మట్టిగోడల నుండి..‘మహానగరం’దాకా!
డాక్టర్_ తిప్పర్తి యాదయ్య
మహేశ్ తిప్పర్తి, మాజీ ప్రధాన కార్యదర్శి, ఎఐఎస్ఎఫ్, నల్లగొండ జిల్లా
గొప్పింట్లో పుట్టిన వారందరూ గొప్పవారు కారు. పేదింట్లో పుట్టిన వారందరూ పేదలుగ ఉండరు. అవరోధాలను సవాలుగా తీసుకొని అవకాశాలను అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్లినవారే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అందు కు డాక్టర్ తిప్పర్తి యాదయ్య జీవిత ప్రస్థానం ఒక చక్కటి ఉదాహరణ. మారుమూల పల్లెలో పుట్టి మహానగరంలో ఉద్యోగంలో మణిమాణిక్యంలా వెలిగి జులై 31న పదవీ విరమణ చేస్తున్న ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు.
నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాముల పల్లెలో తోలు శుభ్రంచేసే తిప్పర్తి అంతయ్య మనుమడిగా, కమ్యూనిస్టు కొండయ్య కొడుకుగా, మట్టిగోడల పాఠశాలలో చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టలతో అక్షరాభ్యాసం చేసి ఓనమాలు దిద్దుతూ ముచ్చటగా మూడో తరగతి వరకు చదివి, ఆపై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారిగడ్డకు నాలుగో తరగతి చదువుకు లేత వయసులో తండ్రి కష్టమని వారించినా తాత ప్రోత్సాహంతో నడకతో నడుం బిగించి ప్రయాణమయ్యాడు. బంగారిగడ్డ లో ఎనిమిదో తరగతి లేకపోవడంతో వెనక్కి రమ్మన్న తండ్రికి, తాను భారం కారాదని భావించి హాస్టల్ చదువుకు నల్లగొండకు ప్రయాణమైతే హాస్టల్ సీటు దొరకక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, తాత సూచనతో భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో ఉంటూ కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటూ, కంపతుమ్మ కట్టెలు కొట్టుకొచ్చుకొని వంట చేసుకుంటూ, డబ్బులు లేక రాత్రిళ్లు రైస్‌మిల్లులో బస్తా బియ్యం నింపితే రూపాయి చొప్పున సంపాదించుకుంటూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ దాటాడు.
డాక్టర్ కావాలనే కోరికతో ఇంటర్ బైపిసి చదివితే సీటు రాక నల్లగొండ నాగార్జున కళాశాలలో బీఎస్సీలో చేరి విద్యార్థి దశలో రాడికల్ విద్యార్థి సంఘంలో, అటుపిమ్మట ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో రాష్ట్రస్థాయి వరకు పనిచేసి సామ్యవాద భావాలు పుణికిపుచ్చుకున్నాడు. డిగ్రీ మధ్యలోనే వదిలేసి పూర్తిస్థాయి విద్యార్థి ఫెడరేషన్, యువజన సమాఖ్య నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు విద్యార్థి సంఘ నాయకురాలిగా ఉన్న వట్టేపు సౌజన్యతో పరిచయమై భావాలు కలిసిన బంధం ఏర్పడి, ఒకరినొకరు పెద్దలను ఒప్పించి 1984లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కమ్యూని స్టు పార్టీ నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కామ్రేడ్ ధర్మభిక్షం గారి ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం చేసుకున్నాడు. వారికి ప్రియ శిష్యుడుగా కొనసాగినాడు. వీరికి ముగ్గురు సంతానం.
1991 డిసెంబర్లో హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగం రావడం తో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. తన భార్యకు కూడా అప్పుడే ఉద్యోగం వస్తే ఒకే ఇంటిలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం వల్ల మరో నిరుద్యోగికి నష్టమని భావించి ఇద్దరి అంగీకారంతో అర్ధాంగి ఉద్యోగాన్ని తిరస్కరించిన ఆదర్శ దంపతులు. 1994లో ఎంఆర్పిఎస్ ఏర్పడినప్పు డు నల్లగొండ జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తూనే, ఉద్యోగం నిబద్ధతతో చేయడం పైరవీకారులకు పనిలేక కక్షగట్టి తాండూరుకు బదిలీ చేయించారు.
తాండూరులో పనిచేస్తూ షాబాద్ బండల క్వారీల్లో పనిచేసే పిల్లలకు తాను స్వయంగా ట్యూషన్లు ఏర్పాటు చేసి చదివించగా పదో తరగతి ఫలితాల ను చూసి ఆశ్చర్యపోయిన ఆనాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అజయ్ జైన్ అభినందించి ప్రశంసాపత్రం ఇచ్చారు. ‘ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చిన ధర్మభిక్షం గారికి అభినంద న సభ జరిపారు. మీరెంత తిన్నా మా పిల్లలకు మాత్రం కడుపునిండా భోజనం పెట్టండి’ అని హాస్టల్ వార్డెన్లను ప్రాధేయపడితే వార్డెన్లే సంభ్రమాశ్చర్యానికి లోనైన సందర్భాలెన్నో ఉన్నాయి.
ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు దూరవిద్య ద్వారా తన ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ సోషియాలజీ పూర్తిచేసి అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల మురికివాడల నివాసితులలో ఆరోగ్య అవగాహన పద్ధతులు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
2002లో హైదరాబాద్‌కు బదిలీ కాగానే అప్పుడప్పుడే మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్నది. ఉద్యోగంతో పాటుగా ఉద్యమ బాధ్యతలు తోడైనవి. తెలంగాణ ఉద్యోగుల సంఘాలతో కలిసి పనిచేస్తూనే, మున్సిపల్ శాఖలో తెలంగాణ మున్సిపల్ కార్మిక ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి పదవీ విరమణ నాటికి అధ్యక్షుడిగా సేవలందించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. సకల జనుల సమ్మె పిలుపు మేర కు తన ఉద్యోగం ఊడిపోతుందని తోటివారు వారించినా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ వాహనాల ద్వారా చెత్త పోసి నిరసన తెలిపారు. ప్రధాన కార్యాలయంలో నిరంతరం ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రపంచ శాంతి సంఘం అనుబంధమైన అఖిల భారత శాంతి సంఘానికి జాతీయ ఉపాధ్యక్షుడిగా అనేక దేశాలలో జరిగిన శాంతి సమావేశాల్లో భారత ప్రతినిధి గా పాల్గొన్నారు. 2005లో, 2010లో సమర్థవంతమైన అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం చేత అవార్డులు అందుకున్నారు. ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు, భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీచే 2016లో సేవారత్న అవార్డు, 2017 లో అఖిల భారత శాంతి సంఘీభావ అవార్డు, మరెన్నో ప్రశంసలు అందుకున్నారు. అనేక
సామాజిక సంస్థల్లో, దళిత చైతన్య ఉద్యమాల్లో
చురుకుగా పాల్గొన్నారు.నక్సల్బరి గర్జనకు ఏడాది ముందు జల్లుల జడివానలు కురిసే గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసంలో జన్మించి, తొలి పండుగ రక్షాబంధన్‌తో స్నేహ సంబంధాలను పుణికిపుచ్చుకొని హైదరాబాద్‌లో అందరివాడుగా ఆత్మీయంగా పిలిపించుకునే డాక్టర్ తిప్పర్తి యాదయ్య అందరికీ మంచి మిత్రుడు, అంతకుమించి ఎందరికో ఆత్మీయుడు. మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లో జులై 31న సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ (జిహెచ్ఎంసి లో జాయింట్ కమిషనర్) హోదాలో పదవీ విరమణ చేయుచున్న డాక్టర్ తిప్పర్తి యాదయ్య అభ్యుదయ, వామపక్ష, దళిత ఉద్యమాలకు మంచి మార్గదర్శకుడు.