Flipkart: యాపిల్ ఐఫోన్ ఆర్డర్ చేస్తే గడ్డం పెరిగే నూనె వచ్చింది.. కోర్టుమెట్లు ఎక్కిన బాధితుడు.. ఫ్లిప్‌కార్ట్‌కు రూ.1.81 లక్షల జరిమానా విధించిన కోర్టు..
Flipkart iPhone Order Goes Wrong: Customer Gets Beard Oil, Wins ₹1.11 Lakh in Court
Flipkart: యాపిల్ ఐఫోన్ ఆర్డర్ చేస్తే గడ్డం పెరిగే నూనె పంపిన వ్యవహారంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు.. దాని విక్రేత ఇంటర్నేషనల్ వ్యాల్యూ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ముంబై వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. బాధితుడికి ఐఫోన్ అసలు ధర రూ.1.11 లక్షలతో పాటు.. నష్టపరిహారంగా మరో రూ.70 వేలు చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ముంబైలోని పోవాయ్‌కి చెందిన ఒక వినియోగదారుడు 2023 ఏప్రిల్ 22న ఫ్లిప్‌కార్ట్‌లో నో-కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో రూ.1,11,793 విలువైన యాపిల్ ఐఫోన్ 14 ప్రో (128 GB) ఆర్డర్ చేశారు. మరుసటి రోజు డెలివరీ అయిన ప్యాకేజీని విప్పగా.. అందులో ఐ ఫోన్‌కు బదులుగా ‘బియర్డ్ గ్రోత్ ఆయిల్’ బాటిల్ ప్రత్యక్షమైంది. దీంతో ఆందోళన చెందిన బాధితుడు ఆధారాలతో సహా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌ను ఆశ్రయించారు. అయితే ఏప్రిల్ నుండి మే మధ్య ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫ్లిప్‌కార్ట్ సమస్యను పరిష్కరించకుండానే.. ఫిర్యాదును ‘పరిష్కరించబడింది’ (Resolved) అని పదేపదే మూసివేసింది. విసిగిపోయిన సదరు వినియోగదారుడు ముంబై సబర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను సంప్రదించారు.
ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా డబ్బులు పొందినప్పుడు.. సరిగ్గా ఆర్డర్ చేసిన వస్తువును చేర్చాల్సిన బాధ్యత ఈ-కామర్స్ సంస్థలపైనే ఉంటుందని, కేవలం అమ్మకందారునికి మధ్యవర్తిగా ఉన్నామని చెప్పి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. వినియోగదారుడి ఫిర్యాదును పరిష్కరించడంలో.. తప్పుగా పంపిన వస్తువును వెనక్కి తీసుకోవడంలో, రీఫండ్ ఇవ్వడంలో విఫలమవ్వడం తీవ్రమైన సేవా లోపమని.. అనుచిత వాణిజ్య విధానమని కమిషన్ తప్పుబట్టింది.
ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, సెల్లర్ కలిసి అసలు మొత్తం రూ.1,11,793ను ఏప్రిల్ 22, 2023 నుండి 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీనికి తోడు బాధితుడు ఎదుర్కొన్న మానసిక వేదనకు రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద రూ.20 వేలు కలిపి మొత్తం రూ.70 వేల పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న యాపిల్ ఇండియా, ఉత్పత్తుల డెలివరీ ప్రక్రియతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపిన వాదనతో ఏకీభవించిన వినియోగదారుల ఫోరం.. వారిపై నమోదైన కేసును కొట్టివేసింది.