Skip to content
జాతీయం వార్తలు

వీధులు మాట్లాడితే… అధికారం వినాల్సిందే!

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
వీధులు మాట్లాడితే… అధికారం వినాల్సిందే!

CJP Protest

ఫిరోజ్‌ ఖాన్‌

ప్రశ్నలు పుట్టని సమాజంలో ప్రజాస్వామ్యం బతకదు.. ప్రశ్నించనివ్వని వ్యవస్థలో స్వేచ్ఛ నిలవదు. చరిత్ర చెబుతున్న అసలు పాఠం ఇదే. భారతదేశంలో మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం నుంచి జంతర్‌ మంతర్‌, రైతు ఉద్యమాల వరకు.. దక్షిణాఫ్రికాలో నెల్సన్‌ మండేలా వర్ణవివక్ష వ్యతిరేక పోరాటం నుంచి నేపాల్‌ ప్రజాస్వామ్య ఉద్యమాలు, టియాన్మెన్‌ స్క్వేర్‌ విద్యార్థి నిరసనలు, అరబ్‌ స్ప్రింగ్‌, ఇరాన్‌ మహిళల ఉద్యమాలు, శ్రీలంక ప్రజా నిరసనలు, అమెరికా పౌరహక్కుల ఉద్యమాలు, ఆస్ట్రేలియాలో ఆదివాసీ హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం జరిగిన శాంతియుత ఉద్యమాల వరకు ప్రపంచ చరిత్ర ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది. ప్రజల ఆకాంక్షలను దీర్ఘకాలం అణచివేయడం ఏ వ్యవస్థకూ సాధ్యం కాదని అనేక చారిత్రక అనుభవాలు సూచిస్తున్నాయి. భారత రాజ్యాంగం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుత సమావేశాల హక్కుల ద్వారా ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని రక్షిస్తోంది. ఈ సమతుల్యతను సుప్రీంకోర్టు మజ్‌దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ (2018), రామ్‌లీలా మైదాన్‌ (2012), అమిత్‌ సాహ్ని బాగ్‌ (2020) వంటి కీలక తీర్పుల్లో పునరుద్ఘాటించింది.
ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు.. ఒకే బాధ్యత
ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, మీడియా పరస్పర ప్రత్యర్థులు కాదు, రాజ్యాంగ విలువలను పరిరక్షించే బాధ్యతాయుత భాగస్వాములు. ప్రజల అసంతృప్తిని ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యగా మాత్రమే కాకుండా విధానపరమైన హెచ్చరికగా స్వీకరించి పారదర్శక సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో పౌరులు తమ రాజ్యాంగబద్ధ హక్కులను శాంతియుతంగా, ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వినియోగించాలి. చట్టపాలన, ప్రజా ఆస్తుల పరిరక్షణ, పరస్పర గౌరవం ప్రజాస్వామ్య సంస్కృతికి అంతర్భాగాలు. హక్కులు, బాధ్యతలు సమతుల్యంగా నడిచినప్పుడే ప్రజాస్వామ్యం పై విశ్వాసం మరింత బలపడుతుంది.
చైతన్యంతోనే నిజమైన మార్పు
డిజిటల్‌ యుగంలో నిరసనలు కేవలం వీధులకే పరిమితం కావడం లేదు, సామాజిక మాధ్యమాల ద్వారా క్షణాల్లో ప్రపంచవ్యాప్త చర్చగా మారుతున్నాయి. దీనితో పాటు తప్పుడు సమాచారం, ద్వేషపూరిత ప్రచారం, సందర్భంలేని ప్రచార కంటెంట్‌ వంటి సవాళ్లు కూడా పెరిగాయి. అందువల్ల డిజిటల్‌ అక్షరాస్యత, వాస్తవ నిర్ధారణ,బాధ్యతాయుత సమాచార వినియోగం, నిష్పాక్షిక మీడియా ధోరణి ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అత్యవసరం. సినిమా, సాహిత్యం, కళలు సమాజానికి తుది తీర్పు ఇవ్వవు, కానీ ఆలోచింపజేసే ప్రశ్నలను లేవనెత్తుతాయి. ‘జవాన్‌’ కూడా ఆ కోణంలో ప్రజాస్వామ్యం, మంచి పాలన, పౌర బాధ్యతపై సంభాషణను విస్తరించిన చిత్రంగా నిలిచింది. చరిత్ర చెబుతున్న శాశ్వత పాఠం ఒక్కటే.. స్థిరమైన ప్రజాస్వామ్య మార్పు హింసతో కాదు, రాజ్యాంగబద్ధ సంభాషణ, చైతన్యవంతమైన పౌర భాగస్వామ్యం, స్వేచ్ఛాయుత ఎన్నికలు, జవాబుదారీతనంతో కూడిన పాలనతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు ప్రజల స్వరాన్ని వినాలి. ప్రజలు చట్టాన్ని గౌరవించాలి, మీడియా సత్యాన్ని కాపాడాలి, న్యాయవ్యవస్థ రాజ్యాంగ విలువలను సంరక్షించాలి. విప్లవం హింసతో కాదు.. చైతన్యంతో రావాలి. ప్రజాస్వామ్యం నినాదాలతో కాదు.. బాధ్యతాయుతమైన పౌరులతో బలపడాలి. ప్రశ్నించే హక్కు ఎంత పవిత్రమో, వినే బాధ్యత కూడా అంతే పవిత్రం.