Skip to content
జాతీయం వార్తలు

Public Examinations Amendment Bill: పోటీ పరీక్షల లీకేజీలకు చెక్.. పార్లమెంటులో ప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌..

Prajapaksham 27 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Public Examinations Amendment Bill: పోటీ పరీక్షల లీకేజీలకు చెక్.. పార్లమెంటులో ప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌..

Jitendra Singh

Public Examinations Amendment Bill: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల అవకతవకలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచడం, భవిష్యత్తులో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకుండా చూడడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలకమైన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026ను సోమవారం ప్రవేశపెట్టింది. విపక్షాల తీవ్ర నిరసనలు మధ్య కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ సవరణ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు.

ఇటీవల నీట్ తో పాటు పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం.. సీబీఎస్ఈ ఫలితాల్లో గందరగోళం చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టపరమైన వ్యవస్థను మరింత బలపరిచేందుకు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టానికి సవరణలు చేస్తూ కొత్త బిల్లును రూపకల్పన చేశారు. ఈ కొత్త సవరణ ప్రకారం పరీక్షల లీకేజీలు, మోసాలకు పాల్పడే ముఠాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.

ఇందులో భాగంగా నేరస్తులకు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించే అత్యంత కఠినమైన నిబంధనలను చేర్చారు. అంతేకాకుండా.. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు, విచారణలో ఆలస్యం జరగకుండా నిరోధించేందుకు ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేసులను రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే పరిష్కరించేలా ఒక పటిష్టమైన చట్టపరమైన యంత్రాంగాన్ని ఈ బిల్లు ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు.

మరోవైపు బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని సభను సజావుగా సాగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ ముఖ్యమైన చట్టంపై విపక్షాలు రాజకీయ నినాదాలు మాని అర్థవంతమైన చర్చలో పాల్గొనాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాదోపవాదాలే కీలకమని, విపక్షాలు ఇచ్చే ఏ మంచి సూచనలనైనా స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాల ఆందోళనలు సద్మమణం కాకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

ఈ చట్టపరమైన మార్పులకు అదనంగా.. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో సాంకేతిక విప్లవం తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ పరీక్షల నిర్వహణలో సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించాలి, లీకేజీలకు తావులేకుండా సిస్టమ్‌ను ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై సిఫార్సులు చేయనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే లీకేజీ ముఠాలపై ఈ సవరణ చట్టం సింహస్వప్నంగా మారుతుందని, విద్యా వ్యవస్థపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు మళ్లీ నమ్మకం పునరుద్ధరించబడుతుందని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.