారానికి సోపానాలుగా మార్చుకొన్న వారి ఆగ్రహానికి బలి అయ్యాడు. అయోధ్య రామాలయంలో భక్తులు ధన, వస్తు రూపంలో ఇచ్చిన దానాలు అక్రమదారులలో తరలిపోయాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. కానీ ఇలాంటి ఆరోపణలు కొత్తవి కావని, అయోధ్య రామాలయ ఉద్యమ ప్రారంభకాలం నుండే భక్తుల విరాళాల దుర్వినియోగం, వ్యకిగత అవసరాలకు ఆయా సంస్థలు వినియోగించాయనే ఆరోపణలు ఉన్నాయి.
అయోధ్య వివాదం భారతదేశ రాజకీయ, సామాజిక చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన ఉద్యమం. అందులో ఒక భిన్నమైన స్వరం కూడా వినిపించింది. అది బాబా లాల్ దాస్ స్వరం. రామ జన్మభూమి- మసీదు ప్రాంగణంలో పూజారిగా సేవలందించిన ఆయన, తరువాత కాలంలో ఉద్యమానికి సంబంధించిన ప్రధాన రాజకీయ కథనాలకు భిన్నమైన ఆయన జీవితం అంతా, మతం, రాజకీయాలు, సామాజిక బాధ్యతల మధ్య ఏర్పడిన సంఘర్షణకు ప్రతిబింబంగా కనిపిస్తుంది.
1949లో బాబ్రీ మసీదు లోపల రామలల్లా విగ్రహాలు ప్రత్యక్షమైన తరువాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకుంది. పరిమిత పూజా కార్యక్రమాలు కొనసాగించేందుకు కొందరు పూజారులను నియమించింది. ఆ బాధ్యత నిర్వహించిన వారిలో బాబా లాల్ దాస్ మొదటివారు. కోర్టు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ కారణంగా ఆయన అయోధ్యలో జరిగిన పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. 1980ల చివరలో రామ జన్మభూమి ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిన సమయంలో విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకత్వం ఉద్యమాన్ని తీవ్రవతరం చేస్తుండగా, బాబా లాల్ దాస్ మాత్రం ఉద్యమ రాజకీయీకరణపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం హిందూ ధర్మం అసలు ఆత్మకు విరుద్ధమని ఆయన పలుమార్లు పేర్కొన్నారు.
రాజకీయ ఉద్యమానికి భిన్నమైన ఆధ్యాత్మిక దృక్పథం
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత భారత చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. దేశంలో మత ఘర్షణలు చెలరేగగా, భారత రాజకీయాల్లో శాశ్వత మార్పులకు ఈ సంఘటన కారణమైంది. ఈ నేపథ్యంలో బాబా లాల్ దాస్ స్పందన ప్రత్యేకమైనది. రాముడి పేరుతో హింసను సమర్థించలేమని, మతం మనుషులను కలపడానికి ఉద్దేశించబడిందని ఆయన స్పష్టం గా అభిప్రాయపడ్డారు. రాముడు న్యాయం, కరుణ, ధర్మానికి ప్రతీక అని, ద్వేషానికి లేదా రాజకీయ ఆధిపత్యానికి ప్రతీక కాదని ఆయన పేర్కొన్నారు.
1993లో ఆయన చంపబడడానికి మూడునెలల ముందు “మానుషి” అనే పత్రిక సంపాదకురాలు మధు కుశవర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ విస్తృత చర్చకు దారితీసింది. అందులో అయోధ్య వివాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని, ప్రజల మత విశ్వాసాలను ఎన్నికల రాజకీయాలకు అనుసంధానం చేయడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు అప్పటి ఉద్యమ ప్రధాన కథనానికి భిన్నంగా ఉండటంతో ఆయన వివాదాస్పద వ్యక్తిగా మారారు. కొందరు ఆయనను శాంతి, సామరస్యానికి ప్రతినిధిగా కొనియాడగా, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ ఆయన తన అభిప్రాయాలను మార్చుకోలేదు.
బాబా లాల్ దాస్ వారసత్వం
బాబా లాల్ దాస్ పేరు అయోధ్య ఉద్యమం ప్రధాన నాయకుల జాబితాలో కనిపించకపోవచ్చు. కానీ ఆ ఉద్యమం నడిచిన కాలంలో ఆయన నిలబడ్డ స్థానం, చెప్పిన మాటలు, చూపిన సంయమనం మాత్రం చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినవి. ఆయన రామలల్లా పూజారి మాత్రమే కాదు; రామభక్తిని రాజకీయ ప్రయోజనాల నుంచి వేరు చేసి చూడాలని హెచ్చరించిన అరుదైన స్వరం కూడా. అయోధ్య వివాదం క్రమంగా దేశవ్యాప్తంగా భావోద్వేగ, రాజకీయ, మతపరమైన అంశంగా మారినప్పుడు, బాబా లాల్ దాస్ మాత్రం ఆలయంలోనే ఉండి తన నిత్యకర్మలను కొనసాగించారు. ఆయనకు రాముడు అంటే కేవలం ఒక దేవతా ప్రతిమ కాదు; ధర్మం, న్యాయం, కరుణ, సహనం వంటి విలువల ప్రతీక. అందుకే రాముడి పేరుతో ద్వేషాన్ని, విభజనను, ఎన్నికల లాభాలను సమర్ధించడం ఆయనకు అంగీకారయోగ్యం కాలేదు.
ఆయన మాటల్లో ఒక ముఖ్యమైన సందేశం ఉంది: భక్తి అనేది సమాజాన్ని కలిపే శక్తి కావాలి, విడదీసే ఆయుధం కాకూడదు. ఈ ఆలోచన అప్పట్లో ఎంత ప్రాసంగికమో, నేటికీ అంతే ప్రాసంగికం. మతం పేరుతో ప్రజలను ధ్రువీకరించే ధోరణి పెరుగుతున్న కాలంలో, బాబా లాల్ దాస్ వంటి వ్యక్తుల మాటలు మరింత విలువైనవిగా మారుతున్నాయి.
అయోధ్య ఉద్యమం చివరికి ఒక చారిత్రక మలుపు తీసుకున్నప్పటికీ, దాని దీర్ఘకాల ప్రభావం కేవలం ఆలయ నిర్మాణంతో ముగిసిపోలేదు. అది భారత రాజకీయాల్లో మతం పాత్రను, ప్రజాభావోద్వేగాల వినియోగాన్ని, మెజారిటీ మైనారిటీ సంబంధాలపై పడిన ప్రభావాన్ని కూడా లోతుగా మార్చింది. ఈ పరిణామాల మధ్య బాబా లాల్ దాస్ హెచ్చరికలు ఒక నైతిక గుర్తుగా నిలిచాయి.
ఆయనను గుర్తు చేసుకోవడం అంటే కేవలం ఒక పూజారిని స్మరించుకోవడం కాదు; భక్తి, బాధ్యత, సహజీవనం, సంయమనం వంటి విలువలను తిరిగి ఆలోచించుకోవడం. అయోధ్య చరిత్రను ఒకే కోణంలో కాకుండా, అక్కడ జీవించిన ప్రజల అనుభవాలు, భిన్న స్వరాలు, అంతర్లీన సంక్లిష్టతలతో చూడాల్సిన అవసరాన్ని ఆయన జీవితం మనకు గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో బాబా లాల్ దాస్ వారసత్వం ఒక ప్రశ్నగా మిగులుతుంది: రాముని పేరు మనకు ఏం నేర్పాలి? విభజననా, సమన్వయమా? రాజకీయ లాభమా, ధర్మబోధనా? ఆయన జీవితం ఇచ్చే సమాధానం స్పష్టం రాముడు ప్రజలను కలిపే ఆదర్శం కావాలి, విడదీసే నినాదం కాదు.
అందుకే అయోధ్య ఉద్యమ చరిత్రలో బాబా లాల్ దాస్ ఒక ఉపపాత్ర కాదు; ఆ ఉద్యమం వెనుక ఉన్న నైతిక సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన కీలక స్వరం. ఆయన మాటలు, ఆందోళనలు, నిలకడ ఇవన్నీ కలిసి ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతాయి: విశ్వాసం ఉన్న చోటే వివేకం కూడా ఉండాలి. అదే ఆయన నిజమైన వారసత్వం.
హత్య, అనుమానాలు
1993 నవంబరు 16న బాబా లాల్ దాస్ గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్య వెనుక ఉన్న కారణాలపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అంతకు ముందు ఎన్నోసార్లు ఆయనపై హత్య ప్రయత్నాలు జరిగాయి. అప్పటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. కొందరు దీనిని అయోధ్య వివాదంలో ఆయన తీసుకున్న వైఖరితో ముడిపెట్టగా, మరికొందరు ఇతర కారణాలను ప్రస్తావించారు. అయితే ఆయన హత్యకు సంబంధించిన పూర్తి సత్యం అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ కారణంగా బాబా లాల్ దాస్ మరణం ఇప్పటికీ అనేక ప్రశ్నలను మిగిల్చిన సంఘటనగానే చరిత్రలో నిలిచింది.
చరిత్ర చెప్పే పాఠం
బాబా లాల్ దాస్ జీవితాన్ని ఒక కోణంలో చూస్తే అది వ్యక్తిగత ధైర్యానికి నిదర్శనం; మరో కోణంలో చూస్తే భారత ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలకు ఉన్న స్థానం గురించి మనల్ని ఆలోచింపజేసే అధ్యాయం. ఆయన అభిప్రాయాలతో ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ మతం పేరుతో హింసకు బదులుగా సంభాషణ, సహనం, సామరస్యాన్ని ప్రతిపాదించిన ఆయన స్వరం భారత సామాజిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. నేటి భారతదేశంలో మతం, రాజకీయాలు, జాతీయత వంటి అంశాలపై తీవ్రమైన చర్చలు కొనసాగుతున్న సందర్భంలో బాబా లాల్ దాస్ జీవితం ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. మతం ప్రజలను విభజించే ఆయుధమా? లేక సమాజాన్ని ఏకం చేసే నైతిక శక్తియా? ఆయన జీవితమంతా ఇచ్చిన సందేశం రెండో దానికే మద్దతుగా కనిపిస్తుంది. అదే కారణంగా బాబా లాల్ దాస్ పేరు కేవలం అయోధ్య చరిత్రలోనే కాదు, భారత ప్రజాస్వామ్యంలో భిన్న స్వరాలకు ప్రతీకగా కూడా గుర్తుండిపోతుంది.
- హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- LIC షేర్లు 8 శాతం మేర ఎందుకు కుప్పకూలాయి.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఏమిటి..
- ఇంట్లో వెలిగించే అగరుబత్తుల పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా?
- మద్యం గుండెకు మంచిదా? చెడ్డదా? మితంగా తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదా?
- Hair Tips: ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?