Skip to content
జాతీయం వార్తలు

సామాజిక రుగ్మతగా మారిన నిరుద్యోగం?

Prajapaksham 30 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
సామాజిక రుగ్మతగా మారిన నిరుద్యోగం?

unemployment

డాక్టర్‌నీలం సంపత్‌

నేడు దేశంలో యువతను అత్యధికంగా పీడిస్తున్న సామాజిక రుగ్మత నిస్సందేహంగా నిరుద్యోగమే. అత్యున్నత విద్యార్హతలు ఉన్నా కోట్లాదిమంది యువతీ యువకులు ఉద్యోగావకాశాలు లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో సుమారు 371 మిలియన్ల మంది యువత ఉన్నారు. వారిలో దాదాపు 100 మిలియన్ల మంది నిరుద్యోగ రక్కసి కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. విద్యార్హతలకు, నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగం దొరకక, ఉపాధి కరువై, వయసు పెరిగేకొద్దీ తమ కాళ్లపై తాము నిలబడలేక, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చలేక, ఉద్యోగ అన్వేషణలో తమ కుటుంబాలను అప్పులకుప్పగా మారుస్తున్నామనే మానసిక వేదనతో సతమతమవుతూ కొంతమంది పిచ్చివాళ్లుగా మారి కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతుండడం బాధాకరం.
నిరుద్యోగానికి ప్రధాన కారణాలు
విద్యా విధాన లోపం: ప్రాథమిక విద్య నుండి గ్రాడ్యుయేషన్‌వరకు స్కిల్స్‌లేని ‘రోట్‌లెర్నింగ్‌’ కే పరిమితమవుతున్నాం. అనలిటికల్‌, టెక్నికల్‌, ప్రాక్టికల్‌లెర్నింగ్‌లేకపోవడం వల్ల యువత ఆలోచనా పరిధి పెరగడం లేదు.
నైపుణ్యాల కొరత: భాషాపరమైన అవరోధాలు, ఇంటర్వ్యూ నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం లేకపోవడం. కంప్యూటర్‌, టెక్నికల్‌స్కిల్స్‌లేకపోవడం వల్ల ప్రైవేట్‌ఉద్యోగాలు చేజారిపోతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాల మోజు: చాలామంది యువత జీవితమంతా ప్రభుత్వ కొలువు కోసమే కేటాయిస్తున్నారు. చివరకు ఏ ఉద్యోగం దొరక్క ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు.
సాంకేతికత ప్రభావం: AI రాకతో చాలా ప్రైవేట్‌ఉద్యోగాలు పోతున్నాయి. తక్కువ ఉద్యోగాలు, ఎక్కువ పోటీ నెలకొంది.
ఇతరత్రా: బిజినెస్‌, రియల్‌ఎస్టేట్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌వంటి రిస్క్‌ఉన్న రంగాల్లోకి యువత రాకపోవడం. GDPలో విద్యకు తగిన బడ్జెట్‌కేటాయించకపోవడం ప్రధాన అవరోధంగా భావించక తప్పదు.
దేశానికి, కుటుంబానికి నష్టం
కుటుంబం, సమాజం, బంధువుల నుండి వచ్చే ‘ఉద్యోగం ఎప్పుడు?’ అనే ఒత్తిడితో నిరుద్యోగ యువత మానసికంగా కుంగిపోతున్నారు. కండబలం, ఉడుకు రక్తం కలిగిన యువశక్తి ఖాళీగా ఉంటే నష్టం వ్యక్తులకు కుటుంబాల కే కాదు, దేశానికి కూడాను. యువ మేధస్సును వాడుకోకుండా దేశాభివృద్ధికి దోహదం చేయలేకపోతున్నాం.
ప్రపంచ వేదిక పై ‘నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ’గా డప్పు కొట్టుకునే ప్రభుత్వానికి 100 మిలియన్ల నిరుద్యోగ యువత గుండె చప్పుడు వినబడకపోవడం విడ్డూరమేననే బుద్ధిజీవుల మాటలతో ఏకీభవించకతప్పదు. మరోవైపు దేశంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించే విద్యా సంస్థలు కొరవడి ఉన్నత చదువుల పేరుతో విదేశాలకు వెళ్లే యువత సంఖ్య పెరుగుతోంది. మన యువశక్తిని ఇతర దేశాలు వాడుకుని అభివృద్ధి చెందుతున్నాయి.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కోవాలి.
నిరుద్యోగ నిర్మూలన పాలసీలు: కొత్త పరిశ్రమలు, MSMEలకు ప్రోత్సాహకాలు.
స్కిల్‌డెవలప్మెంట్‌: విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్‌, టెక్నికల్‌
నైపుణ్యాల శిక్షణ.
బడ్జెట్‌పెంపు:GDPలో విద్యకు ఎక్కువ వాటా కేటాయించాలి.
విద్యా సంస్కరణలు: చైనా విద్యా విధానం లాగా ప్రతి పనిని, జీవన విధానాన్ని చిన్నతనం నుండే అలవాటు చేయాలి. జపాన్‌తరహాలో ప్రైమరీ నుండే నైతిక విలువలు బోధించాలి.