Skip to content
క్రైమ్ వార్తలు

ప్రజాపక్షం ఎఫెక్ట్: కీచక సీఐ సస్పెన్షన్

Prajapaksham 29 Jul 2026 0 నిమిషాల పఠనం క్రైమ్
ప్రజాపక్షం ఎఫెక్ట్: కీచక సీఐ సస్పెన్షన్

ప్రజాపక్షం ఎఫెక్ట్: కీచక సీఐ సస్పెన్షన్

దర్యాప్తులో వెలుగు చూసిన లైంగిక వేధింపులు

సిఐ భార్య అకౌంట్లలోకి రూ. లక్షల డబ్బులు బదిలీ,

సిఐ సమక్షంలోనే అబార్షన్

ఫిర్యాదు కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చిన యువతిని లోబర్చుకుని గర్భవతిని చేసి, అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బి.సి. సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు డీజీపీ సి.వి. ఆనంద్ విచారణకు ఆదేశించినట్లు, ఈ కేసు విచారణను మల్టీజోన్ ఐజీ షానవాజ్ ఖాసీంకు బాధ్యతలు అప్పగించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

ఈ మేరకు బాధితురాలైన యువతి సమర్పించిన సాక్ష్యాధారాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాచుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సీఐ స్వయంగా బాధితురాలిని తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్లు అక్కడి ఆసుపత్రి రికార్డుల్లో ఉన్నట్లు దర్యాప్తులో వెలుగు చూసిందని పోలీసులు అంటున్నారు. అంతేకాకుండా లైంగిక వీడియోల పేరుతో బాధితురాలి నుంచి దండుకున్న సుమారు రూ.2 కోట్లలో రూ.50 లక్షల వరకు సీఐ తన భార్య అకౌంట్‌లోకి వేయించుకున్న ఆధారాలు సైతం దర్యాప్తు అధికారులకు లభించాయని, సీఐ చెప్పిన ఏ ఏ అకౌంట్లలోకి ఆ బాధితురాలు ఎంతెంత డబ్బులు వేసిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారని, అందులో కొంతమంది సీఐ బినామీల అకౌంట్లలోకి డబ్బులు వేయించుకున్నాడని ఆధారాలు లభించినట్లు సమాచారం.

ఆడపిల్లవు కదా జాగ్రత్త: సీఐ బెదిరింపులు

తనపై డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న సదరు సీఐ బాధితురాలికి ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితురాలు తిరిగి పోలీసు అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. సీఐ ఫోన్‌లో బాధితురాలితో మాట్లాడుతూ, “ఫోటోలు, వీడియోలతో సహా నాపై ఫిర్యాదు చేశావు. అందులో నేను ఒక్కడినే లేను. నీవు కూడా ఉన్నావు. ఆడపిల్లవు కదా… జాగ్రత్త” అని పరోక్షంగా బెదిరించినట్లు సంభాషణ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు చర్చించుకుంటున్నట్లు సమాచారం.

అందుకు బాధితురాలు స్పందిస్తూ, “లిఫ్ట్‌లో బట్టలు ఇప్పి నన్ను కొట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్ల అని? ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాను ఆడపిల్లనని? నా జీవితం బుగ్గిపాలు చేసి, ఇప్పుడెందుకు ఆడపిల్లనని గుర్తుకొచ్చాను? మీరు నా జీవితాన్నే నాశనం చేసి రోడ్డుమీద పెట్టారు. ఇక చూసుకుందాం లే… నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతది? పరువు పోతే పోనీ, ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. ఏదైతే అది అవుతుందిలే. సరే, ప్రాణాలు పోతాయి అంతే కదా!” అని ఎదురు సమాధానం ఇచ్చినట్లు దర్యాప్తు అధికారుల వద్ద సాక్ష్యాధారాలు ఉన్నట్లు కూడా సమాచారం.

త్వరలో కేసు నమోదు.. సీఐపై వేటుకు రంగం సిద్ధం

ఈ కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు పక్కా సాక్ష్యాధారాలను సేకరించినట్లు పోలీసులు అంటున్నారు. దీని ఆధారంగా ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. అధికారుల విచారణలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బాధితురాలిపై లైంగిక దాడితోపాటు, ఆమెతో జరిగిన రెండు కోట్ల రూపాయల వ్యవహారం కూడా సాక్ష్యాధారాలతో బయటపడడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.

ట్యాగ్‌లు: Police Telangana