కంగనా రనౌత్ క్షమాపణ చెప్పాల్సిందే.. సీపీఐ నారాయణ డిమాండ్
CPI Narayana
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ జెన్ జీ (Gen Z) యువత, మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అవమానకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ మండిపడ్డారు. తన వ్యాఖ్యల ద్వారా సమాజంలో తీవ్ర భావోద్వేగాలను దెబ్బతీసిన కంగన.. బాధితులైన యువతకు, మహిళలకు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించేటప్పుడు ఎంతో సంయమనం, బాధ్యతతో వ్యవహరించాలని నారాయణ హితవు పలికారు. సమాజంలో అనవసర విభేదాలను పెంచి, ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న కంగనా రనౌత్ మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో గతంలో నిరసనకారులను ఉద్దేశించి చేసిన ‘బొద్దింకలు’ అనే వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించిన తీరును నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. సదరు వ్యాఖ్యల వల్ల కలిగిన భావోద్వేగ బాధను గుర్తించి.. దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం న్యాయ వ్యవస్థ గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. పొరపాటును గుర్తించి సరిదిద్దుకునే ఇటువంటి ఉన్నతమైన సాంప్రదాయాలను మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.